లేటెస్ట్

'టిడిపి'కి 'దేవినేని అవినాష్‌' గుడ్‌బై...!

కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే 'గన్నవరం' ఎమ్మెల్యే 'వల్లభనేనివంశీమోహన్‌' పార్టీని వీడి వైకాపాలో చేరేందుకు నిర్ణయించుకోగా ఆయన దారిలో మరో యువనేత పయనించబోతున్నారు. టిడిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 'ఇసుకదీక్ష' సందర్భంలోనే టిడిపిని వీడిపోవాలని తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు 'దేవినేని అవినాష్‌' నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీని వీడతారని, ఈ మేరకు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం. దీనిపై ఇప్పటికే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రేపు ఆయన పార్టీని వీడే ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్‌(నెహ్రూ) తనయుడైన 'దేవినేని అవినాష్‌' గత ఎన్నికలకు ముందు తండ్రితో కలసి టిడిపిలో చేరారు. 

గత ఎన్నికల్లో ఆయన 'గుడివాడ' టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి 'కొడాలి నాని' చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత 'అవినాష్‌' పార్టీ కార్యకర్తలపై, నాయకులపై జరుగుతున్నదాడులను ఎదుర్కోవడానికి గట్టిగా పనిచేశారు. 'పల్నాడు' ప్రాంతంలో టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్న సందర్భంలో ఒంటరిగా ఆయన వెళ్లి అక్కడ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపారు. ఆయన పార్టీపై చూపిస్తోన్న శ్రద్ధ, ఉత్సాహం చూసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలా పనిచేయాలంటూ కితాబు ఇచ్చారు. అయితే కృష్ణా జిల్లా పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరుతో 'అవినాష్‌' పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలిసింది. ముఖ్యంగా 'విజయవాడ తూర్పు' నియోజకవర్గ ఎమ్మెల్యే 'గద్దె రామ్మోహన్‌రావు'తో వచ్చిన విభేదాలతోనే ఇప్పుడు పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారంటున్నారు. 

'గుడివాడ'లో ఓడిపోయిన తరువాత 'అవినాష్‌' 'విజయవాడ తూర్పు' నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్దపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ తన తండ్రికి ఉన్న పట్టును కొనసాగించాలని, తన వర్గాన్ని పున:రేకీకరణ చేయడానికి ఆయన ప్రయత్నాలు చేయడం, దీనిపై ఎమ్మెల్యే 'గద్దె' అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారిద్దరి మధ్య విభేదాలకు కారణం అయ్యాయని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ విషయం అధినేత 'చంద్రబాబు' దృష్టికి వెళ్లడంతో ఆయన 'గద్దె' వైపే ఉన్నారని, తన తండ్రి నియోజకవర్గమైన 'విజయవాడతూర్పు'ను తనకు ఇవ్వాలని 'అవినాష్‌' అడిగినా ఇది సమయం కాదని తిరస్కరించడంతో ఆయన పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

గతంలో 'కంకిపాడు' నియోజకవర్గంలో 'విజయవాడ తూర్పు'లో కొన్ని ప్రాంతాలు కలిసి ఉన్న సమయంలో 'దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ) ఇక్కడ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. తరువాత విజయవాడ తూర్పునియోజకవర్గంగా ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి గెలుపొందారు. తన తండ్రి నియోజకవర్గమైతే తనకు బాగుటుందనే అభిప్రాయంతో 'అవినాష్‌' ఇక్కడ వేలు పెట్టారని, దీనికి అధినేత సమర్థించకపోవడంతో పార్టీని వీడాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో వైకాపాకు నియోజకవర్గంలో గట్టినేత లేకపోవడం, వారి నుంచి ఆహ్వానం ఉండడంతో 'అవినేష్‌'పార్టీ మారడానికి వేగంగా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా యువనేతగా గుర్తింపు పొందుతున్న సమయంలో వరుసగా పార్టీలు మారితే భవిష్యత్‌లో రాజకీయంగా దెబ్బతినాల్సి వస్తుందేమోనన్న బెంగ కొందరు 'అవినాష్‌' అనుచరుల్లో వ్యక్తం అవుతోంది. 

(797)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ