లేటెస్ట్

నాడు 'నంద్యాల'...నేడు 'హుజూర్‌నగర్‌'....!

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో ఘనవిజం సాధించిన తరువాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. ఉపఎన్నిక విజయం ఆయనలో ధీమాను పెంచిందనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఏడు వేల తేడాతో ఓడిపోయిన తన పార్టీ ఇప్పుడు 43వేల మెజార్టీతో గెలవడంతో..రాష్ట్రంలో ఇక తన దరిదాపుల్లోకి ఎవరూ వచ్చే సాహసం చేయలేరనే భావన ఆయన మాటల్లో వ్యక్తం అవుతోంది. అది కొంత వరకు నిజమే...? ఎన్నికల విజయాలు ఎప్పుడూ నాయకుల ఆత్మస్ధైర్యాన్ని పెంచడంతో పాటు..మితిమీరిన అహంకారం, అహంభావానికి కారణం అవుతాయి. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన 'మోడీ, అమిత్‌షా'ల ద్వయం కూడా ఇటువంటి అహంకారధోరణి,పెడసరధోరణి వల్లే ప్రతిష్టను కోల్పోతూ వచ్చారు. అహంకారంలో 'కెసిఆర్‌' వారిద్దరికీ ఏమీ తీసిపోడు...? ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత...ఆయన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు..ఆయన తీరును తేటతెల్లం చేస్తాయి. సరే..ఎన్నికల్లో గెలిచిన తరువాత..ప్రతివారూ చేసేది అదేననుకోండి...తమకు ఎదురులేదు..తిరుగులేదు..అంతా తమ అధీనంలోనే ఉంది..తామే ఎప్పటికీ అధికారంలోనే ఉంటామనే మితిమీరిన విశ్వాసంతో ఉంటారు. 

ఇప్పుడు వచ్చిన హుజూర్‌నగర్‌ ఎన్నికల ఫలితాలు 'కెసిఆర్‌' రెండోవిడత పాలనకు రెఫరెండమా..? అంటే కాదనే చెప్పాలి. ఉపఎన్నికల గెలుపుతోనే..అంతా అయిపోయింది..ఇక ఆర్టీసీ సమస్య లేదు..దాన్ని మూసివేయడమే..అంటోన్న 'కెసిఆర్‌' ఈ ఫలితాలు శాశ్వితం కాదనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఉపఎన్నికల గెలుపుతో మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే మితిమీరిన విశ్వాసం ఉంటే అది నిజం కాదని..ఆయన మాజీ గురువు 'చంద్రబాబు'ను చూసి నేర్చుకోవాలి. 'చంద్రబాబు' ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీకి చెందిన శాసనసభ్యుడు 'భూమా నాగిరెడ్డి' మరణంతో 'నంద్యాల'లో ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా 'జగన్‌' దాదాపు పదిహేను రోజులు కాలికి బలపం కట్టుకుని ఆ నియోజకవర్గం మొత్తం కలియతిరిగాడు. ఎందుకంటే అప్పటికే 'చంద్రబాబు' పరిపాలన సరిగా లేదని, ప్రజలనుమోసగిస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఉదృతం చేస్తున్నారు. అదే సమయంలో 'నంద్యాల' నుంచి తన పార్టీ తరుపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 'భూమా'కు ఫాఠం నేర్పాలనే లక్ష్యంతో 'జగన్‌' అన్ని రోజులు ప్రచారం చేశాడు. కానీ..'చంద్రబాబు' అధికార బలం ముందు..'జగన్‌' ప్రచారం, మాటల దాడి పనిచేయలేదు. ఆ ఎన్నికల్లో టిడిపి 27వేల మెజార్టీతో గెలుపొందింది. నాడు 'నంద్యాల'లో టిడిపి గెలిచిన తరువాత..'చంద్రబాబు' కూడా ఇదే విధంగా మాట్లాడారు. ప్రతిపక్షానికి రాష్ట్రంలో చోటు లేదని, ఆ పార్టీ పనిఅయిపోయిందని..ఇంకా ఏదేదో చెప్పుకున్నారు. కానీ...సార్వత్రిక ఎన్నికల సమయానికి ఏం జరిగిందో..అందరూ చూశారు...! 'నంద్యాల'లో అంత మెజార్టీతో గెలిచిన టిడిపి చివరకు 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాడు ఉపఎన్నికల సందర్భంగా 'నంద్యాల'లో ఏమి జరిగిందో..అక్కడి ఓటర్లను ఎలా ప్రలోభపెట్టారో..? ఎన్ని హామీలు ఇచ్చారో..ఎంత సొమ్ము పంచారో..? మంత్రులు ఏమి చేశారో..? ఎమ్మెల్యేలు కులాల వారీగా ఎలా మద్దతు కూడగట్టారో..మీడియా రంగంలో ఉన్న ప్రతివారికీ తెలిందే. ఉపఎన్నికల ఫలితాలను నాడు 'చంద్రబాబు' తమ పాలనకు నిదర్శనమని భావించారు. కానీ..అది నిజం కాదని సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. 

మరి ఇప్పటి హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక ఫలితాలను కూడా 'కెసిఆర్‌' 'చంద్రబాబు' వలే తీసుకుంటున్నారా..? ప్రజలంతా తన వైపే ఉన్నారనుకుంటున్నారా..? రాష్ట్రంలో ఇంకేమీ సమస్యలు లేవు..అందరూ సర్వభోగాలతో తులతూగుతున్నారనుకుంటున్నారా..? అలా అనుకుంటే ఆయన కూడా 'చంద్రబాబు' వలే బోల్తా పడ్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. హుజూర్‌నగర్‌ సీటు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానమే కావచ్చు. కానీ..అక్కడ తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు..ఎలా పార్టీని గెలిపించారో..వారు అలా చేయడానికి వెనుక నుండి తానెంత ప్రోత్సహించారో 'కెసిఆర్‌'కు తెలుసు.కానీ..విజయం సాధించిన మత్తులో తాను అజేయుడననే భావనను ఆయన మీడియా మందు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవు..అంతా ప్రతిపక్షాల ప్రచారమే ఆర్భాటమేనని భావిస్తే..తన మాజీ గురువుకు జరిగిన శాస్తే...'కెసిఆర్‌'కు జరుగుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

(719)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ