WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పారిశ్రామిక, సర్వీసు రంగాల్లో దూసుకుపోవాలి:సిఎం చంద్రబాబు

రాష్ట్ర పారిశ్రామిక, సర్వీసు రంగాల్లో దూసుకుపోవాలని...అప్పుడే సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం నాడు 'ఉండవల్లి'లోని గ్రీవెన్స్‌సెల్‌లో నిర్వహించిన రాష్ట్ర కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం ఇప్పటికే వ్యవసాయ రంగంలో వృద్ధిసాధించిందని, దీనితో పాటు పారిశ్రామిక, సర్వీసు రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వీటిలో అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. కలెక్టర్ల సమావేశాల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ..రాష్ట్రం గత నాలుగేళ్లలో ఏమి సాధించింది...ఇంకా ఏమి సాధించాలనే విషయంపై విపులంగా ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత...ఆంధ్రాకు అన్యాయం జరిగిందని, అన్యాయాన్ని సరిదిద్దాలని ఒక పార్టీతోపొత్తు పెట్టుకుంటే...ఆ పార్టీ మోసం చేసిందని...ఆయన విమర్శించారు. ఆ పార్టీ మోసం చేసినా..తాము సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు.

15వ ఆర్థిక సంఘం నిబంధనలు గొడ్డలి పెట్టు...!

15వ ఆర్థిక సంఘం నిబంధనలు రాష్ట్రానికి గొడ్డలి పెట్టుగా మారాయని సిఎం ఆక్షేపించారు. పురోగామి పథంలో పయనిస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డంకని...అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని, కానీ...కేంద్రం ఈ రాష్ట్రాలను శిక్షిస్తుందని ఆయన విమర్శించారు. 1971 జనాభాను ప్రాతిపదికగా చేసుకుని కేంద్రం నిధులు ఇస్తామంటుందని, అదే విధంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లు తగ్గించిందని..దీంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో తాను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జనాభా నియంత్రణపై గట్టిగా కృషి చేశానని, దాంతో జనాభా పెరుగుదల తగ్గిందని...కానీ...ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తామని కేంద్రం చెబుతోందని విమర్శించారు. అయితే రాష్ట్ర జనాభా పెరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆడ,మగ జనాభా రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నాయని..దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వల్ల రాష్ట్రానికి చాలా నష్టం వస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటిపై పోరాటం చేస్తున్నామని, దీనిపై వెనక్కు  తగ్గమని సిఎం స్పష్టం చేశారు.

(155)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ