లేటెస్ట్

'ఎల్వీ' సర్వీసుకు రాజీనామా చేస్తారా...?

      అర్థంతరంగా, అవమానకరంగా  బదిలీ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం'తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా...? ఆయన తన సర్వీసుకు రాజీనామా చేస్తారా..? జరిగిన అవమానాన్ని ఆయన దిగమింగుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాను ఎంతో అభిమానించే 'వై.ఎస్‌' కుటుంబం తనను పూచికపుల్లగా తీసివేసిందని, దీన్ని ఆయన వ్యక్తిగత అవమానంగా భావించి సర్వీసు నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా..?  అంటే అవుననే సమాధానం ఆయన సన్నిహిత వర్గాల నుంచి వస్తోంది. ఇన్నాళ్ల సర్వీసుల్లో ఎటువంటి మచ్చ ఎదుర్కోలేదని, సర్వీసు చివరి రోజుల్లో అవమానం జరిగిందని, దీన్ని తాను తట్టుకోలేకపోతున్నానని ఆయన అంటున్నారట. గతంలో తన కుమారుడు వివాహం సందర్భంగా సీబీఐ అధికారులు తనను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినప్పుడు కూడా ఆయన ఇంత బాధపడలేదని, తన కంటే కిందిస్థాయి అధికారితో ఇప్పుడు అవమానించారని ఆయన బాధపడుతున్నారని తెలుస్తోంది. ఒక ఐఎఎస్‌ అధికారిగా బదిలీలు సహజమేనని, కానీ..ఇంత అవమానకరంగా ప్రవర్తిస్తారని ఊహించలేదని, దీనిపై ఏదో ఒకటి చేయాలని ఆయన సన్నిహితులు ఆయనకు సూచిస్తున్నారు. 
      తనకు అవమానం జరిగింది కనుక...సర్వీసుకు రాజీనామా చేసి వెళ్లిపోవడం ఒక ఆప్షన్‌ కాగా...మరో ఆప్షన్‌ న్యాయపోరాటం చేయడమని ఆయన సన్నిహితులు చెబుతున్నారట. సర్వీసుకు రాజీనామా చేసి వెళ్లిపోతే తాను తప్పు చేసినట్లు అవుతుందని ఆయన భావిస్తున్నారని దీనిపై న్యాయపోరాటం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆయన ఆలోచిస్తున్నారట. 'ప్రవీణ్‌ప్రకాష్‌' బిజినెస్‌ రూల్స్‌ను అనుసరించలేదని, దీంతో ఆయన ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని, దీనిని క్యాట్‌లో సవాల్‌ చేసే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారట. 'ప్రవీణ్‌' రూల్స్‌ పాటించలేదని ఇంతక ముందే తాను 'షోకాజ్‌ నోటీస్‌' ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తనను బదిలీ చేస్తూ 'ప్రవీణ్‌' ఇచ్చిన జీవో చెల్లదనే ఆలోచనలో 'ఎల్వీ'కి ఉందంటున్నారు. దీనిపై 'క్యాట్‌'ను ఆశ్రయిస్తే..తనకు పోస్టింగ్‌ తిరిగి వస్తుందనే భావన ఆయనలో ఉందంటున్నారు. స్వతాగా వివాదాలకు దూరంగా ఉండే 'ఎల్వీ' ఇటువంటి సాహసం చేస్తారా..? మరో ఐదు నెలలు మాత్రమే సర్వీసు ఉన్న పరిస్థితుల్లో 'క్యాట్‌'కు పోయినా పెద్దగా ఒరిగేదేమీ లేదనే భావన ఉంది. అయితే అవమాన భారాన్ని తగ్గించుకునేందుకు ఆయన 'క్యాట్‌'కు వెళతారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. కాగా మరో ఆయన ఇప్పుడు బదిలీ అయిన స్థానానికి వెళ్లి తరువాత సెలవులో వెళ్లిపోతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద 'ఎల్వీ' ఇప్పుడు ఏమి చేస్తారనే దానిపై సచివాలయ, ఐఎఎస్‌ అధికారుల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. 

(458)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ