లేటెస్ట్

'వంశీ' వెళ్లకపోతేనే ఆశ్చర్యం...!

గన్నవరం టిడిపి ఎమ్మెల్యే 'వల్లభనేని వంశీ' పార్టీ మార్పుపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఆయన బిజెపిలోకి వెళతారని లేదూ..వైకాపాలోకి వెళతారని గట్టిగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను 'వంశీ' ఎప్పుడూ ఖండించలేదు. అవును..అని కానీ...కాదు అని కానీ చెప్పలేదు. తాను పార్టీ మారితే అందరికీ చెప్పి మారతానని చెబుతూ వస్తున్నారు. అయితే మూడు నాలుగు రోజుల నుంచి ఆయన నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతూ వస్తున్నారు. ఆయన పార్టీ మారేందుకే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నారని వార్తలు రాగా..ఆయన ఆ విషయం గురించి నేరుగా మాట్లాడకుండా...తనపై అధికారపార్టీ నేతలు పెడుతున్న కేసుల గురించి మాట్లాడి..పార్టీ మారితే అందరికీ చెబుతానని ముగిస్తున్నారు. అయితే నిన్నంతా ఆయన బిజెపి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు 'సుజనాచౌదరి' వెంటనే తిరగడం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం అవడంతో..ఆయన బిజెపిలోకి వెళతారని టిడిపికి చెందిన నాయకులు, కార్యకర్తలు భావించారు. కాగా ఈ రోజు ఆయన అనూహ్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నివాసంలో ప్రత్యక్షమడంతో...ఆయన బిజెపిని కాదనుకుని అధికారపార్టీలో చేరుతున్నారని తెలిసింది. ఈ విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సిఎంతో సమావేశమయ్యాయనని, నియోజకవర్గంలోని సమస్యలు, తనపై పెట్టిన కేసుల గురించి ఆయనతో చర్చించానని చెప్పుకున్నారు. అధికార పార్టీతో కలసి పనిచేస్తానని, పార్టీ మార్పుపై దీపావళి తరువాత...చెబుతానని చెప్పారు. అయితే..ముఖ్యమంత్రితో సమావేశం తరువాత...ఆయన పార్టీ మారడం ఖాయమైందని అధికారపార్టీ నాయకులు, ప్రతిపక్షానికి చెందిన నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద..'దీపావళి' తరువాత..ఆయన వైకాపాలో అధికారికంగా చేరడం జరుగుతుందనేది స్పష్టమైంది. కాగా..ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తే...గన్నవరంలో ఉప ఎన్నికలు జరగడం ఖాయం.  

ఎప్పటి నుంచో ఊహిస్తున్నదే...!

'వల్లభనేని వంశీ' టిడిపి నాయకుడైనా..ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో ఎప్పటి నుంచో సంబంధాలు కొనసాగిస్తున్నారు. వై.ఎస్‌.జగన్‌కు తాను అతి సన్నిహితుడినని ఆయన పలు సందర్భాల్లో తన అంతరంగికుల వద్ద తెలిపారు. 2012లో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్నప్పుడు రోడ్డుపైనే 'వంశీ' ఆయనను ఆలింగనం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాడు టిడిపి 'జగన్‌'పై హోరాహోరిగా పోరాడుతున్నసమయంలో 'వంశీ' 'జగన్‌'ను ఆలింగనం చేసుకుని ముచ్చట్లు పెట్టడంపై పార్టీ అధినేత 'చంద్రబాబు' సీరియస్‌ అయ్యారు. అయితే తరువాత పరిస్థితుల్లో ఆయన కొంత తగ్గి 'వంశీ'కి 'గన్నవరం' సీటు ఇచ్చారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినా...'వంశీ'కి 'చంద్రబాబు' ప్రాధాన్యత ఇవ్వలేదు. కృష్ణా జిల్లాల్లో 'దేవినేని ఉమామహేశ్వరరావు'కు అధిక ప్రాధాన్యత ఇచ్చిన 'చంద్రబాబు' 'వంశీ'పై శీతకన్నువేశారు. 'జగన్‌'ను బహిరంగంగా ఆలింగనం చేసుకున్నందునే 'చంద్రబాబు' ఆయనను పట్టించుకోలేదని పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్పట్లో భావించారు. అయితే నియోజకవర్గ అభివృద్ధికి 'బాబు' నిధులు బాగానే కేటాయించారు. మొన్నటి ఎన్నికల ముందు వరకు మౌనంగా ఉన్న 'వంశీ' ఎన్నికల నామినేషన్‌ సమయంలోనే పార్టీ ఫిరాయించాలని భావించారని వార్తలు వచ్చాయి. తనపై ఒత్తిడి వస్తోందని, పార్టీలో ఉండలేనని, పోటీ చేయలేనని ఆయన చెప్పారంటారు. అయితే ఎట్టకేలకు ఎన్నికల్లో పోటీ చేసిన 'వంశీ' కనాకష్టంగా గెలిచారు. ఆయన గెలిచిన దగ్గర నుంచి...ఆయన పార్టీ మారతారనే వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. 'జగన్‌'కు అత్యంత దగ్గరైన 'వంశీ' పార్టీలో ఉండరని పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యాలయనాయకులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. అయితే మధ్యలో 'సుజనాచౌదరి'ని చూపించి బిజెపిలో చేరతారని కొన్నాళ్లు ప్రచారం చేయించారు. ఆయన మొదట నుంచి ఒకే అభిప్రాయంతో ఉన్నారని, ఎప్పటి నుంచో ఆయన 'జగన్‌' పంచన చేరాలని భావిస్తున్నారని, అయితే నేరుగా ఆ విషయం చెప్పకుండా బిజెపి అని కొన్నాళ్లు చెప్పి..ఇప్పుడు ముసుగు తొలగించారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే అన్యమనస్కంగా పార్టీలో కొనసాగుతున్న 'వంశీ' ఇప్పుడు స్థిరమైన నిర్ణయం తీసుకుని..తాను అనుకున్న మార్గంలో ముందుకు వెళ్లబోతున్నారు. మరి ఆయన ఎంచుకున్న మార్గం ఆయనకు ఎంత వరకు మేలు చేస్తుందో చూడాలి మరి. 

(504)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ