అవినీతి అధికారులను భుజాన వేసుకుంటున్న మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవినీతి అధికారులను భుజాన వేసుకుంటున్న మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి...!

చిత్తూరు జిల్లాలో జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో, పోస్టింగ్‌ల్లో చాకచక్యంగా, అతి తెలివితేటలతో మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో అన్నీ జరుగుతున్నట్లు కలరింగ్‌ ఇస్తూ..అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు కీలక పోస్టులను మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఇస్తున్నారని...దీనిపై విచారణ జరపాలని కొంత మంది జిల్లా నాయకులు ముఖ్యమంత్రి 'చంద్రబాబు'ను కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఎక్సైజ్‌శాఖలో అధికారిగా పనిచేస్తోన్న మహిళా అధికారిపై ఏసీబీ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆమెను చిత్తూరు డిప్యూటీ కమీషనర్‌గా నియమించాలని కోరడం, వెంటనే ఆమెను నియమించడం జరిగింది. అప్పట్లో ఈ విషయాన్ని కలెక్టర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎక్సైజ్‌శాఖాధిపతి అప్పట్లో సెలవుపై ఉన్న సమయంలో ఆమెను చిత్తూరు డిసిగా నియమించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. మంత్రి లోకేష్‌ స్వయంగా చెప్పడం వల్ల..సిఎంఒ అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని ప్రచారం జరిగింది. 

   ఇది ఇలా ఉండగా..ఇటీవల పలమనేరులో గనులశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా 'సింగ్‌'ను నియమించాలని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆ శాఖ మంత్రి సుజయరంగారావును కోరారు. 'గాలి' కేసులో ముద్దాయిగా ఉన్న 'సింగ్‌'ను ఏసీబీ అధికారులు సస్పెండ్‌ చేయడం జరిగింది. అంతే కాకుండా..ఇదే హోదాలో పలమనేరులో ఆరు సంవత్సరాలపాటు 'సింగ్‌' విధులను నిర్వహించారు. పలమనేరులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా 'సింగ్‌'ను నియమించాలని మంత్రి సుజయను కోరారు. 'సింగ్‌'పై ఉన్న ఆరోపణలు...ఇతర అవినీతి కేసుల వివరాలను మంత్రి 'సుజయరంగారావు'కు అధికారులు పంపారు. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న 'మంత్రి సుజయరంగారావు' ఈ విషయంలో సిఎం నిర్ణయం తీసుకోవాలని ఫైల్‌ను సిఎంఒకు పంపారు. అక్కడ గనులశాఖను పర్యవేక్షించే సిఎంఒ అధికారి ముఖ్యమంత్రి ఆమోదించారని సంబంధిత ఫైల్‌పై రాయకుండా...డిపార్ట్‌మెంట్‌ సిఫార్సులను అమలు చేయండి..అని రాశారు. ఇక్కడ గనులశాఖ ఉన్నతాధికారులు కానీ..ఆశాఖ మంత్రి కానీ...'సింగ్‌'ను నియమించాలని ఎటువంటి సిఫార్సు చేయలేదని సిఎంఒ అధికారికి తెలిసినా..ఎక్కడ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో సంబంధిత ఫైల్‌ను ఆ విధంగా రాయించి ఉంటారని ఆశాఖ అధికారులు చెప్పుకుంటున్నారు. చివరకు మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి...పలమనేరులో 'సింగ్‌'ను నియమించాలని కోరడంతో..ఆయనను అక్కడ నియమించారు. 

  ఈ విధంగా ఏసీబీ కేసుల్లో ఉన్న ఉన్నతాధికారులు,అవినీతిపరులు, గతంలో అవినీతిపై సస్పెండ్‌ అయిన వారు...ఏసీబీ విచారణ ఎదుర్కొనవారు..'చంద్రబాబు' సొంత జిల్లాలో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సిఫార్సుతో నియమించడం జిల్లా కలెక్టర్‌కు కూడా మింగుడుపడడం లేదు. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని వైకాపా నుంచి టిడిపిలోకి చేర్పించడంలో ప్రముఖపాత్ర పోషించిన సిఎంఒ అధికారి ఒకరు ఈ విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని...సిఎంఒ వర్గాలు అంటున్నాయి. ఈ నియామకాల విషయం సిఎంకు తెలియని విషయం నిజమే...! కానీ మంత్రి లోకేష్‌ పేరుతో...మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, సిఎంఒ అధికారి... కీలకపాత్రపోషిస్తున్నారని తెలుస్తోంది.

(239)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ