WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇదీ...ప్రకాశం టిడిపి ప‌రిస్ధితి...!

ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ గెలుపు గుర్రాలను తయారు చేసుకుంటోంది. దీనిలో భాగంగా వివిధ జిల్లాల్లో పార్టీ ప‌రిస్ధితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు వెనుకబడిన ప్రకాశం జిల్లా పార్టీ ఎమ్మెల్యేలతో, నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు హాజరుకానున్నారు. గత ఎన్నికల్లో టిడిపికి ఇక్కడ మెజార్టీ రాలేదు. మొత్తం 12 అసెంబ్లీ స్దానాలు ఉంటే టిడిపికి ఐదు, వైకాపాకు ఆరు, ఒకటి   స్వతంత్ర అభ్యర్దికి దక్కాయి. జిల్లాలో వైకాపాకే ఆధిక్యం వచ్చినా..తరువాత...ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. దీంతో టిడిపి బలం పెరిగింది. అదే సమయంలో...పార్టీలో నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం..ఆయా నియోజకవర్గాల్లో...టిడిపి పరిస్దితి ఏ విధంగా ఉందనే దానిపై క్లుప్తంగా చెప్పుకుందాం.

ఒంగోలు: ఇక్కడ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు 'దామచర్ల జనార్దన్' ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆయన పనితీరు బాగానే ఉన్నా...ఆయనపై కొన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. స్వంత సొమ్ములతో నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ది చేస్తున్నారనే మాట ప్రజల నుంచి వినిపిస్తోంది. కానీ...ఇంకా ఆయన దూసుకుపోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కోరుకుంటున్నారు.

కొండిపి: ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గమైన 'కొండపి'లో పార్టీ ప‌రిస్ధితి బాగాలేదనేది అందరూ అంగీకరించేదే...! ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి పనితీరు బాగాలేదని..స్వంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు మెరుగుపరుచుకోవాల్సి ఉందన్న మీడియా సంస్దలపై ఆయన ఎస్సీ అట్రాసీ కేసులు నమోదు చేయించి సంచలనం సృష్టిస్తున్నారు. గత నాలుగేళ్లల్లో కేవలం కొండపి నియోజకవర్గంలోనే దాదాపు 18 ఎస్సీ అట్రాసీ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం ఎమ్మెల్యే పెట్టించినవని..అది కూడా స్వంత పార్టీ కార్యకర్తలు..నాయకులపైనే ఆయన పెట్టించారని తెలుస్తోంది. అంతే కాకుండా...నియోజకవర్గంలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన 'దామచర్ల' కుటుంబంలో చిచ్చుపెట్టారనే మాట కూడా వారి నుంచి వస్తోంది. టిడిపి నాయకుల మధ్య విభేదాలు సృష్టించారని...నాయకులను నాలుగు గ్రూపులుగా చీల్చి..పార్టీని బలహీన పర్చారు. దీంతో ఇక్కడ నుంచి మళ్లీ ఆయనకు పోటీ చేసే అవకాశం ఇస్తే..పార్టీ గెలవదని..నియోజకవర్గ కార్యకర్తల్లో ఎక్కువ మంది చెబుతున్నారు. ఇక్కడ నుంచి గతంలో వైకాపా తరుపున పోటీ చేసి ఓడిపోయి తరువాత టిడిపిలో చేరిన 'జూపూడి ప్రభాకర్ రావు'ను పోటీకి పెట్టాలని మెజార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు.  

అద్దంకి:రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ప్రజల నోళ్లలో నానుతున్న ఈ నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉంది. అయితే..పార్టీ సీనియరణ నాయకుడు 'కరణంబలరాం' వ్యవహరిస్తున్న తీరు...పార్టీకి ముప్పు తేబోతోంది. వైకాపా నుంచి టిడిపిలో చేరిన 'గొట్టిపాటి రవి'పై ఆయన నిత్యం సవాళ్లు విసురుతూ...సంచలనం సృష్టిస్తున్నారు. పార్టీ అధినేత మాటను కూడా లెక్క చేయకుండా...వ్యవహరిస్తూ..పార్టీ పరువును తీస్తున్నారు. అద్దంకి సీటు తన తనయుడికి ఇవ్వకపోతే..పార్టీని వీడిపోతామని బెదిరిస్తున్నారు. సిఎం సమక్షంలో జరగబోయే ఈ సమీక్షల్లో...'కరణం'పై గట్టి నిర్ణ‌యం తీసుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.  

ఎర్రగొండపాలెం: గత ఎన్నికల్లో వైకాపా తరుపున గెలిచి టిడిపిలో చేరిన డేవిడ్ రాజు పనితీరుపై నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రజలకు దూరం అయ్యారని...ఆయనకు టిక్కెట్ ఇవ్వవదని ఎక్కువ మంది కోరుతున్నారు. మరి పార్టీలో చేర్చుకునే ముందు..ఆయనకు మళ్లీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని..కొందరు పార్టీ నాయకులు చెబుతున్నారు.

ద‌ర్శి: మంత్రి శిద్దారాఘవరావు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నా..ఆయన కుమారరత్నం చేస్తోన్న అవినీతి కార్యక్రమాలు మంత్రికి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. కాగా..మంత్రిని నర్సరావుపేట పార్లమెంట్ కు పంపుతారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఆయన సతీమణి పోటీ చేయించాలని మంత్రి తపనపడుతున్నారు. మరి దీనిపై పార్టీ అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

పర్చూర్‌: గత ఎన్నికల సమయంలో ఎంతో అట్టహాసంగా...ప్రజలకు చేరవై వారి అభిమానాన్ని పొంది ఎమ్మెల్యేగా ఎన్నికైన 'సాంబశివరావు' తరువాత ప్రజలు..తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేదనే అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో ఉంది. ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని మార్చాలని ఎక్కువ మంది నాయకులు కోరుతున్నారు. మరి చంద్రబాబు దీనిపై ఏమి ఆలోచిస్తున్నారో...సమీక్షలో తేలిపోనుంది.

చీరాల: గత ఎన్నికల్లో నవోదయం పార్టీ తరుపున ఎన్నికైన ప్రస్తుత ఎమ్మెల్యే ఆమంచి కృష్టమోహన్ తరువాత టిడిపిలో చేరారు. అయితే...తనపైపోటీ చేసి ఓడిపోయిన పోతుల సునీతకు మధ్య విభేదాలు తారాస్తాయికి చేరాయి. దీంతో...తాను పార్టీ మారతానని..ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇక్కడ చంద్రబాబు ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

సంతనూతలపాడు: వైకాపా అధీనంలో ఉన్న ఈ నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉన్నా..నియోజకవర్గ  ఇన్ చార్జిపై కార్యకర్తల్లో, ముఖ్యంగా..టిడిపిని మొదటి నుంచి స‌మ‌ర్ధించే...సామాజికవర్గంలో అసంతృప్తి నెలకొని ఉంది. నియోజకవర్గ ఇన్ చార్జిని తప్పించాలని వారు కోరుతున్నారు. ఇక్కడ నుంచి మరో ఎస్సీ అభ్య‌ర్ధిని నిలబెడితే...టిడిపి ఈసారి సులువుగా గెలుస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు దృష్టిసారించాల్సి ఉంది.

కందుకూరు: వైకాపా నుంచి టిడిపిలో చేరిన 'పోతుల రామారావు' పనితీరుపై మెజార్టీ ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి మహీధరణరెడ్డిని పోటీ చేయిస్తే బాగుంటుందని పార్టీ కార్యకర్తలు..అభిప్రాయపడుతున్నారు. కానీ..ఆయన వైకాపాలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది.

మార్కాపురం: వైకాపా ఆధీనంలో ఉన్న ఈ సీటులో..టిడిపి ప‌రిస్ధితి పెద్దగా బాగాలేదు. ఇక్కడ గతంలో పోటీ చేసిన 'కందుల'ను మార్చాల్సి ఉంది.

గిద్దలూరు: వైకాపా నుంచి టిడిపిలో చేరిన అశోక్ రెడ్డి ప‌రిస్ధితి బాగాలేదని తెలుస్తోంది. ఇక్కడ పార్టీలో గ్రూపులు..గెలుపు ఓటములపై ప్రభావం చూపించనున్నాయి. ఇక్కడ కూడా అభ్యర్దిని మార్చాల్సి ఉంది.

కనిగిరి: ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బాబూరావుపై కూడా సానుకూలత వ్యక్తం కావడం లేదు. కాగా...ఆయన కన్నా బెటరణ అభ్యర్ది పార్టీకి దక్కడం కష్టం.పైగా సినీనటుడు బాలకిష్ట్ర మద్దతు ఆయనకు పుష్కలంగా ఉంది. దీంతో ఆయనను మార్చే అవకాశం లేదు. మరి ఏమి జరుగుతుందో చూద్దాం.


(2629)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ