WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోటిరూపాయల కారు కొనండి...!

ఆర్టీసీ అధికారులపై ఛైర్మన్‌ 'వర్ల' ఒత్తిడి...!

విభజిత ఆర్టీసీ సంస్థకు తొలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న 'వర్ల రామయ్య' తీరుతో అధికారులు బెంబేలు ఎత్తిపోతున్నారట. ఆయన కోర్కెలు విని అధికారులు తెల్లమొహం వేస్తున్నారట. అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంటే...ఇవెక్కడ కోర్కెలంటూ...విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉన్న తనకు 'ఫార్చూన్‌' కారు కావాలని..ఆ కారును కొనాలని ఆర్టీసీ ఉన్నతాధికారులపై ఛైర్మన్‌ 'వర్ల రామయ్య' తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. కోటి రూపాయల విలువైన ఆ కారును కొనే స్థోమత సంస్థకు లేదని...ఉన్నతాధికారులు చెబుతున్నా...'వర్ల' తన పట్టువీడడం లేదట. ఈ విషయం ఇప్పుడు ఆర్టీసీలో చర్చనీయాంశం అవుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను లాభాల బాటలోకి తీసుకువస్తానని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి పాటుపడతానని..ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందిస్తానని చెప్పుకున్న 'వర్ల' దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా...ఓ ప్రయాణీకుడి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతుండగా...ఇప్పుడు ఆయన కోరిన వ్యక్తిగత కోర్కెలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

సిఎం కాన్వాయ్‌లోనే..'ఫార్చూన్‌' లేదు...!

కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తనకు 'ఫార్చూన్‌' కారు కావాలన్న 'వర్ల రామయ్య' వ్యవహారం టిడిపి వర్గాల్లో  చర్చనీయాంశం అవుతోంది. ఆర్టీసీ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి కోటి రూపాయల కారును అడగడం ఏమిటనే ప్రశ్న ఆయా వర్గాల నుంచి వస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లోనే 'ఫార్చూన్‌' కారు లేదని...మరి 'వర్ల'కు ఇంత ఖరీదైన కారు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎందుకు ఈ విధమైన కోరికలు కోరుతున్నారో అర్థం కావడం లేదని టిడిపి నాయకులు కొందరు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కూడా ఇటువంటి కోరిక కోరలేదని....సంస్థ తీవ్రమైన నష్టాల్లో ఉంటే దుబారా ఖర్చులు చేయటం ఎందుకని సంస్థకు చెందిన కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద...'వర్ల' తీరు...సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.


(476)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ