లేటెస్ట్

'నీ ఒక్కడిపైనే దాడులు జరుగుతున్నాయా...'వంశీ'....?

గన్నవరం టిడిపి ఎమ్మెల్యే 'వల్లభనేని వంశీ' పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు...పోతూ పోతూ తనకు రెండుసార్లు పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు...తన ఇబ్బందులేమిటో లేఖలో రాశారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానంటూ, ఇలాంటి రాజకీయాలు చేయలేనని, కక్షసాధింపు చర్యల వల్ల పగలు పెంచుకోలేనని, తన వంటి పరిశుద్ధ ఆత్మలు పనిచేసే పరిస్థితి లేదని, తన అనుచరులను, కార్యకర్తలను వేధిస్తున్నారని, వారిని కాపాడుకునేందుకే అస్త్రసన్యాసం చేస్తున్నానని వీలైనంత దీనంగా, అమాయకంగా చెప్పుకున్నారు. కొంత మంది టిడిపి కార్యకర్తలకు, ఆయన వర్గీయులకు ఆయన రాసిన లేఖను చూసిన వెంటనే 'పాపం..ఆయన ఈ రాజకీయాలు చేయలేక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారు...పాపం..వైకాపాను తట్టుకోలేకపోతున్నారనే భావన వచ్చి ఉంటుంది.  మరి కొందరు నిజమే కదా..వారు వేధిస్తున్నారు కదా..అందుకే వెళుతున్నాడేమో..అంటూ కాసేపైనా ఆయనపై సానుభూతి చూపారు. 'వంశీ' ఆశించినట్లు కాసేపైనా..ఆయనపై సానుభూతి వర్షం కురిసింది. కానీ..టిడిపి అధినేత ఆయన కంటే రెండాకులు ఎక్కువ చదివారు..కదా..వెంటనే ఆయన రాజీనామాకు రిప్లైరాశారు. 

రాష్ట్రంలో 'నీ ఒక్కటిపైనే వైకాపా నాయకులు వేధింపులు,దాడులు చేస్తున్నారా...? రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సామాన్య కార్యకర్తల నుంచి, సానుభూతిపరులు, పార్టీ సీనియర్‌ నాయకులు ఇతరులను వైకాపా నేతలు వేదిస్తూనే ఉన్నారు. వారి వేధింపులను  నాయకులు మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తున్నారు. నీపై జరుగుతున్న దాడులను పార్టీ చూసుకుంటుంది. పార్టీ కార్యకర్తలను, ఇతర ముఖ్యనాయకులను పార్టీ రక్షిస్తుంది...స్వయంగా తానే పోరాటానికి నేతృత్వం వహిస్తాను..ఇలాంటి దాడులకు బెదిరేది లేదు..అంటూ చాలా కూల్‌గా లేఖ వచ్చింది. అంటే 'వంశీ'కి కొంచెమైనా సానుభూతి దక్కకూడదన్న లక్ష్యంతో 'చంద్రబాబు' వెంటనే దీనిపై స్పందించినట్లు ఉంది. ఆయన పార్టీలో ఉండడు..ఇప్పటికే మాట్లాడుకున్నారు..ఇప్పుడు దాడులు, వేధింపులతో రాజకీయాలకు దూరం అవుతున్నాననే సాకు చెప్పి సామాన్య, మధ్యతరగతి ప్రజల సానుభూతిపొందాలని చూస్తుంటే...ఆయనకెందుకు ఆ సానుభూతిని రానివ్వాలనే ఉద్దేశ్యంతో...'చంద్రబాబు' తిరుగు లేఖాస్త్రాన్ని సంధించారు. మొత్తం మీద...రాజీనామా తరువాత రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానంటూ 'వంశీ' వేసిన ఎత్తుగడను...'చంద్రబాబు' తిప్పికొట్టారు. 

(927)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ