WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిజాయితీకీ నిలువెత్తు నిదర్శనం... కలెక్టర్‌ వినయ్‌చంద్‌...!

ప్రకాశం జిల్లాలో ఉపాధిపథకం అమలు తీరులో ఇతర జిల్లాలతో పోలిస్తే భారీ ఎత్తున అమలు చేయటం వెనుక కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ్‌ రాత్రింబవళ్లు పనిచేయడమే కారణమని రాజకీయ, అధికార వర్గాలు చెబుతున్నాయి. పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో నిరంతర పర్యవేక్షణతో వివిధ గ్రామాల్లో ఉండే కమిటీ సంఘాలు, వారి పరిధిలోఉండే కూలీలు రోజు వారి హాజరుపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి సాధించారని, లక్ష్యాన్నిమించి పనులు కల్పించి..ఆ పథకాన్ని విజయవంతం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌  చెబుతున్నారు. అంతే కాకుండా క్షేత్రస్థాయిలో పనులు చేసే కూలీ పనిచేయించే ముఠామేస్త్రీలుకు అదనంగా రాయితీలు ఇవ్వడం పథకం విజయవంతానికి మరో కారణం. సుమారు 300కోట్ల రూపాయల విలువల గల పనులను జిల్లాలో చేయటం జరిగింది. అత్యధిక బీద కుటుంబాలకు, రోజు వారి కూలీ పనులు చేసుకునేవారికి పనులు కల్పించడంలో ప్రకాశానికే పెద్దపీట వేయడం జరిగింది. సుమారు 1500మంది అధికారుల భాగస్వామ్యంతో డ్వామా పీడీతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ...భారీ ఎత్తున పనులు కల్పించడం జరిగిందని, ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, విపక్షాల నాయకులు కూడా సహకరించారని కింది స్థాయి అధికారులు చెబుతున్నారు. కేవలం ఐదు లోపు పంచాయితీల్లోనే ఎక్కువగా పనులు చేపట్టలేకపోవడం వెనుక స్థానిక పరిస్థితులే కారణమని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా గతంతో పోలిస్తే..ఉపాధి హామీ పథకాన్ని మారుమూల గ్రామాల్లో అందరికీ వర్తింప చేస్తూ...ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేష్‌ అనిపించుకున్నారు జిల్లా కలెక్టర్‌వినయ్‌చంద్‌. 

  నిజాయితీగా, సమర్థవంతంగా, రాజకీయవర్గాలను, ఉద్యోగవర్గాలను కలుపుకుపోవడం వల్లే ఈ పథకానికి మొట్టమొదటి స్థానం వచ్చిందని...ఈ విషయంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ కష్టపడ్డారని ఆ జిల్లాకు చెందిన టిడిపి నేతలు చెబుతున్నారు. మారుమూల గ్రామాల్లో కూడా ఈ పథకం అమలు తీరును విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎటువంటి విమర్శలు చేయకపోవడం విశేషం. పార్టీలకు అతీతంగా, నిజమైన బడుగు,బీద వర్గాలకు ఉపాధి కల్పించడంలో అధికార,రాజకీయ వర్గాలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంవల్లే నెంబర్‌వన్‌ స్థానం లభించిందని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్‌గా వినయ్‌చంద్‌ బాధ్యతలు తీసుకుని సంవత్సరంపైగా గడిచింది. పదోతరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రం మొత్తం మీద మొదటి స్థానం దక్కడానికి..క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం కృషి చేసిందని చెప్పవచ్చు. అధికారపరంగా చూసుకుంటే..జిల్లాలో అనేక మార్పులు తెచ్చారు కలెక్టర్‌ వియన్‌చంద్‌. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సీనియారిటీ జాబితాను తయారు చేసి..అనేక మందికి పదోన్నతులు కల్పించారు. ఈ వ్యవహారంలో ఎటువంటి విమర్శలు, ఆరోపణలకు తావీయకుండా...వ్యవహరించారు. రెవిన్యూశాఖలో పనిచేస్తోన్న జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా...సీనియర్‌ అసిసెంట్లను డిసిలుగా...డిసిలను తాసిల్దారుగా పదోన్నతులు కల్పించడం జరిగింది. అదే విధంగా గ్రామాల్లో పనిచేస్తోన్న రెవిన్యూ అధికారుల సర్వీసులను కూడా పరిష్కరించారు. 

  రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ప్రకాశం జిల్లాలో ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు మూడు కోట్ల రూపాయలను 700మందికి అందజేశారు. ఎస్సీ,ఎస్టీ ఉద్యోగాల భర్తీతో పాటు..గతంలో ఉన్న పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలో సుమారు 60మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లాలో సమాచారహక్కు చట్టం నిర్వహించి..అక్కడికక్కడే ధరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. వేల మంది ధరఖాస్తుదారులకు వివిధశాఖలద్వారా సమాచారాన్ని అందించడం జరిగింది. 1997 నుండి పెండింగ్‌లో ఉన్న పార్ట్‌టైమ్‌ రిటైర్డ్‌ పిఆర్‌ఒలకు పెన్షన్‌ సౌకర్యం కల్పించారు. కలెక్టరేట్‌లో సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు ఇ-ఆఫీస్‌ను ఏర్పాటు చేసిన ఘనత వినయ్‌చంద్‌కే దక్కింది. రాష్ట్రంలోనే మొదటి సారిగా రెవిన్యూ గ్రీవెన్స్‌ నిర్వహించి ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి మార్గాన్ని సుగమం చేశారు. 

   ప్రకాశం జిల్లాలో ప్రతిపక్షం కూడా బలంగా ఉన్న నేపథ్యంలో అటు అధికారపార్టీతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయటంలో అన్ని రాజకీయపార్టీల అభినందనలు అందుకుంటున్న ఘనత వినయ్‌చంద్‌కే దక్కింది. ఈ విషయాన్ని ఆ జిల్లాకు చెందిన ఉద్యోగసంఘాల నాయకులు పలుసార్లు వెల్లడించారు. తమ కలెక్టర్‌ నిజాయితీపరుడు, సమర్థుడు, బంగారం లాంటి మనిషి అని పలువురు ఎమ్మెల్యేలతోపాటు, విపక్షాల ఎమ్మెల్యేలు కూడా అభినందించారు. ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటూ..క్షేత్రస్థాయిలో పనులు చక్కబెట్టడంతో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ వ్యవహరించిన తీరుతోనే ర్యాంకులు వస్తున్నాయని, తమ కలెక్టర్‌ను మరో రెండేళ్లు ఇక్కడే కొనసాగించాలని సిఎంను కోరతామని అధికారపార్టీ నాయకులు చెబుతున్నారు.

(350)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ