లేటెస్ట్

'బాలకృష్ణ' సినిమాలో 'ఎమ్మెల్యే రోజా'...!

వారిద్దరూ ఒకప్పుడు హీరో,హీరోయిన్‌గా నటించారు. వారిద్దరి కాంబినేషన్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. పలు సినిమాల్లో వారి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తరువాత కాలంలో ఇద్దరూ ఒకే పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం హీరో ప్రతిపక్ష పార్టీలో ఉండగా, హీరోయిన్‌ అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ కలిసి మళ్లీ సినిమాల్లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వారిద్దరు ఎవరంటారా..? వారెవరో కాదు..సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరు కాగా..మరొకరు 'నగరి' ఎమ్మెల్యే 'ఆర్‌.కె.రోజా'. త్వరలో వీరిద్దరూ కలసి ఓ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో 'బాలకృష్ణ' హీరోగా నటిస్తారని తెలుస్తోంది. దీనిలో ఒక పవర్‌పుల్‌ పాత్రలో ఎమ్మెల్యే 'రోజా' నటిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. 'రోజా'ను తన సినిమాలో నటించాలని 'బోయపాటి' అడిగినట్లు..దానికి ఆమె ఆలోచించి సమాధానం చెబుతానని చెప్పినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి. 

'బాలకృష్ణ' హీరోగా నటించే ఈ చిత్రంలో 'రోజా' విలన్‌ క్యారెక్టర్‌ చేయాలని 'బోయపాటి' అడిగినట్లు సమాచారం. లేడీ విలన్‌ క్యారెక్టర్‌ చేయడానికి 'రోజా' అంగీకరిస్తారా...? ప్రజాప్రతినిధిగా ఉన్న ఆమె ఇటువంటి పాత్రలు ధరించలేరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే 'బోయపాటి' సన్నిహితులు మాత్రం అది నెగిటివ్‌ క్యారెక్టర్‌ కాదని, దమ్మున్న మహిళా క్యారెక్టర్‌ అని అంటున్నారు. ప్రస్తుతం 'రోజా' ఎమ్మెల్యేగా ఉన్నా..ఆమె 'జబర్దస్త్‌'కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని టీవీల్లో షోలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బాలకృష్ణ' సినిమాల్లో ఆమె నటించవచ్చునని, బాలకృష్ణకు, ఆమెకు మధ్య మంచి అవగాహన ఉందంటున్నారు. వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా ఎప్పుడూ పరస్పరం విమర్శించుకోలేదు. 'బాలకృష్ణ' చాలా మంచివారని..'రోజా' ఇంతకు ముందు కితాబు ఇచ్చారు. నిత్యం ప్రతిపక్షనేత 'చంద్రబాబునాయుడు'ను విమర్శించే 'రోజా' ఎప్పుడూ 'బాలకృష్ణ'పై మాత్రం విమర్శలు చేయలేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పూ..నిప్పూలా వ్యవహరించే టిడిపి,వైకాపాలకు చెందిన ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఓ చిత్రంలో నటిస్తే..సినీప్రేక్షకులకు వచ్చే మజా అంతా ఇంతా కాదు. మరి ఈ వార్తలు నిజం అవుతాయో..లేదో చూడాలి. 

(493)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ