లేటెస్ట్

అప్పుడు పంపించి...ఇప్పుడు రప్పిస్తున్నారా...?

ఒక వైపు బిజెపి పెద్దలు వేసిన ఎత్తులు ఎదురుతన్నుతున్నా...వారు తమ పాత బుద్దులను మార్చుకున్నట్లు కనిపించడం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఎదురు దెబ్బలు తిన్నా...తోసి రాజని, ఆంధ్రప్రదేశ్‌లో గుంతనక్క ఎత్తులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార తెలుగుదేశం పార్టీని బలహీనపర్చి, ఘోరంగా ఓడించిన 'బిజెపి' పెద్దలు...ఇప్పుడు తమ దృష్టిని అధికార వైకాపాపై పెట్టినట్లు కనిపిస్తోంది. రాజధాని ఢిల్లీ సాక్షిగా జరుగుతున్న సంఘటనలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. వైకాపాకు చెందిన ఎంపీలను చేరదీస్తున్నారని, వారితో పార్టీని చీల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వైకాపాకు చెందిన పలువురు ఎంపీలు ప్రధాని మోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను పదే పదే కలవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మొన్నటి దాకా నర్సాపురం ఎంపీ ఒక్కడే బిజెపి పెద్దలతో సన్నిహితంగా ఉండగా..తాజాగా ఆయనకు మరో ఎంపి కలిసినట్లు తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు 'మాగుంట శ్రీనివాసులరెడ్డి' ప్రధాని మోడీని కలవడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత 'విజయసాయిరెడ్డి'కి తెలియకుండా ఎంపీలెవరూ బిజెపి పెద్దలను కలవడానికి వీలు లేదని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆంక్షలు విధించినా...ఆయన ఆంక్షలను ధిక్కరిస్తూ...పలువురు ఎంపీలు ఒకరి వెంట ఒకరు...బిజెపి పెద్దలను కలుస్తున్నారు. కాగా..ఈ కలయికలపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు.

ప్రస్తుతం వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి మనోభిష్టానికి వ్యతిరేకంగా బిజెపి పెద్దలను కలుస్తోన్న ఎంపీలంతా గతంలో ఆ పార్టీలో ఉన్నవారు కాదని, వారంతా ఎన్నికలకు ముందు టిడిపి, ఇతర పార్టీల నుంచి వైకాపాలో చేరి గెలిచినవారేనని చెబుతున్నారు. నర్సాపురం ఎంపీ 'రఘరామకృష్ణంరాజు' ఎన్నికలకు ముందు టిడిపిలో ఉన్నారని, అప్పట్లో బిజెపి పెద్దలు ఆయనపై ఒత్తిడి చేసి ఆయనను వైకాపాలో చేర్పించారంటారు. అదే విధంగా ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు 'మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు ఎంపీ 'ఆదాల ప్రభాకర్‌రెడ్డి'లు కూడా ఆఖరు నిమిషంలో వైకాపాలో చేరి ఎంపీలుగా గెలుపొందారు. వ్యాపారవేత్తలు అయిన పై ముగ్గురిపై అప్పట్లో బిజెపి పెద్దలు ఒత్తిడి తెచ్చారని,వారిపై ఐటిదాడులు కూడా చేయించి దారికి తెచ్చి వైకాపాలో చేర్పించారంటారు. తనపై విపరీతమైన ఒత్తిడి ఉందని, తాను పార్టీ మారకపోతే తీవ్రఇబ్బందులు ఎదురవుతాయని అందుకే పార్టీ మారాల్సి వచ్చిందని 'మాగుంట' అప్పట్లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు బిజెపి నేతలు ఒత్తిడి తెచ్చి వైకాపాలో చేర్పించిన నేతలే ఇప్పుడు బిజెపి పెద్దలు చుట్టూ తిరుగుతున్నారు. అప్పట్లో వైకాపాలోకి పంపించి...ఇప్పుడు బిజెపిలోకి వారిని రప్పిస్తున్నారనే విశ్లేషణ రాజకీయ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. మొత్తం మీద..పైన పేర్కొన్న ముగ్గురే కాకుండా మరి కొంత మంది ఎంపీలు కూడా బిజెపి పెద్దలకు దగ్గరగా మసలుతున్నారని, వీరంతా బిజెపిలో చేరతారని కాదని, కానీ..ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మాత్రం వీరంతా బిజెపికి జైకొడతారని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

(760)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ