లేటెస్ట్

'జగన్‌' డిఫెన్స్‌లో పడ్డారా...!?

రాజకీయంగా ఎదురులేని స్థితిలో ఉన్న వైకాపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి తనపై ఉన్న కేసులు చికాకులు సృష్టిస్తున్నాయా...? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించి పరిపాలనపై ఇప్పుడిప్పుడే పట్టుబిగిస్తోన్న ఆయనకు తనపై ఉన్న కేసులు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తుండడంతో ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ హయాంలో పెట్టిన ఈ కేసులు విచారణ గత కొంతకాలంగా వేగంగా సాగుతోంది. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరిస్తూనే తనపై ఉన్న కేసుల విషయంలో కోర్టుకు హాజరవుతూ వచ్చారు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాత..ఆయన కోర్టులకు వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు. దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ముఖ్యమంత్రిగా ఉన్నా...'జగన్‌' కోర్టుకు హాజరు కావాల్సిందేనన్న సీబీఐ మాటను సీబీఐ కోర్టు అంగీకరించింది. కేసుల విషయంలో హోదాలు పక్కన పెట్టాల్సిందేనని, ముఖ్యమంత్రి అనేది హోదా మాత్రమేనని వాదించింది. సీబీఐ వాదలను కోర్టు అంగీకరిస్తూ..ఈ రోజు 'జగన్‌' ప్రతివారం కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై 'జగన్‌' న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తీర్పు ఏమి వస్తుందో కానీ..ఈ కేసుల వల్ల 'జగన్‌' రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఒక ముఖ్యమంత్రి ప్రతివారం కోర్టుకు హాజరైతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. అదే సమయంలో పరిపాలనపై ఇప్పుడున్న పట్టు కొనసాగే అవకాశాలు లేవు. నైతిక విషయం ముందుకు వస్తే...చికాకులు ఎదుర్కోవాల్సిందే. మరోవైపు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోవడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని, కోర్టు కేసులు పదుర్కొంటున్న వ్యక్తికి పాలించే అర్హత లేదని యాగీ చేయడానికి ప్రయత్నిస్తాయి. మరో వైపు స్వంత పార్టీ నాయకులు కూడా కట్టుదప్పే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అణిగిమణిగి ఉన్ననాయకులు 'జగన్‌' రోజూ కోర్టుకు హాజరైతే వారు చులకనగా వ్యవహరిస్తారని అంటున్నారు. రాజకీయంగా తిరుగులేని స్థానంలో ఉన్న 'జగన్‌' అవినీతి కేసుల విచారణతో తీవ్ర చికాకులు ఎదుర్కొంటున్నారనడంలో సందేహం లేదు. హైకోర్టులో దీనికి సంబంధించి రిలీఫ్‌ వస్తే ఫర్వాలేదు కానీ...ఒక వేళ రాకపోతే మాత్రం ఆయనకు ఇక్కట్లు తప్పవని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కాగా...దీనిపై వైకాపాకు చెందిన కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తూ..కాంగ్రెస్‌, టిడిపి కలిసి కుట్ర చేసి కేసులను బనాయించాయని, ఈ కేసులను పదుర్కోవడంలో 'జగన్‌' ధైర్యంగా ముందుకు వెళుతున్నారని, గత ఐదేళ్ల నుంచి ఆయన ప్రతిపక్షనాయకుడిగా ఉన్నా..ఆయన కోర్టుకు హాజరయ్యారని, ఇప్పుడు..కోర్టు హాజరు కావాలంటే హాజరవుతారని, ఆయనకు చట్టంపై గౌరవం ఉందని అంటున్నారు. మొత్తం మీద...రాజకీయంగా బలంగా ఉన్న 'జగన్‌' కోర్టు కేసులతో చికాకులు ఎదుర్కొంటున్నారు. 

(377)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ