పార్టీ కార్యకర్తల మనోభిప్రాయాల ప్రకారమే నడుచుకుంటాం:లోకేష్
కార్యకర్తలకు ‘లోకేష్’ బహిరంగ లేఖ
ఇటీవల కాలంలో ‘టిడిపి’ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టీ అధినేత, ఆయన కుమారుడు ‘లోకేష్’పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జగించే చర్యలకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత తమ మనోభిప్రాయాలకు గౌవరం ఇవ్వడం లేదని, పట్టించుకోవడం లేదని, గతంలో తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని, అవినీతి,అరాచకాలకు, హత్యలకు, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలేవనే ఆందోళన పార్టీలో తీవ్రమైంది. అంతే కాకుండా ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ప్రత్యర్థుల పట్ల మెతకవైఖరి అవలంభిస్తున్నారని, కొందరు చెప్పినట్లు పార్టీ నడవదన్నట్లు ఆయన అన్నారని జరిగిన ప్రచారం పార్టీలో నిస్తేజానికి, నిరుత్సాహానికి కారణమైంది. ‘తండ్రీకొడుకులు’ మారరనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో అధిష్టానం.. వారిని బుజ్జగించేందుకు, మళ్లీ తమ దారికి తెచ్చుకునేందుకు చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా గతంలో తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేది లేదని, టిడిపి కార్యకర్తలను హత్యలు చేసినవారినీ, అక్రమాలను చేసిన వారెవరినీ వదిలిపెట్టమని, పార్టీ కార్యకర్తల మనోభిప్రాయాల ప్రకారమే పార్టీ నడుచుకుంటుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. తన లేఖలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ చాలా గట్టిదని, ఒకరితో ప్రారంభమై కోటి మందికి చేరిందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న పార్టీ కార్యకర్తల వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని, బలగమని, గొంతు కోస్తోన్నా పార్టీ జెండాను వీడని ‘చంద్రయ్య’ తనకు ప్రతిక్షణం గుర్తుకు వస్తారని, అదే విధంగా ఉన్మాదంగా దాడి చేస్తోన్న వెనక్కు తగ్గకుండా పోరాడిన ‘అంజిరెడ్డి’, రిగ్గింగ్‌ను అడ్డుకున్న ‘ఉక్కు మహిళ’ ‘మంజుల’ధైర్యం చూస్తే తనకు గర్వంగా ఉంటుందని, ప్రాణం ఎక్కువా...? పార్టీ ఎక్కువా? అంటే పార్టీనే అనే కార్యకర్తలు లక్షల మంది ఉన్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని, ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని, ఇటువంటి కార్యకర్తల మనోభిప్రాయాల ప్రకారమే పార్టీ నడుస్తుందని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటే..పొగిడేది కార్యకర్తలేనని, ఒకవేళ ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నా..ప్రశ్నించేది కూడా వీరేనని, దేశంలో ఏ పార్టీలోనూ ఇటువంటి పరిస్థితి లేదని, పార్టీ జాతీయ అధ్యక్షుడు ‘చంద్రబాబునాయుడు’ తనతో ఎప్పుడూ పార్టీ కార్యకర్తల గురించే చర్చిస్తుంటారని, వారి సంక్షేమానికి ఆయన ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం మీద ‘తండ్రీకొడుకులు’ కార్యకర్తల విషయంలో జరిగిన పొరపాటుకు వెంటనే దిద్దుకుంటున్నారు. ముఖ్యంగా ‘నారా లోకేష్’ కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ..వారి సమస్యలను పరిష్కరిస్తూ, వారి మనోభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరలోనే అవినీతిపరులు, అక్రమార్కులు, హత్యలు చేసిన వారిపై చర్యలు ఉంటాయన్న ‘చంద్రబాబు’ మాటలూ..పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాయి. చూద్దాం..ఏమి చేస్తారో..?