లేటెస్ట్

'జగన్‌' పాలనపై 'తమ్ముళ్ల' ఆశ్చర్యం...!

ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం...కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి 'నారా చంద్రబాబునాయుడు' ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తుంటే...ఆయన పార్టీకే చెందిన కొందరు పార్టీ నాయకులు మాత్రం 'జగన్‌'పాలనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా పాలన చేయగలడా...? ఆయనకు ఇన్ని అధికారాలు ఉన్నాయా..? ఎవరినైనా..రాజకీయంగా, ఆర్థికంగా, అధికారికంగా లొంగతీయగలరా...? అంటూ ఆశ్చర్యం, విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఐదు మాసాలు కాకముందే వారు...ఇలా ప్రశ్నించుకుంటున్నారు. ఆయనకు పాలనానుభవం లేదు..పరిపాలనాపరంగా ఆయన ఫెయిల్‌ అవుతారని భావించాం...అది కొంత వరకు నిజమే అవుతోంది. కానీ..రాజకీయంగా ఆయన వేస్తోన్న ఎత్తులు, చేస్తోన్న వ్యవహారాలు తమను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని పలువురు టిడిపి నాయకులు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. 

'జగన్‌' ముఖ్యమంత్రి అయిన వెంటనే తమను వేధిస్తారని భావించాం..ఆయన మనస్తత్వం తెలిసిన వారెవరైనా..ఆయన ఇలానే చేస్తారని ఊహిస్తారు. కానీ...తన రాజకీయ ప్రత్యర్థులు ఎంతటి చిన్నవారైనా వారిని ముప్పుతిప్పలు పెట్టడం చూస్తుంటే తాము అంచనా వేసినట్లుగా లేదని వారు వాపోతున్నారు. గ్రామీణస్థాయిలో టిడిపి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు 'జగన్‌' తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. తనను గతంలో విమర్శించిన, తమ పార్టీని వేధించిన పలువురు టిడిపి మాజీ ఎమ్మెల్యేలను 'జగన్‌' ఒక ఆట ఆడుకుంటున్నారు. ఉదాహరణకు 'దెందులూరు' ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విషయాన్నే తీసుకుందాం...ఆయన గతంలో 'జగన్‌'పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. 'జగన్‌,పవన్‌'లు కలసితనపై పోటీ చేసినా..తానే నెగ్గుతానని చెప్పుకున్నారు. అటువంటి 'చింతమనేని' ఎన్నికల్లో ఓడిపోయి మాజీ అయిన తరువాత ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. ఆయనే కాదు...పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టిడిపి నాయకులనే కాదు..ఆ పార్టీకి ఆర్థికంగా సహాయం చేస్తారనే పేరున్న పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన వారిని కూడా అణిచివేస్తున్నారు. వారికి కాంట్రాక్టులు, ఇతర పనులు ఇవ్వకుండా, బిల్లులు చెల్లించకుండా...చేసి వారిని నిర్వీర్యులను చేస్తున్నారు. 

ఒకవైపు ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతూనే...తన పార్టీ వారికి మాత్రం కావాల్సిన సౌకర్యాలు అమర్చిపెడుతున్నారని, తమ అధినేత చంద్రబాబు మాత్రం ఇలా చేయలేకపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనలో వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలను దగ్గరుండి 'జగన్‌' అన్నీ చూసుకుంటున్నారని, మరే పార్టీ ఈ రకంగా చేయదని వారు అంటున్నారు. గ్రామవాలంటీర్లు, పంచాయితీ పోస్టుల దగ్గర నుంచి వివిధ ఉన్నతమైన ఛైర్మన్లు, సలహాదార్లు, ఇతర పదవుల్లో తన పార్టీ, తనకు మేలు చేసినవాళ్లనే 'జగన్‌' ఆగమేఘాలపై నియమించుకున్నారు. ఈ నియామకాల్లో ఎటువంటి సంశయాలకు, అనుమానాలకు తావులేకుండా జీవోలపై జీవోలు ఇచ్చుకుంటూ వెళుతున్నారు. తన వాళ్లు అనుకున్నవాళ్లిని ఆయన అందలం ఎక్కిస్తున్నారు. పొరపాటున టిడిపికో...లేదా టిడిపిని సమర్థించే సామాజికవర్గానికి చెందినవారని భావిస్తే..వాళ్లు ఎలా వచ్చినా వారిని పక్కన పెడుతున్నారు. స్వచ్చమైన వైకాపా, వైకాపా అభిమానులను మాత్రమే ఆయన వివిధ పదవుల్లో నియమిస్తూ..పార్టీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. 

'జగన్‌' పాలనా విధానంపై టిడిపి నాయకులు కొందరు మాట్లాడుతూ గతంలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి టిడిపిని అణిచివేసేందుకు ఎంతో ప్రయత్నించారని, కానీ ఆయన కొంత వరకు బెటర్‌ అని..తాము కూడా కాంగ్రెస్‌ అనో..లేదా..వై.ఎస్‌కు విధేయులమనే ఆయన దగ్గరకు వెళితే చేరదీశారని, కానీ...ఇప్పుడు 'జగన్‌' అటువంటి వారిని దగ్గరకు రానీయడం లేదంటున్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వేధింపుల్లో కొంత వరకే చేశారని, కానీ..'జగన్‌' మాత్రం వేధింపుల పర్వాన్ని పరాకాష్టకు తీసుకెళ్లారని, ఇది తమను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తోందంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు టిడిపి నాయకులను, కార్యకర్తలను వేధించారని కానీ ఈ స్థాయిలో వ్యక్తిగతంగా మాత్రం చేయడం లేదని ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తాము ఊహించలేదని వారు చెబుతున్నారు. మా పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని కానీ ఈ రకంగా నిర్ణయాలు తీసుకోలేదంటున్నారు. 'జగన్‌' వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనలోని హీరోయిజాన్ని చూపిస్తున్నాయని, ఏదయితే అది అవుతుందనే భావన వల్లే ఆయన రాజకీయంగా ముందుకు వెళ్లగలుగుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. తమ ముఖ్యమంత్రుల్లో 'ఎన్టీఆర్‌' మొదట్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆయనకు ప్రజల్లో మంచి పేరు వచ్చిందని, తరువాత కాలంలో అల్లుళ్లు, భార్య సలహాలతో కొంత చెడ్డపేరు తెచ్చుకున్నారని, 'చంద్రబాబు' ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రత్యర్థులను రాజకీయంగా అణద్రొక్కడంలో విఫలమయ్యారని, ఆయన వైఫల్యం ఇప్పుడు పార్టీపై ప్రభావం చూపిస్తోందని, 'జగన్‌'ను ఎదుర్కోవాలంటే ఆయనకంటే దూకుడుగా వెళితే సాధ్యం అవుతుందని, కానీ, 'చంద్రబాబు' ఆయన కుమారుడు దూకుడుగా వెళ్లలేరని, ఇదే 'జగన్‌'కు ప్లస్‌ అవుతుందని వారు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద..తొలిసారిగా 'జగన్‌' దూకుడైన పాలన చూస్తోన్న తెలుగు తమ్ముళ్లు తమ అధినేత ఎందుకు ఈ విధమైన నిర్ణయాలు తీసుకోలేదని మదనపడుతున్నారు. 

(448)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ