అవినీతి ఆరోపణలు ఉన్న 'రాంగోపాల్‌'కు మైనార్టీశాఖాధిపతి పోస్టా....!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవినీతి ఆరోపణలు ఉన్న 'రాంగోపాల్‌'కు మైనార్టీశాఖాధిపతి పోస్టా....!?

మైనార్టీ వెల్ఫేర్‌శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'ప్రవీణ్‌కుమార్‌' సరిగా పనిచేయడంలేదని...పనిపై శ్రద్ద చూపడం లేదనే కారణాలతో ఆయనను జిడిఎలో శాఖలో ఖాళీగా ఉన్న జిఎమ్మార్‌లో నియమించి...ఆయన స్థానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 'రాంగోపాల్‌'ను నియమించడం వెనుక సిఎంఒ అధికారి ప్రమేయం ఉందని అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి. పౌరసరఫరాలశాఖ ఎండిగా బాధ్యతలు నిర్వహించిన 'రాంగోపాల్‌' అవినీతిపై ఒక వైపు ఏసీబీ విచారణ జరుపుతుండగా...ఆయనను మైనార్టీశాఖాధిపతిగా ఎలా నియమించారు..? పౌరసరఫరాల సంస్థలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, దీనికి అప్పటి ఆ సంస్థ అధిపతి రాంగోపాలే బాధ్యుడని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిఒత్తిళ్లు వచ్చినా..ఎంత మంది సిఫార్సు చేసినా...ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. రాంగోపాల్‌ గాడ్‌ఫాదర్‌గా పేరున్న సిఎంఒ అధికారి ఒకరు సిఎం చంద్రబాబును ఎలా ఒప్పించారో...రాంగోపాల్‌కు మైనార్టీశాఖాధిపతి పోస్ట్‌ ఇచ్చారు. 

 నిజాయితీపరులు, సమర్ధులుగా పేరున్న అధికారుల సేవలను సక్రమంగా వినియోగించుకోకుండా..ప్రైవేట్‌ కారణాలతో ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమిస్తూ...అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మంచి పోస్టులు ఇస్తున్న ప్రభుత్వం ఏ విధమైన మెసేజ్‌ పంపుతుందో అర్థం కావడం లేదని సచివాలయ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చి వారు అక్కడ దోచుకున్న తరువాత మళ్లీ బదిలీ చేసి మరో చోట పోస్టింగ్‌లు ఇస్తున్నారని..దీంతో ప్రభుత్వమంటే వారికి లెక్కలేకుండా పోయిందనే మాట వినిపిస్తోంది. ఇవన్నీ సిఎం చంద్రబాబుకు తెలిసే జరుగుతున్నాయా..? ఉన్నతాధికారుల సూచనల మేరకే అంగీకరిస్తున్నారా..? తనకు అంతా తెలుసునని, ఏ అధికారి ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారో..తెలుసు..అటువంటి వారి గురించి నివేదకలు తన వద్ద పదిలంగా ఉన్నాయని సమీక్షల్లో చెబుతున్న 'చంద్రబాబు' ఆయన వ్యతిరేకులకు, అవినీతి ఆరోపణలున్న వారికి పెద్దపీట వేస్తున్నారనేది వాస్తవం. దీన్ని భవిష్యత్‌లో సరిచేసుకుంటారా..? లేక వదిలేస్తారా..? చూడాల్సిందే.

(247)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ