WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'యనమల' రికార్డును 'కోడెల' బద్దలు కొట్టేనా...!?

అసెంబ్లీ స్పీకర్‌ పదవిని నిర్వహిస్తూ..ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన ఘనత ప్రస్తుత ఆర్థికమంత్రి 'యనమల రామకృష్ణుడికే దక్కింది. 1995 నుండి 1999 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించిన విషయం విదితమే. 1999లో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి ఎన్నికల బరిలోకి దిగడంతో...చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా 'యనమల' విజయం సాధించారు. ఆ విధంగా ఆయన సాధించిన రికార్డు అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు బద్దలు కొడతారా..? లేదా..? అన్నదానిపై అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. ఇంతకీ కోడెల 'నర్సరావుపేట'లో పోటీ చేస్తారా..? లేక సత్తెనపల్లిలో పోటీ చేస్తారా..? అనే విషయం సందిగ్ధంలో ఉంది. ఒక వేళ సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తే...'యనమల' రికార్డును 'కోడెల' బద్దలు కొట్టడం ఖాయం. అదే నర్సరావుపేట నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఏమిటి..? ఆ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ నుండి పోటీ చేసినా తాను విజయం సాధిస్తాననే నమ్మకం కోడెలకు ఉంది. 1978 నుంచి...2014 వరకు స్పీకర్‌ పదవిని నిర్వహించి ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసిన రికార్డు 'యనమల'కు మాత్రమే ఉంది. తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా...అవలీలగా గెలుస్తానని..ఆ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు 'కోడెల'. 1978లో స్పీకర్‌ పదవి నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తండ్రి దివి కొండయ్యచౌదరి మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఆయన తరువాత ఆ పదవి నిర్వహించిన ఎ.ఈశ్వరరెడ్డి(తిరుపతి) ఘోరంగా ఓడిపోయి రాజకీయంగా తెరమరుగు అయ్యారు. టిడిపి హయాంలో స్పీకర్‌ పదవి నిర్వహించిన సత్యనారాయణ 1984లో నాదెండ్లకు మద్దతు ఇచ్చి..మంత్రి అయి...రాజకీయంగా పూర్తిగా తెరమరుగు అయ్యారు. 

  1985లో స్పీకర్‌ పదవి చేపట్టిన జి.నారాయణరావు తరువాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి మరణించారు. 1990లో స్పీకర్‌ పదవి నిర్వహించి రామచంద్రారెడ్డి మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. ఆయన తరువాత కేంద్ర పదవి చేపట్టిన శ్రీపాదరావు అనామకుని చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 1999లో స్పీకర్‌ పదవి నిర్వహించిన శ్రీమతి ప్రతిభాభారతి..మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా దెబ్బతిన్నారు. 2004లో స్పీకర్‌ పదవి చేపట్టిన కె.ఆర్‌.సురేష్‌రెడ్డి తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయారు. 2009లో స్పీకర్‌ పదవి చేపట్టిన ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి..తరువాత ముఖ్యమంత్రి అయి..తరువాత ఎన్నికల్లో..పోటీ చేయలేదు. తరువాత స్పీకర్‌ అయిన నాదెండ్ల మనోహర్‌ 2014 ఎన్నికల్లో ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. మనోహర్‌ తరువాత స్పీకర్‌ అయిన 'కోడెల' 'యనమల' రికార్డును బద్దలు కొడతారా..? లేదా..? మాజీ స్పీకర్ల వలే..రాజకీయంగా కనుమరుగైపోతారా..? అనే దానిపై రాజకీయపరిశీలకులు చర్చలు చేస్తున్నారు. సత్తెనపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తే..ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనను గెలిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయంపై పలువురు అడిగిన ప్రశ్నలకు కోడెల స్పందిస్తూ..పార్టీ అధిష్టానం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే..అక్కడ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఎంపీగా పోటీ చేసే ప్రసక్తేలేదని చెబుతున్నారు. 'కోడెల' మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించి...'యనమల' రికార్డును బద్దలు కొట్టి పల్నాడు పులి ప్రతాపం చూపుతారని ఆయన అభిమానులు..టిడిపి కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు అమలు చేసిన పథకాలు..గిన్నిస్‌బుక్‌లో చోటు చేసుకున్నాయని...అటువంటి నాయకుని సత్తెనపల్లి నాయకులు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని...ప్రత్యర్థులు ఎవరైనా అవలీలగా ఓడించి...సంచలనం సృష్టించి...గుంటూరు జిల్లాలో రాష్ట్ర స్థాయిలో సువర్ణాక్షరాలతో ఆయన చేయగలరు...సత్తెనపల్లి ఎంపిపీలు, జెడ్‌పిటిసిలు,ఎంపిటిసి,సర్పంచ్‌లు ఇటీవల సమావేశం అయినప్పుడు...ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

(127)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ