WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నర్సరావుపేట' బరిలో మంత్రి 'శిద్దా'...!

రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల వేడి రగులుతోంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయంఉండడంతో...అధికార,ప్రతిపక్షాలు తమ పార్టీ తరుపున ఎవరిని పోటీ చేయించాలనే విషయంపై కసరత్తులు చేస్తున్నాయి. దీనిలో భాగంగా...ఇప్పటికే కొన్ని పార్టీలు..తమ అభ్యర్థులను బహిరంగంగానే ప్రకటించాయి. ప్రతిపక్ష వైకాపా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులువీరని ప్రకటించింది. ప్రతిపక్షం దూకుడుగా వెళుతుంటే...అధికారపక్షం మాత్రం అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి స్పందిస్తోంది. కాగా...పల్నాడుకు ముఖ ద్వారమైన 'నర్సరావుపేట' రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన సీనియర్‌ నేత...'రాయపాటి సాంబశివరావు' తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో...ఇక్కడ నుంచి పోటీ చేయాలని చాలా మంది టిడిపి నేతలు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆసక్తికరంగా గుంటూరు జిల్లాకు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి 'శిద్దా రాఘవరావు' ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానానికి తాను పోటీ చేస్తానని..ఆయన సన్నిహితులతో చెబుతున్నారట. తాను..నర్సరావుపేట బరిలో ఉంటే...తన భార్య..దర్శిని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని...ఆయన చెబుతున్నారట. గత ఎన్నికల్లో 'దర్శి' నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన 'శిద్దా' తరువాత 'చంద్రబాబు' మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి మంత్రిగా పనిచేస్తోన్న 'శిద్దా'...ఇప్పుడు తాను పార్లమెంట్‌కు వెళతానని చెబుతున్నారట. తనకు నర్సరావుపేట సీటు ఇస్తే...సులువుగా విజయం సాధిస్తానని...ఆయన అంటున్నారు.

  గత ఎన్నికల్లో...గుంటూరులోని మూడు పార్లమెంట్‌ స్థానాల్లో టిడిపి విజయం సాధించింది. గుంటూరు, నర్సరావుపేట, బాపట్లల్లో ఆ పార్టీ అభ్యర్థులు 'గల్లా జయదేవ్‌, రాయపాటి సాంబశివరావు, మాల్యాద్రిలు విజయం సాధించారు. అయితే...ఈ సారి..తాను ఎన్నికల్లో పోటీ చేయనని..రిటైర్‌ అవుతానని 'రాయపాటి సాంబశివరావు' పలుసార్లు చెప్పారు. అనారోగ్య కారణాలతో ఆయన పోటీ చేయకపోతే...ఈ స్థానం నుంచి ఆయన కుమారుడుపోటీ చేస్తారని ఎక్కువ మంది భావించారు. అయితే...ఆయన కుమారుడు తాను 'అసెంబ్లీ'కి పోటీ చేస్తానని చెబుతున్నారట. దీంతో..ఈ పార్లమెంట్‌ స్థానం కోసం టిడిపిలో రేసు మొదలైంది. ఇక్కడ నుంచే గతంలో గెలుపొందిన గుంటూరు-2 శాసనసభ్యుడు 'మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి' ఈసారి తనకు ఆ సీటు ఇవ్వాలని కోరుతున్నారట. ఆయనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు కూడా..తనకా సీటు ఇవ్వమని కోరుతున్నారట. తనకు నర్సరావుపేట పార్లమెంట్‌ సీటు, తన భార్యకు వినుకొండ అసెంబ్లీ సీటు ఇస్తే...పల్నాడులో పార్టీకి తిరుగులేని విజయాన్ని తెచ్చిపెడతామని చెబుతున్నారట. ఇప్పుడు వీరికి మంత్రి శిద్దా రాఘరావు తోడయ్యారు. వైశ్య కులానికి చెందిన తాను అక్కడ నుంచి పోటీ చేస్తే..తన సామాజికవర్గానికి చెందిన వారి ఓట్లు గంపగుత్తగా పడతాయని...వినుకొండ, నర్సరావుపేట, సత్తెనపల్లి, గురజాల తదితర నియోజకవర్గాల్లో తన సామాజికవర్గానిదే గెలుపోటములు నిర్ణయించే శక్తి ఉందని...తనకు పార్లమెంట్‌ సీటు ఇస్తే...ఆ ప్రభావంతో...అసెంబ్లీ సీట్లను కూడా గెలుస్తారని చెబుతున్నారట. అంతే కాకుండా ఆర్థికంగా ఎంతైనా ఖర్చు చేయగల సామర్ధ్యం ఆయనకు ఉన్నదని...ఆయనకు సీటు ఇస్తే మంచిదేనని పలువురు టిడిపి నాయకులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ ఇదే సామాజికవర్గానికి చెందిన 'రోశయ్య' గెలుపొందారని... ఈసారి...కూడా అటువంటి ఫలితాలు పునరావృతం అవుతాయని వారు అంటున్నారు. మరి...అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.


(5308)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ