WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపాలోకి టిడిపి ఎమ్మెల్యే 'తోట త్రిమూర్తులు'...!

గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం నిజం కాబోతోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం టిడిపి ఎమ్మెల్యే 'తోట త్రిమూర్తులు' ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి...వైకాపాలో చేరబోతున్నారట. అధికార టిడిపిపై గత కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న 'తోట త్రిమూర్తులు' నేడో...రేపో...ఆ పార్టీకి రాజీనామా చేసి...'జగన్‌' సమక్షంలో వైకాపాలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. టిడిపి ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి...ఆయన ఇక టిడిపిలో ఉండదల్చుకోలేదని...దాని కోసమే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి...సచివాలయంలో ఫైళ్లు తగుల బెడతానని, ఏమైనా చేస్తానని....ఆయన చేస్తోన్న వ్యాఖ్యలు..టిడిపిలో కలకలం సృష్టిస్తున్నాయి...ఆయన ఇక పార్టీలో కొనసాగే అవకాశం లేదని...వైకాపాలోకి వెళ్లడానికే ఇటువంటి విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.

  గత కొన్నాళ్లుగా...ఆయన పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యే అయిన తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే బాధ ఆయన మాటల్లో వ్యక్తం అవుతోంది. కాపు వర్గానికి చెందిన సీనియర్‌ అయిన తనను విస్మరించి...ఎవరెవరికో పదవులు ఇచ్చారని, తాను పార్టీ కోసం ఎంతో కష్టపడితే...దాన్ని పట్టించుకోకుండా, పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారనే అసంతృప్తి ఆయనలో ఉంది. వాస్తవానికి 'త్రిమూర్తులు' కోస్తా ప్రాంతంలో తిరుగులేని నేత. ఇండిపెండెంట్‌గా రాజకీయ అరంగ్రేటం చేసిన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత 1994లో ఆయన ఇండిపెండెంట్‌గా విజయం సాధించి సంచలనం సృష్టించారు. తరువాత ఆయన టిడిపిలో చేరిపోయారు. 1999 ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించి..నియోజకవర్గంపై పట్టుసాధించారు. ఈ కాలంలోనే ఆయనపై దళితులకు శిరోముండనం చేయించారనే కేసు నమోదు అయింది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ నేత 'పిల్లి సుభాష్‌చంద్రబోస్‌' చేతిలో ఓడిపోయారు. తరువాత...2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి...ఆ పార్టీ తరుపున పోటీ చేసినా మళ్లీ 'పిల్లి' చేతిలో పరాజయం చెందారు. వై.ఎస్‌ మరణం తరువాత...ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో..ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరారు. అనంతర పరిణామాల్లో మంత్రిగా ఉన్న 'పిల్లి' జగన్‌కు మద్దతుగా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా జరిగిన ఉపఎన్నికల్లో...'తోట త్రిమూర్తులు' సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా..'జగన్‌'కు మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరూ 'గెలవగా..' 'రామచంద్రాపురం'లో 'తోట త్రిమూర్తులు' సంచలన విజయం సాధించారు. అయితే..రాష్ట్ర విభజన దరిమిలా..జరిగిన పరిణామాలతో ఆయన మళ్లీ టిడిపిలో చేరి..ఇక్కడ నుంచి పోటీ చేసి...'సుభాష్‌'పై గెలుపొంది సత్తా చాటారు. 

  ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడంతో..తనకు మంత్రి పదవి వస్తుందని 'తోట' ఆశించినా..అది జరగలేదు. దాంతో..అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఆయన...ఇప్పుడు..పార్టీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. కేవలం మంత్రి పదవి రాకపోవడమే...ఆయన అసంతృప్తికి కారణం కాదు. ఇటీవల కొంత కాలం క్రితం..వైకాపాలో ఉన్న 'శెట్టి బలిజలు'కు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని...అందరూ కలసి టిడిపిలో చేరాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో 'శెట్టి బలిజ' సామాజికవర్గానికి చెందిన 'సుభాష్‌చంద్రబోస్‌'ను అధినేత చంద్రబాబుకు వద్దకు పంపాలని నిర్ణయించారు. దీంతో 'పిల్లి' టిడిపిలో చేరతారనే అనుమానం 'తోట'కు వచ్చిందని..ఆయన వస్తే..తనకు ప్రాధాన్యత తగ్గిపోతుందన్న కారణంతో..ముందే వైకాపాలో చేరాలనే నిర్ణయానికి 'త్రిమూర్తులు' వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా...కాపు వర్గానికి చెందిన బలమైన నాయకుడైన 'తోట' టిడిపి నుంచి వెళ్లిపోతే...ఆ పార్టీకి నష్టం జరగడం ఖాయం. మరి..చంద్రబాబును బెదిరించడానికి..త్రిమూర్తులు..ఈ రకంగా వ్యవహరిస్తున్నారా..? లేక..నిజంగానే...వెళ్లిపోవడానికి నిర్ణయం తీసుకున్నారా..? త్వరలో అసలు నిజం బయటకు రానుంది.

(2967)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ