WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సాదాసీదాగా...తొలిరోజు కలెక్టర్ల సమావేశం...!

మూడు నెలలు తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని గ్రీవెన్స్‌హాల్‌లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశం తొలిరోజు సాదా సీదాగా జరిగింది. ఎటువంటి మెరుపులు..ఉరుములు లేకుండా... ప్రశాంత వాతావరణంలో కలెక్టర్ల సమావేశం జరగడంపై పలువురు అధికారులు చర్చించుకుం టున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అంటే...ఆయన అధికారులపై తీవ్ర అసహనం, ఒత్తిడి తెస్తారని...ప్రతి అంశంపై ప్రశ్నిస్తారని భావించిన వారికి ఈ సారి సమావేశంలో అవేమీ కనిపించలేదు. 

   ఉదయం పదిగంటలకు ప్రారంభమైన సమావేశాన్ని తొలుత సిసిఎల్‌ అనిల్‌చంద్రపునీతా ప్రారంభం చేశారు. తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' ప్రసంగించారు. వెంటనే రెవిన్యూమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మాట్లాడగా..తదుపరి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రసంగించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా..రాష్ట్రం అభివృద్ధిసాధిస్తోందని..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి వల్లే ఇది జరుగుతుందని పేర్కొన్నారు. తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుధీర్ఘంగా ప్రసంగించారు. నాలుగేళ్ల కాలం నుంచి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు...15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలపై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి తెలిపారు. సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలపై తమ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్న అంశాలు, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, సర్వీసు రంగాల ప్రాధాన్యత వివరించారు. నాలుగేళ్ల కాలంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. శాఖలవారీగా సమీక్ష సందర్భంగా గతంలో వలే ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఆయాశాఖాధిపతులు ప్రసంగం, స్లైడ్స్‌తో వివరణ ఇవ్వడంతోనే సరిపెట్టారు. సుధీర్ఘమైన చర్చ ఏ విషయంలోనూ జరగలేదు.అదే సందర్భంలో కలెక్టర్లపై చిరాకు పడడం కానీ, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ చేయలేదు. గత సమావేశాల్లో పలువురు కలెక్టర్లను మందలించిన సిఎం చంద్రబాబు ఈసారి వారిని ఏమీ అనలేదు. వారు చెప్పింది..మౌనంగా విన్నారన్న మాట ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి శాఖాధిపతుల నుంచి వ్యక్తం అవుతోంది.

పిల్లల్లో ఒబెసిటీపై చర్చ...!

రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది చిన్నారుల్లో ఒబెసిటీ పెరిగిపోతోందని ఆరోగ్యశాఖ సమీక్ష సందర్భంగా చర్చ జరిగింది. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉందని దీని నివారణకు కృషిచేయాలని ఆ శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య సమావేశంలో తెలిపారు. దీనిపై పలురకాలుగా చర్చ జరిగింది. పిల్లలకు రాగి సంగటి, సజ్జ,జొన్నలతో కూడిన ఆహారం ఇవ్వాలని సూచించారు. అయితే రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమశాఖ కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ రాగి సంగటి,సజ్జ,జొన్నల వంటి ఆహారంలో డాల్టాను కలుపుతున్నారని...రోజూ తీసుకునే పోషకాహారం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.

చిన్నపత్రికలు వద్దు...!

ఎప్పుడూ లేని విధంగా...కలెక్టర్ల సమావేశానికి చిన్నపత్రికల ప్రతినిధులు రావద్దని...నిర్వహకులు తెలిపారు. ఎప్పుడు కలెక్టర్ల సమావేశాలు జరిగినా...అందరినీ ఆహ్వానించే రాష్ట్ర సమాచారశాఖ... ఈసారి మాత్రం చిన్నపత్రికల విలేరులను సమావేశాలకు రానీయలేదు. కొంత మంది పత్రికా విలేకరులు సమావేశాల వివరాలు తెలుసుకునేందుకు వస్తే..వారిని గేట్‌ దగ్గరే ఆపివేశారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదు. పైగా ఈసారి సమావేశాలకు పాస్‌లు ఇచ్చారు. ఈ సంగతి విలేకరులకు ఎవరికీ తెలియదు. ఇంతకు ముందు విలేకరుల గుర్తింపు కార్డులు ఉంటే..వారిని సమావేశాలకు రానిచ్చేవారు. కానీ..ఈసారి పాస్‌లు మంజూరు చేయడంతో...సెక్యూరిటీ సిబ్బంది..అక్రిడిటేషన్‌కార్డులు ఉన్నా సమావేశాలకు అనుమతించలేదు. కృష్ణా జిల్లాకు చెందిన ఎపిఆర్‌ఒ ఒకరు అత్యుత్సాహంతో..చిన్న పత్రికల విలేకరులు ఎవరూ రావద్దు...మా వద్ద పాస్‌లు లేవు..మేము ఇవ్వలేం...అనవసరంగా..ఎందుకు ఇక్కడకు రావడం..అని హుంకరించారు. ప్రభుత్వ సమావేశాలకు చిన్న పత్రికలకు చెందిన విలేకరులు వస్తే.. సమాచారశాఖ అధికారులకు వచ్చిన నష్టమేమిటో..ఎవరికి అర్థం కావడం లేదు.  

(209)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ