WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రివర్గంలోకి 'కోడెల'...!

15న లేదా..19న స్వల్ప మంత్రివర్గ విస్తరణ...!

'కోడెల,గిడ్డిలకు మంత్రి పదవులు...!

'దూళిపాళ్ల'కు స్పీకర్‌ పదవి...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని స్వల్పంగా విస్తరించడానికి ముహూర్తాన్ని సిద్ధం చేసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇటీవల మంత్రివర్గం నుంచి వైదొలిగిన బిజెపి మంత్రుల స్థానాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. దేవాదాయశాఖ, వైద్యఆరోగ్యశాఖలను బిజెపికి చెందిన 'పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌'లు నిర్వహించేవారు. అయితే...మారిన రాజకీయ పరిస్థితుల్లో వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయగా...దేవాదాయశాఖను డిప్యూటీ సిఎం కె.ఇ.కృష్ణమూర్తికి కేటాయించిన సిఎం...వైద్యఆరోగ్యశాఖను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. అయితే...ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండుశాఖలకు మంత్రులను నియమించాలని ఆయన తలపోస్తున్నారట. ఈ నెల15న కానీ...లేదా 19నకానీ మంత్రి వర్గ విస్తరణ చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి.ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ విజయం సాధిస్తే...అనుకున్న విధంగానే 15న మంత్రివర్గ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారట. ఒకవేళ...బిజెపి విజయం సాధిస్తే మాత్రం మరో వారం రోజుల పాటు విస్తరణ చేపట్టకుండా వాయిదా వేసుకుంటారని..ఆ వర్గాలు చెబుతున్నాయి. 15న మంత్రివర్గవిస్తరణ చేయకుంటే...19వ తేదీన చేస్తారని...అదీ వాయిదా పడితే...ఆ తరువాత రెండు లేక నాలుగు రోజుల్లో ఈ స్వల్పమంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.

'కోడెల'కు అవకాశం...!

రాష్ట్రంలో ప్రస్తుతం వేసవి ఎండలు మండిపోతున్న తరుణంలో కీలకమైన వైద్యఆరోగ్యశాఖకు మంత్రి లేకుండా ఉండడం సమంజసం కాదని సిఎం భావిస్తున్నారట. వైద్యఆరోగ్యశాఖ తన దగ్గర ఉంచుకోవడం మంచిది కాదని కూడా ఆయన ఆలోచిస్తున్నారట. అందుకే వెంటనే ఆ పదవిని ఎవరికైనా ఇచ్చేయాలని అనుకుంటున్నారట. దీనిలో భాగంగా మంత్రివర్గాన్ని స్వల్పంగా విస్తరించడానికి  సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావడంతో...ఖాళీగా ఉన్న ఈ స్థానాన్ని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు ఇవ్వాలనే ఆలోచన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో 'కోడెల' కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని 'చంద్రబాబు'పై ఒత్తిడి తెస్తున్నారట. ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష వైకాపా సభ్యులు లేరని..వారు ఇక సమావేశాలకు రారని..అటువంటి సమయంలో శాసనసభాపతిగా ఎవరు ఉన్నా....ఒక్కటేనని.. తనకు వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఆయన అన్నారని ప్రచారం జరుగుతోంది. 

  గతంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన సమర్థవంతంగా పనిచేశారు. ఒక డాక్టర్‌గా... వైద్యరంగంపై పూర్తి అనుభవం ఉన్న ఆయన వల్ల...ఆరోగ్యశాఖ పనితీరు మెరుగుపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఆరోగ్యశాఖను నిర్వహించడం...అనుభవం, సమర్థత, నిజాయితీ కలిగిన 'కోడెల' వంటి అనుభవజ్ఞుడు మంత్రివర్గంలో చేరితే బాగుంటుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. రాజకీయంగా కూడా...'కోడెల' మంత్రిగా ఉంటే...జిల్లాలో వైకాపాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్న భావన అటు కోడెల అభిమానులతో పాటు...టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో ఉంది. ఇదే అభిప్రాయం 'చంద్రబాబు'లో కూడా ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. 'కోడెల' ఖాళీ చేసిన శాసనసభాపతి స్థానం 'ధూళ్లిపాళ్ల నరేంద్ర'కు అప్పగిస్తే బాగుంటుందని...ఒక సామాజికవర్గానికి చెందిన వారి మధ్య పదవుల పంపకం పూర్తి అవుతుందని..దీంతో సామాజిక సమీకరణాల లెక్క కూడా కుదురుతుందనేది ఒక వర్గం అభిప్రాయం. గతంలో వైద్య,ఆరోగ్యశాఖను కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన 'కామినేని శ్రీనివాస్‌' నిర్వహించారు. ఇప్పుడు ఆ పదవిని 'కోడెల'కు ఇస్తే...లెక్కలు సరిపోతాయని వారు చెబుతున్నారు.

   కాగా ఎస్టీ కోటాలో 'గిడ్డి ఈశ్వరి'కి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఆమెకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని...ఇప్పుడు ఆమెను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని...కాంగ్రెస్‌కు చెందిన బాలరాజును పార్టీలోకి ఆహ్వానించి...ఆయనను అరకు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయించాలనే ఆలోచన అధిష్టానంలో ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ముస్లిం వర్గానికి చెందిన వారికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా..? లేదా..అనేది తేలాల్సి ఉంది. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం లేదని విమర్శలు వస్తోన్న తరుణంలో ఆ వర్గంలో ఎవరికైనా.. అవకాశం ఇస్తారో..లేదో చూడాలి మరి. అదే సమయంలో దేవాదాయశాఖను తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి వైదొలిగారు..కనుక..తమకూ అవకాశం కల్పించాలని 'మాణిక్యాల రావు' సామాజికవర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి చంద్రబాబు..వారిని కూడా సంతృప్తి పరుస్తారా..? లేక ఒకటి రెండు మార్పులతో ముగిస్తారా..? చూడాలి.


(1377)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ