లేటెస్ట్

ఆ సంపాదకీయం నేను రాయలేదు:రామచంద్రమూర్తి

ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే కేసులు వేయండని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన వివాదాస్పద జీవోపై రగడ సాగుతూనే ఉంది. ఆ జీవోను రద్దు చేయాలని జర్నలిస్టు సంఘాలు, పౌరహక్కుల నాయకులు డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాటపడుతున్నారు. అయితే ఈ జీవోను సమర్థిస్తూ మాజీ జర్నలిస్టు, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు పి.రామచంద్రమూర్తి మాట్లాడడంపై 'ఆంధ్రజ్యోతి' ఎండి 'వేమూరి రాధాకృష్ణ' అభ్యంతరం వ్యక్తం చేయడం, గతంలో జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఇటువంటి జీవో ఇచ్చిన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని దునుమాడిన 'రామచంద్రమూర్తి' ఇప్పుడు పదవుల కోసం వివాదాస్పద జీవోను సమర్థించడంపై తన పత్రికలో రాసిన వ్యాసంలో తీవ్ర అభ్యంతరాలు, ఆరోపణలను వ్యక్తం చేశారు. దీనిపై 'రామచంద్రమూర్తి' వివరణ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరణను 'ఆంధ్రజ్యోతి' తన ఎడిట్‌ పేజీలో యధాతథంగా ముద్రించింది. ఈ సందర్భంగా 2007లో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వివాదాస్పద జీవోను వ్యతిరేకిస్తూ తాను సంపాదకీయం రాయలేదని, ఆ భాష, శైలి తనది కాదని, తాను అటువంటి పరుషపదజాలాన్ని వాడనని, అయినా..తాను సంపాదకుడిగా ఉన్న పత్రికలో వచ్చిన సంపాదకీయం కనుక తనదే బాధ్యత అని 'రామచంద్రమూర్తి' చెప్పుకున్నారు. ఇదే సమయంలో తన మాజీ ఎండి 'రాధాకృష్ణ' వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 'రాధాకృష్ణ' రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా తాను కూడా పనిచేయాలని ఆయన కోరుకుంటున్నారని, ఆయనకు గిట్టని ప్రభుత్వాల్లో, వ్యక్తుల వద్ద తాను పనిచేయకూడదనే లక్ష్యంతో తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో క్రమశిక్షణతో, నైతికతో కష్టపడి నిర్మించుకున్న తన ప్రతిష్టను ఒక్క కలంపోటుతో కూలదోయాలని 'రాధాకృష్ణ' ప్రయత్నిస్తున్నారని, ఆయనకు తాను మేలు చేసినా...ఈవిధంగా వ్యవహరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. 45 సంవత్సరాలుగా జర్నలిస్టు జీవితం గడిపి 'సాక్షి' నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రభుత్వం తనను సలహాదారుగా నియమించిందని, గిరిజనులు, దళితులకు ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి 'జగన్‌' తనను నియమించుకున్నారని, పేదల పక్షం నిలిచే తాను దానికి అంగీకరించానని, అంతే కాని తనకు పదవిపై వ్యామోహం కానీ, సొమ్ముపై వ్యామోహం లేదని పేర్కొన్నారు.

2007లో వై.ఎస్‌ హయాంలో ఇచ్చిన వివాదాస్పద జీవో గురించి 'రాజశేఖర్‌రెడ్డి' తనను పిలిపించి మాట్లాడారని, తనతో మాట్లాడిన తరువాత జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని, వ్యక్తిగత దూషణలు, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు రాస్తే..ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయని 'వై.ఎస్‌' ప్రశ్నించారని, ఎవరైనా వ్యక్తి ప్రతిష్టకానీ, ప్రభుత్వ ప్రతిష్టను కానీ దెబ్బతీస్తే ఊరుకోరని అదే విషయం నాడు 'వై.ఎస్‌'కు చెప్పానని అన్నారు. తాము పంపించే రిజాయిండర్లు కూడా 'ఆంధ్రజ్యోతి' ప్రచురించలేదని వై.ఎస్‌ పేర్కొనగా...తనదాకా అవి రాలేదని పేర్కొన్నప్పుడు..అవి మీ వద్దకు రావులే అని వై.ఎస్‌ నవ్వారని, తాను అప్పుడూ ఇప్పుడూ పేద ప్రజల సంక్షేమ కోసమే పనిచేశానని 'రామచంద్రమూర్తి' తన సుధీర్ఘ లేఖలో పేర్కొన్నారు. 

కాగా..'రామచంద్రమూర్తి' వివరణను ఆంధ్రజ్యోతి ప్రచురిస్తూనే దానికి కౌంటర్‌ ఇచ్చారు. 'రామచంద్రమూర్తి' లేఖలోని అంశాలను పేర్కొంటూ..'రామచంద్రమూర్తి' రాయలేదంటున్న సంపాదకీయానికి ఆయనదే బాధ్యత అని 'రాధాకృష్ణ' పేర్కొన్నారు. తనకు 'రామచంద్రమూర్తి'పై ఎటువంటి కోపం, ద్వేషం కానీ లేవని, తన సంస్థలో పనిచేసిన 'రామచంద్రమూర్తి'పై తానెందుకు కోపం పెట్టుకుంటానని 'రాధాకృష్ణ' ప్రశ్నించారు. 'రామచంద్రమూర్తి' నాటి సిఎం వై.ఎస్‌ను కలిసిన విషయం తనకు చెప్పలేదని, సంస్థ ఎండిగా ఆ విషయం తరువాత ఎవరో చెపితే తెలుసుకున్నానని,  ఆ రెండుసంస్థలు కలిసి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని వై.ఎస్‌ అన్నప్పుడు..అక్కడే ఉన్న మీరు దాన్ని ఖండించకపోవడాన్ని ఏమనాలి..? ఇది ఏరకమైన నిబద్దతో మీకే వదిలేస్తున్నాను..మీరు హెచ్‌ఎంటివిలో చేరినప్పుడు...'సాక్షి'లో పనిచేస్తోన్న మీ దగ్గరి వారిని 'హెచ్‌ఎంటివి'లో చేరాలని మీరు పిలిస్తే వారు రాలేదని దానికి ప్రతిగా 'మీరు అక్కడే ఉండి...ఆ రక్తపు కూడు తినండి' అని అనలేదా..? అంటూ 'రాధాకృష్ణ' గతంలో 'రామచంద్రమూర్తి' అన్న మాటలను బయటపెట్టారు. మొత్తానికి 'రామచంద్రమూర్తి, రాధాకృష్ణ'లు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ..గతాన్ని త్వవ్వుకుంటూ ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నారు. మరి దీనిపై రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి రచ్చ జరుగుతుందో చూద్దాం.

(389)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ