లేటెస్ట్

రూ.30కోట్ల యాడ్‌కు ముందే కమీషన్‌ వసూలు చేసిన మంత్రి బంధువులు...!

ఒక వైపు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని, అవినీతి పరులను క్షమించేది లేదని ప్రకటనలు చేస్తుంటే కొందరు మంత్రుల బంధువులు మాత్రం ఆయన ఉద్దేశ్యాలను, లక్ష్యాలను పక్కన పెట్టి, ప్రభుత్వానికి అప్రదిష్టతెచ్చి పెట్టే పనులు చేస్తున్నారు. అవినీతి అంతు చూడాలని ముఖ్యమంత్రి ఆశిస్తుంటే కొందరు మంత్రుల బంధువులు మాత్రం అందినకాడికి దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కీలకమైన శాఖకు చెందిన మంత్రి బంధువులు ఆయన శాఖలోని ప్రకటనలు విడుదల చేయడానికి ముందుగానే వివిధ యాడ్‌ ఏజెన్సీలతో బేరం కుదుర్చుకున్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సదరు యాడ్‌ ఏజెన్సీ నిర్వహకులు మంత్రి బంధువుల వద్దకు వెళ్లి మంత్రిగారి శాఖలో రూ.30కోట్ల యాడ్స్‌ ఉన్నాయని, అవన్నీ తమ సంస్థకే ఇస్తే...తాము వారు అడిగినంత పర్సెంటేజీ ఇస్తామని బేరం పెట్టారు. దీనికి మంత్రి బంధువులు, సన్నిహితులు ఓకే అనడంతో ముందుగానే యాడ్‌ ఏజెన్సీ నిర్వహకులు కొంత మొత్తం వారికి చెల్లించారు. అయితే అంతా వారు అనుకున్నట్లు జరిగితే...ఈ కథ బయటకు వచ్చేది కాదు. 

ప్రభుత్వ ప్రకటనల జారీ విషయంలో  ప్రభుత్వం కేంద్రీకృత విధానాన్ని అమలులోకి తేవడంతో ముందస్తు కుదుర్చుకున్న బేరాలు సాగలేదు.  ప్రభుత్వ విధానం ప్రకారం ఏశాఖ ప్రకటనలు విడుదల చేసినా సమాచారశాఖ ద్వారానే విడుదల చేయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో మంత్రి బంధువులతో బేరం కుదుర్చుకున్న వారు లబోదిబోమంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈశాఖ నుంచి భారీగా యాడ్స్‌ పేరిట కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఘనులు తాజా నిబంధనలతో ఆందోళన చెందుతున్నారు. ప్రకనల జారీకీ సెంట్రల్‌ విధానం ఉన్నా...మంత్రి తలచుకుంటే తమకు ఆర్‌ఒలు జారీ అవుతాయని యాడ్స్‌ కంపెనీ నిర్వహకులు తొలుత భావించినా...సమాచారశాఖ కమీషనర్‌ గట్టిగా వ్యవహరించడంతో సదరు శాఖ నుంచి యాడ్స్‌ విడుదల కాలేదు. దీంతో ఇక్కడ నుంచి యాడ్స్‌ విడుదల కష్టమని భావించిన  సదరు యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకులు..తమకు యాడ్స్‌ ఇప్పించాలని, లేదంటే తాము ఇచ్చిన సొమ్మును వెనక్కు ఇవ్వాలని సదరు మంత్రి బంధువులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే త్వరలోనే యాడ్స్‌ విడుదల అవుతాయని, అప్పటి వరకు ఆగాలని వారు యాడ్‌ ఏజెన్సీ సంస్థ ప్రతినిధులకు నచ్చచెబుతున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో నడిమధ్య ఉన్న వ్యక్తులు ఇప్పుడు నలిగిపోతున్నారు. అటు యాడ్‌ ఏజెన్సీ వారికి చెప్పలేక..ఇటు శాఖ నుంచి ప్రకటనలు విడుదల చేయించలేక సతమతమవుతున్నారు. మొత్తం మీద..గత టిడిపి ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలను కొల్లగొట్టినట్లు ఇప్పుడూ కొల్లగొట్టాలని భావించిన సదరు యాడ్‌ ఏజెన్సీ సంస్థలు తాజా సంఘటనలతో బిత్తరపోతున్నాయి. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఈశాఖను నిర్వహించిన మంత్రి తన కుమారుడికి ఈ మొత్తం వసూళ్ల బాధ్యతను అప్పచెప్పి..బాగా దండుకున్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఈ విషయం అప్పటి సిఎంఒ కార్యాలయానికి, ఇతర పెద్దల వద్దకు చేరినా..సదరు మంత్రి సామాజికవర్గాన్ని చూసి వెనుకంజ వేశారు. తాజాగా మంత్రి బంధువులను బుట్టలో వేసుకున్నా..ప్రభుత్వ విధానాల కారణంగా చేతికి వచ్చిన సొమ్ము పోయిందనే బాధతో మధ్యవర్తులు, యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకులు నిరుత్సాహానికి గురయ్యారని సమాచారం. 

(670)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ