WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అసెంబ్లీకి 'అదితి'....!

టిడిపి సీనియర్‌ నేత,మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు కుమార్తె 'అదితి గజపతి రాజు' వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. విజయనగరం రాజుల వారసురాలిగా ఆమె 2019 ఎన్నికల్లో బరిలో ఉంటారని విజయనగరం జిల్లా టిడిపి నాయకులు చెబుతున్నారు. 'అశోక్‌' కుమార్తె అయిన 'అదితి' గత కొంత కాలంగా రాజకీయ కార్య క్రమాల్లో చురుగ్గా పాల్గంటున్నారు. ఆమె కార్యకర్తలను కలుస్తున్నారు...ప్రజల్లోకి విస్తృతంగా వెళుతూ ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూ..వారు చెప్పిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని జిల్లా నాయకులు చెబుతున్నారు.

  విజయనగరం జిల్లాలో 'పూసపాటి' రాజవంశస్తులు..మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గానే ఉంటున్నారు. 'పూసపాటి' తొలితరంలో కాంగ్రెస్‌లో ఉన్నా...టిడిపి ఆవిర్భావం తరువాత 'పూసపాటి అశోక్‌గజపతిరాజు' ఆపార్టీలో చేరి కీలకనేతగా ఎదిగారు. 1983 నుంచి ప్రతి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు. 1978లో 'జనతాపార్టీ' నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన 'అశోక్‌ గజపతిరాజు' 1983,1985,1989,1994,1999,2009ల్లో అసెంబ్లీకి ఎన్నికవగా 2014లో తొలిసారి ఎంపీగా విజయం సాధించారు. 2004లో మాత్రం ఆయన ఒక అనామకుడైన కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. రాజకీయ జీవితం మొత్తం టిడిపిలోనే కొనసాగించిన ఆయన పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి ఆయన 2019 ఎన్నికల్లో తాను విశ్రాంతి తీసుకుని తన కుమార్తె 'అదితి'ని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారట. 

  అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదని, ఆయనతో ఈ విషయంపై చర్చించలేదని, చర్చించిన తరువాత..'అశోక్‌' ఏమి చేస్తారో..చూడాలి. ఇప్పటికైతే...'అదితి'ని 'విజయనగరం' అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలనే విషయంపై కొంత స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టిక్కెట్‌ ఎక్కడ ఇస్తారనే దానిపై సందేహాలు నెలకొని ఉన్నాయి. అదే సమయంలో 'అదితి' అసెంబ్లీకి పోటీ చేస్తే..'అశోక్‌' ఎన్నికలకు దూరంగా ఉంటారా..? లేక మళ్లీ పార్లమెంట్‌కు పోటీ చేస్తారా..? ఎన్నికలకు దూరంగా ఉంటే అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా..? ఇవన్నీ జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని జిల్లా నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద..తొలిసారి..రాజవంశం నుంచి ఓ మహిళ ఎన్నికల్లోపోటీ చేయడం దాదాపు ఖాయమేనని వారు అంటున్నారు.

(720)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ