లేటెస్ట్

అర్థంతరంగా 'సిఎస్‌'లు బదిలీ...!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు సీనియర్‌ ఐఎఎస్‌లు అర్థంతరంగా బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఇద్దరు ప్రధాన కార్యదర్శులుగా ఒకరి తరువాత ఒకరు అయినవారే. సార్వత్రిక ఎన్నికల సమయంలో 'సిఎస్‌'గా ఉన్న 'పునీతా'ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అప్పటి అధికారపార్టీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను బదిలీ చేయాలని వైకాపా నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించడంతో..ఆయనను ఆగమేఘాలపై బదిలీ చేశారు. ఆయన బదిలీ అప్పట్లో రాజకీయ దుమారాన్ని రేపింది. వైకాపా,బిజెపి నాయకులు కుమ్మక్కు అయి ఆయనను బదిలీ చేయించారని అప్పటి టిడిపి ప్రభుత్వం నిందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 'పునీతా' నియామకంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అప్పటికే సీనియర్ల లిస్టులో ఉన్న 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం'ను కాదని 'పునీతా'ను నియమించడంపై ఒక వర్గం ఐఎఎస్‌లు అప్పటి సిఎం 'చంద్రబాబు'పై పరోక్షంగా ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. 'ఎల్‌.వి'ని 'సిఎస్‌'గా నియమించకుండా ఆయన కంటే జూనియర్‌ అయిన 'పునీతా'ను నియమించడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై అప్పట్లో వివాదం చెలరేగడం...అంతలో ఎన్నికలు రావడం, కేంద్రం ఎన్నికల సంఘం 'పునీతా'పై బదిలీ వేటు వేయడంతో..ఆయన అర్థాంతరంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తప్పుకోవాల్సి వచ్చింది.

ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం 'సిఎస్‌'గా నియమించిన 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యాన్ని' అధికారంలోకి వచ్చిన 'వైకాపా' ప్రభుత్వం కొనసాగించింది. మొదట్లో ప్రభుత్వ పెద్దలతో బాగానే కలిసి నడిచిన 'ఎల్‌వి' తరువాత కాలంలో వారికి సమస్యగా మారాడని ప్రచారం జరిగింది. 'జగన్‌' అధికారంలోకి వచ్చిన కొత్తల్లో 'అన్నా' అంటూ ఆయన 'ఎల్‌వి'ని పలకరించారని, దానికి 'ఎల్‌వి' ఎంతోసంతోషించారట. ఒక సిఎం ఈ విధంగా వ్యవహరిస్తారని తాను కలలో కూడా ఊహించలేదని 'ఎల్‌వి' అప్పట్లోచెప్పుకున్నారు. అయితే తరువాత కాలంలో వారి మధ్య పొరపొచ్చలు వచ్చాయని సమాచారం. ఏ విషయంలో పొరపొచ్చలో వచ్చాయో కానీ...రోజు రోజుకు అవి ముదిరిపాకానపడ్డాయి. కొన్ని ఫైళ్ల విషయంలో 'ఎల్‌వి' ప్రభుత్వ పెద్దల సూచనలను పట్టించుకోలేదని, ఫైళ్లలో తన కామెంట్లు సూటిగా రాశారని, అవి ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదని ప్రచారం జరుగుతోంది. ఇవే కాకుండా పాలనా వ్యవహారాల్లో సమస్తం తానేననట్లు వ్యవహరించడంతో సిఎంఒ అధికారులకు, ముఖ్యంగా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారులకు మధ్య ప్రచ్చన్నయుద్ధం వంటి వాతావరణం ఏర్పడిందని, దీంతో వారు 'ఎల్‌వి'పై అసంతృప్తితో ఉన్నారనే సమాచారం వస్తోంది. దీంతో ఒంటరి అయిన 'సిఎస్‌' మౌనంగా తన కాలాన్ని పూర్తి చేసుకోవాలని భావించినా ప్రభుత్వ పెద్దలు ఆయన ఉనికిని గుర్తించడానికి ఇష్టం లేకపోవడంపై 'బదిలీ' వేటు పడిపోయింది. మొత్తం మీద..చూస్తే..ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోకుండానే అర్థంతరంగా బదిలీపై వెళ్లడం రికార్డే. 

(349)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ