WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కెసిఆర్‌కు గడ్డుకాలం...!

గత నాలుగేళ్ల నుంచి ఆడింది..ఆట..పాడింది పాటగా...పాలన సాగించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఎన్నికల ఏడాది...అన్నివైపుల నుంచి...శత్రువులు ముట్టడిస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని అధికారపీఠానికి ఎగబాకిన కెసిఆర్‌కు...ఇప్పుడు వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తుండడంతో ఏమి చేయాలో తెలియని సంకట స్థితిలోకినెట్ట వేయబడ్డారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు..తెలంగాణ తెచ్చిన నాయకునిగా.. తెలంగాణ వాసులు కెసిఆర్‌కు పట్టం గట్టారు. అంతంత మాత్ర మెజార్టీతోనే కెసిఆర్‌ ప్రభుత్వంలోకి వచ్చారు. తొలినాళ్లలో తన అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి..ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకున్న కెసిఆర్‌ తరువాత...వివిధ సంక్షేమ కార్యక్రమాలకు తెరతీసి..బంగారు తెలంగాణ తనతోనే సాధ్యమని ప్రకటనలు గుప్పించుకున్నారు.

  వివిధ సంక్షేమ పథకాలను భారీ ప్రకటించిన కెసిఆర్‌..తరువాత వాటి అమలులో మాత్రం వెనుకంజవేశారు. ముఖ్యంగా దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. అదే సమయంలో బడుగు,బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయారు. ప్రజాకర్షక పథకాలకు తెరతీసి..ప్రజలను తనవైపు తిప్పుకుంటున్నానని ఆయన భావిస్తున్నా...ప్రజలు మాత్రం..ఆయన ఆశించిన రీతిలో కెసిఆర్‌కు మద్దతు ఇవ్వడం లేదు. నాలుగేళ్ల పరిపాలనా కాలంలో తాను..ఫలానా పనిచేశానని గొప్పగా చెప్పుకోవడానికి...ఆయన వద్ద ఏమీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మైనార్టీలకు ఇచ్చిన 12శాతం రిజర్వేషన్‌ విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ, ఆయన ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదు. తెలంగాణ వచ్చిన వెంటనే లక్షలాది ఉద్యోగాలు భర్తీ అవుతాయని నిరుద్యోగులు ఆశిస్తే.. వారు ఆశించిన విధంగా జరగలేదు. ఉద్యమ సమయంలో ఇంటికో..ఉద్యోగం ఇస్తామని చెప్పిన కెసిఆర్‌..ఇప్పుడు మాత్రం...ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని దబాయించడం.. వారిని తీవ్రంగా బాధిస్తోంది. అదే సమయంలో...ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానన్న కెసిఆర్‌..ఆ హామీని మరిచిపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. 

  తెలంగాణలో భారీగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి...రైతులను ఆదుకుంటానన్న కెసిఆర్‌..ఇంత వరకు ఒక్క ప్రాజెక్టును కూడా ప్రారంభించలేకపోయారు. అదే సమయంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా...అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో పరిపాలనలోనూ ఘోరంగా విఫలమయ్యారనే మాట వినిపిస్తోంది. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేలు..సామంత రాజుల వలే వ్యవహరిస్తూ..ప్రజలను బాధిస్తున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు..ప్రజలకు దూరమై...పార్టీ,ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుతున్నారు. ఇప్పుడున్న వారిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు మళ్లీ గెలిచే పరిస్థితుల్లో లేరని కెసిఆర్‌ స్వంత సర్వేలోనే తేలింది. కాగా...నిన్న జరిగిన దళితుల సభ కెసిఆర్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అశేషంగా దళితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

   తెలంగాణలో దళితులపై జరుగుతున్న దాడులు, ఎస్సీ,ఎస్టీ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కెసిఆర్‌ ప్రభుత్వం స్పందించకపోవడం తదితర అంశాలను ఈ సభ హైలెట్‌ చేసింది. ఇప్పటికే తమను కెసిఆర్‌ మోసం చేశారనే భావంతో ఉన్న దళితులు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ వైపు ఏకపక్షంగా మొగ్గుతారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు, బీసీలు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారంతా...కెసిఆర్‌పై ఆగ్రహంతో ఉన్నారు. నాలుగేళ్లపాటు ఏకపక్షంగా పాలన చేసిన కెసిఆర్‌కు రాబోయే ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రచార్భాటంతోనూ, మీడియాను మేనేజ్‌ చేస్తూ వస్తోన్న కెసిఆర్‌కు రాబోయే కాలం గడ్డు కాలం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ గడ్డుకాలాన్ని తట్టుకుని..ఆయన విజయతీరాలకుచేరతారా..? లేదో..వేచి చూడాలి.

(412)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ