లేటెస్ట్

'చిన్న,మధ్యతరహా పత్రికలపై 'జిఎస్‌టి' వేటు...!

రాష్ట్రంలో ప్రచురిస్తోన్న 'చిన్న,మధ్యతరహా పత్రికా ప్రతినిధులకు జారీ చేసే అక్రిడిటేషన్‌పై 'జిఎస్‌టి' వేటు పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి  ప్రభుత్వం గత రెండు సంవత్సరాల 'జిఎస్‌టి' రిట్నర్స్‌ను సమర్పించాలని నిబంధనలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా 'జీఎస్‌టి' అమలులోకి వచ్చిన తరువాత...ఏ రాష్ట్రంలోనూ పత్రికలకు సంబందించి ఇటువంటి రూల్స్‌ను అమలు చేయలేదు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇటువంటి నిబంధనలు తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో వెలువడే అన్ని దినపత్రికలు/మాస/పక్ష, వార పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ ఇవ్వాలంటే ఆయా సంస్థలు గత రెండు సంవత్సరాలుగా చెల్లిస్తోన్న 'జిఎస్‌టి' రిట్నర్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఒకటి రెండు పత్రికలు తప్ప...రాష్ట్రంలోని మిగతా పత్రికలేవీ ఈ నిబంధనలు అందుకోవడం కష్టమే. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఈ ప్రతిపాదనలు తెచ్చిందో...లేక అధికారుల అత్యుత్సాహం వల్ల ఈ రకమైన జీవో వెలువడిందో తెలియదు కానీ...ప్రస్తుతం విడుదలైన జీవోపై జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో పత్రికల పరిస్థితి రోజు రోజుకు తీసికట్టుగా తయారైన పరిస్థితుల్లో ఇటువంటి అసంమంజసమైన జీవోలను విడుదల చేయడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పత్రికలకు మంజూరు చేసే అక్రిడిటేషన్‌ విషయంలో ఆయా ప్రభుత్వాలు చూసీ చూడనట్లు వెళ్లేవి. గత ఏడాది వరకు అక్రిడిటేషన్‌ మంజూరుకు ఆయా పత్రికలకు సంబందించి ఇన్‌కమ్‌ట్యాక్స్‌, యాన్యువల్‌ రిటర్న్స్‌ మాత్రమే అడిగేవారు. ఈ ఏడాది మాత్రం నూతనంగా 'జీఎస్‌టి'ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎటువంటి ముందస్తు సమచారం లేకుండా...ఉన్నఫళానా..ఇటువంటి జీవో తేవడం ఏమిటని కొందరు జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. 

సబ్‌కమిటీ సిఫార్సులను పట్టించుకోలేదు...!

కాగా..తాము అక్రిడిటేషన్‌ కోసం నియమించిన సబ్‌ కమిటీ ఇచ్చిన సిఫార్సులను మాత్రమే అమలు చేశామని అధికారులు చెబుతుండగా..అలాంటిదేమీ లేదని సబ్‌కమిటీ సభ్యులు చెబుతున్నారు. దీనిపై సబ్‌కమిటీ సభ్యులైన సీనియర్‌ జర్నలిస్టు, సంపాదకుడు కె.ఎస్‌.రంగసాయిగారిని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధి సంప్రదించినప్పుడు ఆయన స్పందిస్తూ..సబ్‌కమిటీ ఇఛ్చిన సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోనట్లు ఉందన్నారు. తాము చిన్నపత్రికలకు జీఎస్‌టి అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్పామని, కానీ..ప్రభుత్వం దాన్ని జీవోలో తెచ్చిందన్నారు. అదే విధంగా అన్‌ఎంపానెల్‌మెంట్‌ పత్రికలకు కూడా అక్రిడిటేషన్‌ ఇవ్వాలని తాము సిఫార్సు చేస్తే..దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని, పైగా..గతంలో ఇచ్చిన అక్రిడిటేషన్లను భారీగా తగ్గించారని, చిన్న పత్రికలకు ప్రతి మండలంలో ఒక కార్డు ఇవ్వాలని తాము చెప్పామని, 'జీఎస్‌టి' అమలు నిర్ణయాన్ని అప్పుడే వ్యతిరేకించామని, సబ్‌కమిటీ సభ్యుల్లో ఎవరూ దాన్ని అంగీకరించలేదన్నారు. 'జిఎస్‌టి' స్థానంలో రెండు సంవత్సరాల ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రిటర్న్స్‌ సమర్పించాలని తాము సిఫార్సు చేశామని కానీ, ప్రభుత్వం తాము చేయాలనుకున్న పనిని చేసి..సబ్‌కమిటీ సిఫార్సులు అంటూ నెపాన్ని తమపై తోసివేస్తోందన్నారు. మరో వైపు వివిధ జర్నలిస్టు యూనిన్స్‌తోసమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తీసుకున్నామన్న మాట కూడా వాస్తవం కాదని, అప్పట్లో ఈ సమావేశానికి హాజరైన జర్నలిస్టు సంఘ ప్రతినిధులు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో అన్నారు. ఏ సంఘం కానీ, జర్నలిస్టు కానీ...'జీఎస్‌టి' తేవాలని కోరలేదని చెప్పారు. మొత్తం మీద..ఆర్థికమాంద్యం, ప్రభుత్వాల ఆదరణ లేక రోజు రోజుకు పతనం అవుతోన్న చిన్న,మధ్యతరహా పత్రికలు తాజా జీవోతో మరింత అగాధంలోకి కూరుకుపోవడం ఖాయం. 

(505)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ