WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముందస్తు లేనట్లే...!

నిన్నటి దాకా...ముందస్తు ఎన్నికలు జరపాలని ఒకటే హడావుడి చేసిన బిజెపి పెద్దలు ఎందుకో వ్యూహం మార్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే మరోసారి అధికారంలోకి వస్తామని, అదే సమయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిపించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ముందస్తుకు సిద్ధమని ప్రకటించగా మరి కొన్ని మాత్రం తాము ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా లేమని ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీలను అడ్డుకోవడానికి 'జమిలిఎన్నికలు' నిర్వహించబోతున్నారని, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆరోపించాయి. ఏ పార్టీలు అడ్డుకున్నా...నాయకులు అభ్యంతరం చెప్పినా..'జమిలి' ఎన్నికలు నిర్వహించాల్సిందేనని..ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాలు భావించారు. అయితే ఇప్పుడు ముందస్తుకు వెళ్లడం లేదని..ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని...ఆ పార్టీ నాయకులు లీకులు ఇస్తున్నారు. నిన్న పోలవరం సందర్శనకు వచ్చిన కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ ఘడ్కరీ కూడా ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు. దీంతో..ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టంగా తేలిపోతోంది.

ఎందుకు వ్యూహం మారింది...!

నిన్నటి దాకా..'జమిలి' ఎన్నికలని ఒకటే రంకెలేసిన బిజెపి పెద్దలు హఠాత్తుగా ఎందుకువ్యూహం మార్చారనే దానిపై రకరకాలైన విశ్లేషణలు వస్తున్నాయి. వాటిలో భాగంగా..ఎట్టి పరిస్థితుల్లోనూ 'జమిలి' ఎన్నికలు సాధ్యకాదని తేలిపోవడం ఒకటి. కాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజల్లో ఉన్న అసంతృప్తి వల్ల గెలవమనే భయంతో..వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లడం కంటే షెడ్యూల్‌ ప్రకారం వెళితేనే నయమన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనతోనే..వ్యూహం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో తాము గత నాలుగేళ్లలో ఏమి చేశామనే దానిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తే...షెడ్యూల్‌లో జరిగే ఎన్నికల్లో కొంతయినా లాభం ఉంటుందనే భావన కూడా దీనికి కారణమైంది. దేశ వ్యాప్తంగా 'మోడీ' సుడిగాలి పర్యటన చేయాలని..దీంతో..కొంత ఉపయోగం ఉంటుందనే మాట పార్టీ వర్గాల నుంచి రావడంతో..ముందస్తుకు పోకుండా షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిపించాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. మొత్తం మీద..ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అర్థం అవడంతోనే..తమ కాలవ్యవధి పూర్తి చేసుకుని వెళ్లిపోదామనే భావనతోనే 'మోడీ,షాలు..ముందస్తు మాట మరిచారని వారి విమర్శకులు అంటున్నారు.

(338)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ