WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సాయి' సక్సెస్‌...'సుజనా' ఫెయిల్‌....!

వాళ్లిద్దరూ రాష్ట్రం నుంచి రెండు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు. ఒకరిది అధికార పార్టీ కాగా...మరొకరిది..ప్రతిపక్ష పార్టీ. రాష్ట్రంలో హోరాహోరిగా తలపడే...ఈ రెండు పార్టీల అధినేతలకు వాళ్లిద్దరూ అంతరంగికులు...ఇరు పార్టీల్లో అధినేత తరువాత స్థానం వారిదే. వారిలో ఒకరు కేంద్రంలో మొన్నటి దాకా మంత్రి పదవిని అనుభవించి...ఇటీవలే రాజీనామా చేశారు. మరొకరు..రెండేళ్ల క్రితం రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే...వీరిద్దరిలో ఒకరు పార్టీ అధినేత తనకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేయగా...మరొకరు మాత్రం అధినేత అప్పగించిన పనులు చేయడంలో విఫలమై పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారనే మాట రాజకీయవర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఆ ఇద్దరెవరో చెప్పలేదు కదా...వారే.. రాజ్యసభ ఎంపీలు 'విజయసాయిరెడ్డి', సుజనాచౌదరిలు. గత కొన్ని రోజులుగా  వీరిద్దరి పనితీరుపై స్వంత పార్టీలో చర్చలు సాగుతున్నాయి. విజయసాయిరెడ్డి తనకు అప్పగించిన పని పూర్తి చేసి...పార్టీ నాయకులతో శభాష్‌ అనిపించుకుంటుంటే...సుజనాచౌదరి మాత్రం అందుకు విరుద్ధంగా..స్వంత పార్టీ నుంచే విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటూ...చివరకు పార్టీ నుంచి నిష్క్రమిస్తారనే ప్రచారాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పైన చెప్పుకున్న ఇద్దరూ...ఏ విధంగా పనిచేశారనే దానిపై వివరంగా చర్చించుకుందాం.

'విజయసాయిరెడ్డి': వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన ఆడిటర్‌గా ఆయనకు పేరుంది. రాజశేఖర్‌రెడ్డి జీవించిన కాలంలో ఆయన కేవలం వై.ఎస్‌ కుటుంబ ఆడిటర్‌గానే ఉండేవారు. వై.ఎస్‌.మరణించిన తరువాత...'జగన్‌'పై అవినీతి కేసులు నమోదు అయ్యాక... విజయసాయిరెడ్డి ఎవరో బయట ప్రపంచానికి తెలిసింది. 'జగన్‌' అక్రమంగా ఆస్తులు పోగేసు కోవడంలో...ప్రధాన సూత్రధారి 'విజయసాయిరెడ్డే'నని సీబీఐ తేల్చింది. 'జగన్‌' అవినీతి కేసుల్లో 'జగన్‌'ను ఎ1 నిందితుడిగా చేర్చిన సీబీఐ 'విజయసాయిరెడ్డి'ని ఎ2గా పేర్కొంది. ఈ అవినీతి కేసుల్లో...ఇద్దరూ దాదాపు తొమ్మిది నెలల పాటు జైలు జీవితం గడిపారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయిన తరువాత...'జగన్‌'...'విజయసాయిరెడ్డి'ని రాజ్యసభకు పంపారు. ఇక అక్కడ నుంచి..'విజయసాయిరెడ్డి' ఢిల్లీలో తన చాకచక్యాన్ని చూపడం ప్రారంభించారు. తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన 'విజయసాయిరెడ్డి' ఢిల్లీలో పెద్దవారి పరిచయాల కోసం పరితపించిపోయారు. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న 'విజయసాయిరెడ్డి'ని 'సుజనాచౌదరే' బిజెపి పెద్దలకు పరిచయం చేశారని అంటుంటారు. ఆయన కాదు..గాలి జనార్దన్‌రెడ్డి వారితో సంబంధాలు పెంపొందించారని మరో రకంగా చెబుతారు. అయితే...ఎవరు పరిచయాలు చేసినా...తరువాత 'విజయసాయిరెడ్డి' దూసుకెళ్లారు. 

   ప్రధాని 'మోడీ'తోనూ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతోనూ...బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా'తోనూ నిత్యం టచ్‌లో ఉంటూ..వారి మన్నలను పొందారు. అంతే కాకుండా...ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో సంబంధాలు పెట్టుకుని...రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వంపై చాడీలు చెప్పడం ప్రారంభించారు. రాష్ట్రంలో టిడిపి నానాటికి బలహీనపడుతుందని, వైకాపా బలపడిపోతుందని... ఆయన రిపోర్టుల మీద రిపోర్టులు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు ఇచ్చారు. తొలినాళ్లలో దాన్ని లైట్‌గా తీసుకున్న బిజెపి అధిష్టానం...రాష్ట్ర బిజెపి నేతలు కూడా అదే పాట పాడేసరికి...'విజయసాయిరెడ్డి'ని దగ్గరకు తీయడం ప్రారంభించారు. ఇదే సమయంలో...రాష్ట్రపతి ఎన్నికల్లో భేషరతుగా వైకాపా బిజెపికి మద్దతు ఇవ్వడం, బిజెపి పెద్దలకు, వివిధ రకాలైన స్వామీజీల కాళ్లకు 'జగన్‌,విజయసాయిరెడ్డి'లు పోటీలు పడి పాదనమస్కారాలు చేయడంతో...'బిజెపి' పెద్దలు వారిని కరుణించారు. వారిని దగ్గరకు తీస్తూ...టిడిపిని దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇదంతా 'విజయసాయిరెడ్డి' చేసిన లాబీయింగ్‌ ప్రభావం వల్లే సాధ్యమైంది. తరువాత పరిస్థితుల్లో...టిడిపి,బిజెపిల మధ్య ఇంకా అగాధం పెంచడానికి...'విజయసాయిరెడ్డి' పలు ఎత్తులు వేసి...చివరకు అనుకున్నది సాధించి...పిఎంఒలో కీలకమైన లాబీయిస్ట్‌గా తయారు అయ్యారు. దీంతో...'మోడీ,చంద్రబాబు'ల మధ్య ఉన్న అంతంత నమ్మకం కూడా పోయి...చివరకు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద విజయసాయిరెడ్డి తనకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసి..అధినేత వద్ద మార్కులు కొట్టేశారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి,వైకాపా,జనసేనల పొత్తుకు మార్గం ఏర్పరచి...సూపర్‌ సక్సెస్‌ను ఈ రాజ్యసభ సభ్యుడు సాధించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సుజనాచౌదరి: తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..వ్యాపారవేత్తగా...ఆ పార్టీ రాజకీయాల్లోకి వచ్చారు 'సుజనాచౌదరి'. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో....పార్టీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే...ఆదుకుని..పార్టీకి జీవం పోశారనే పేరు సంపాదించుకున్నారు. అదే సమయంలో..అధినేత 'చంద్రబాబు'కు ఆత్మీయుడయ్యారు. దీంతో..రాజ్యసభ స్థానాన్ని దక్కించుకుని పార్టీలో కీలకంగా ఎదిగారు. వ్యాపారవేత్తగా...కోట్లు సంపాదించిన 'సుజనా' పార్టీ కోసం జంకు లేకుండా వందలకోట్ల రూపాయలను గుమ్మరించారని పార్టీ నేతలు అంటుంటారు. 2009 ఎన్నికల్లో పార్టీ ఖర్చులను భరించారు. అయితే..ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయినా...ఆయన వెనుకంజ వేయలేదు. తరువాత ఐదేళ్ల పాటు..పార్టీ కోసం కృషి చేశారు. 2014 ఎన్నికల సమయంలో తాడేపేడో తేల్చుకోవాల్సిన సమయంలో..భారీగా నిధులు వెచ్చించి...పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేశారు. అన్నీ తానై కొన్ని చోట్ల అభ్యర్థులను గెలిపించుకున్నారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత...ఆయనకు అధినేత చంద్రబాబు మంచి ప్రాధాన్యతనే ఇచ్చారు. కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించారు. బ్యాంకులకు అప్పులు ఎగగొట్టారనే ఆరోపణలు ఉన్న 'సుజనాచౌదరి'ని క్యాబినెట్‌లోకి తీసుకోవడానికి 'మోడీ' నిరాకరిస్తే..పట్టుపట్టి..మరీ ఆయనకు 'చంద్రబాబు' మంత్రి పదవి ఇప్పించాడంటారు. అయితే..మంత్రి పదవి పొందిన తొలినాళ్లల్లో...ఢిల్లీలో బిజెపి పెద్దలకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన సంధాన కర్తగా వ్యవహరించారు. 

  మొత్తం రెండేళ్లపాటు..ఎటువంటి ఇబ్బందులు రాకుండా...'సుజనా' కేంద్రం, రాష్ట్రం మధ్య వారధిగా వ్యవహరించారు. అంతే కాకుండా...రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా.. 'చంద్రబాబు'ను ప్రత్యేకప్యాకేజీకీ ఒప్పించారు. అయితే...ఇక్కడ నుంచే 'సుజనా' వైఫల్యం మొదలైంది. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ఆర్థిక సహాయం ఇస్తుందని కేంద్రంతో చెప్పించినా..దాన్ని చట్టంలో పెట్టించడంలో 'సుజనా' విఫలం చెందారు. అంతే కాకుండా...బిజెపి,టిడిపికి మధ్య విభేదాలు ముదురుతున్నా...ఆయన పెద్దగా పట్టించుకోలేదని పార్టీ నాయకులు అంటుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 'మోడీ' దాదాపు సంవత్సరం పాటు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోయినా...'సుజనా' దాని గురించి ఎన్నడూ మాట్లాడలేదు. సరికదా...బిజెపి వారితో చెట్టాపట్టాలు వేసుకుతిరు గుతున్నారనే విమర్శను ఎదుర్కొన్నారు. ఒకవైపు వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు... 'విజయసాయిరెడ్డి' టిడిపి,బిజెపి బంధానికి చిల్లులు పెడుతుంటే...'సుజనా' చోద్యం చూస్తున్నారనే విమర్శ వచ్చింది. కేంద్ర స్థాయిలో మంత్రిగా పనిచేస్తూ...కూడా...బిజెపి,టిడిపి మధ్య సమన్వయం నెరపడంలో 'సుజనాచౌదరి' ఘోరంగా విఫలమయ్యారు. దీంతో..బిజెపి,టిడిపి బంధం తెగిపోయింది. పొత్తు తెగిపోయిన..తరువాత కూడా 'సుజనా' సరిగా వ్యవహరించలేదనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరినప్పుడు కూడా...ఆయన వెంటనే స్పందించలేదట. అంతే కాకుండా రాజీనామా చెయ్యననే విధంగా మాట్లాడరనే మాట వినిపించినా.. చివరకు అన్యమనస్కంగానే రాజీనామా చేశారు. తరువాత పోరుబాట పట్టిన టిడిపితో ఆయన పెద్దగా కలవడం లేదు. ఈ విషయాన్ని పట్టించుకున్న 'చంద్రబాబు' ఆయనను లైట్‌ తీసుకోవడం మొదలు పెట్టారు. మొన్న తిరుపతిలో నిర్వహించిన సభలో 'సిఎం' లేనప్పుడే...'సుజనా' నాలుగు ముక్కలు మాట్లాడి..మమ అనిపించారు. మొత్తం మీద..తనకు అప్పగించిన పని చేయడంలో విఫలమై...నేడో...రేపో పార్టీ నుంచి వెళ్లిపోతారనే స్థితికి 'సుజనాచౌదరి' చేరుకున్నారు. ఏది ఏమైనా...పైన చెప్పిన ఇద్దరు రాజ్యసభ్యుల్లో ఒకరు మాత్రం పార్టీ, పార్టీ అధినేత శ్రేయస్సు కోసం పాటుపడితే...మరొకరు మాత్రం స్వంత వ్యాపారాల కోసం..పార్టీని, అధినేతను ఇబ్బందులు పాలుచేశారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.

(దావులూరి హనుమంతరావు)


(492)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ