లేటెస్ట్

కులమీడియా కట్టడి కోసమేనట..ఆ జీవో...!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన జీవో నెం.2430 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆధారాలు లేకుండా, అసత్యకధనాలు, బురద చల్లే వార్తలు రాస్తే..రాసిన జర్నలిస్టులపై, ఆయా మీడియా సంస్థలపై కేసులు పెట్టాలని వివిధశాఖాధిపతులకు అధికారం ఇస్తూ..ప్రభుత్వం ఇచ్చిన జీవో చర్చనీయాంశం అవుతోంది. జర్నలిస్టులను కట్టడి చేయడానికి, తద్వారా భావస్వేచ్చ, పత్రికాస్వేచ్చను హరించడానికే ప్రభుత్వం ఇటువంటి జీవోను విడుదల చేసిందని పాత్రికేయులతో పాటు, ప్రతిపక్షాలు కూడా దండెత్తుతున్నాయి. జాతీయ స్థాయి మీడియా వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. ఇటువంటి జీవోలు విడుదల కావడం ఇదే తొలిసారి కాదు...కానీ..అన్నిశాఖల శాఖాధిపతులకు కేసులు వేసే అధికారం అప్పగించడం మాత్రం ఇదే తొలిసారి. ప్రతిపక్షాలు, మీడియా సంఘాలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తుంటే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వాన్ని సమర్థించే కొందరు మాజీ జర్నలిస్టులు మాత్రం జీవోలో తప్పులేదని ప్రభుత్వం చేసింది సరైన చర్యే అంటూ సమర్థిస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు జర్నలిస్టు ఉద్యమనేతగా ఉన్న 'దేవులపల్లి అమర్‌' దీనిపై స్పందిస్తూ తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టులపై చర్యలు తీసుకోవడంలో తప్పేముందని విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. రాజ్యాంగంలో జర్నలిస్టులకు ప్రత్యేకహక్కులు లేవని, నిరాధర, తప్పుడు, బురదచల్లే వార్తలు రాస్తున్నారని వీరిని కట్టడి చేయడానికే ఇటువంటి జీవో ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. జర్నలిస్టుల హక్కులు, పత్రికా స్వేచ్ఛ గురించి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చే 'అమర్‌' ప్రభుత్వ సలహాదారు పదవి స్వీకరించిన తరువాత వాటిని మరిచిపోయి ప్రభుత్వ భజన చేస్తున్నారనే మాట జర్నలిస్టు వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. కాగా నిన్నటి దాకా 'సాక్షి' ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పదవిని చేపట్టిన 'శ్రీరామచంద్రమూర్తి' కూడా ప్రభుత్వానికి వంతపాడారు. కొంత మంది మీడియాధిపతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారని, అసత్యాలను వండివార్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవడంలో తప్పులేదని తేల్చారు. వాక్‌స్వాతంత్య్రం, భావస్వేచ్చ, పత్రికాస్వేచ్ఛకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. 

వీరిద్దరూ ఇలా వ్యాఖ్యానిస్తే...రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి 'కొడాలి నాని' మరో అడుగు ముందుకువేసి..తాము కలలాకు సంకెళ్లు వేయలేదని 'కులమీడియా'కు సంకెళ్లు వేశామని వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తలు రాసే కులమీడియాకు సంకెళ్లు వేశామని పరోక్షంగా ఓ కులాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే పత్రిలకు కులముద్ర వేసి, దానిలో పనిచేసే వారందరిని ఒకే గాటన కట్టి..విమర్శలు చేయడంపై సర్వత్రా విమర్శలకు కారణం అవుతోంది. ఆ రెండు పత్రికలు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఇతరమీడియా సంస్థల్లో పనిచేసే వారందరూ ఒకే కులానికి చెందిన వారా..? వారు తప్ప అక్కడ ఎవరూ పనిచేయడంలేదా..? ఇప్పటి వరకు రాజకీయాల కోసం కులాలను రెచ్చగొట్టిన రాజకీయ నేతలు ఇప్పుడు జర్నలిస్టులను కులాల వారీగా విభజించి పాలిస్తారేమో..?

(365)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ