WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి 'నక్కా'కు ఎదురుగాలి...!

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి 'నక్కా ఆనందబాబు'కు రాజకీయంగా ఎదురుగాలి వీస్తుందా..అంటే అవుననే అంటున్నారు..రాజకీయ విశ్లేషకులు. గుంటూరు జిల్లా 'వేమూరు' నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఆయనకు రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవడం అంత సులువు కాదని..స్వంత పార్టీ వర్గాలే అంటున్నాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా...ఆయన నియోజకవర్గ ప్రజలకు దగ్గరకాలేదని, కార్యకర్తలకు కూడా దూరం అవుతున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు..కార్యకర్తలను ఆదరించిన 'నక్కా' మంత్రి పదవి పొందిన తరువాత...దూరం అయ్యారనే మాట పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఎవరికీ అందుబాటులో ఉండడం లేదనేది ఒక అభియోగం కాగా, నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేయించలేకపోయారనేది మరో విమర్శ ఆయనపై ఉంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఇంత వరకు శాఖపై పట్టుసాధించలేకపోయారని అధికార వర్గాలు కూడా అంటున్నాయి. ఎస్సీ నియోజకవర్గమైన 'వేమూరు'లో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా బలమైన ముద్ర వేయాల్సిన ఆయన నాసిరకంగా పనిచేస్తున్నారు. నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తున్నారని, ఏదీ సీరియస్‌గా తీసుకోవడం లేదని..చెబుతున్నారు.

    వేల కోట్లు నిధులున్న సాంఘిక సంక్షేమశాఖలోని నిధులను ఉపయోగించుకుని..ఎస్సీలను పార్టీ వైపు ఆకర్షించాల్సిన ఆయన అందుకు విరుద్దంగా వారి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం సంగతి అలా ఉంచినా...నియోజకవర్గంలో ఆయనను వ్యతిరేకించే ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన నియోజకవర్గంలో పర్యటించగా..ఆ సభలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. సిఎం సభలను విజయవంతం చేయడంలో మంత్రి నక్కా ఆనందబాబు' విఫలమయ్యారనే మాట పార్టీ వర్గాల నుంచి వస్తోంది. ప్రజలను సమీకరించడంలోనూ..వారిని ఆకర్షించడంలోనూ ఆయన ఘోరాతి ఘోరంగా విఫలమయ్యారని..పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో సాంఘికసంక్షేమశాఖ మంత్రిగా దూసుకపోవాల్సిన ఆయన అనాసక్తితో పనిచేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మంత్రి పనితీరును చూసిన ప్రజలు నెమ్మదిగా వైకాపా వైపు మొగ్గు చూపుతున్నారని..నియోజకవర్గ పరిస్థితిని దగ్గర నుంచి గమనించిన రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందిన 'ఆనందబాబు' ఈసారి గెలుపు తీరాలకు చేరాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు.

'ఆనందబాబు' కంటే 'రావెలే' మెరుగట...!

గతంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన 'రావెల కిశోర్‌బాబు' 'ఆనందబాబు' కంటే బాగా పనిచేశారని..ఆశాఖలోని ఉద్యోగులు కొందరు చెబుతున్నారు. మంత్రిగా 'రావెల' రాణించారు..కానీ..ఆయన అవినీతి కార్యక్రమాలు, ఇతర అనవసర విషయాల వల్ల వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. అంతే కానీ..మంత్రిగా శాఖపై పూర్తి పట్టుసాధించి..సఫలమయ్యారు. ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్న 'ఆనందబాబు'శాఖపై పట్టుసాధించలేదని, ఇంకా శాఖ కార్యదర్శిదే పెత్తనమని, ఆయన ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడుతున్నారనే విమర్శ వస్తోంది. కాగా..మంత్రి కార్యాలయ సిబ్బంది కూడా చేతివాటం చూపుతున్నారని, శాఖ నుంచి విడుదల చేసే ప్రకటనల్లో భారీ ఎత్తున్న అవినీతి జరుగుతుందని సచివాలయ వర్గాలు అంటున్నాయి. అవినీతిలో 'రావెల'ను మించిపోతున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైనా..ఆనందబాబు తన పనితీరు మార్చుకుంటారా..? లేక..మరో 'రావెల'గా మిగిలిపోతారా..? వేచి చూడాల్సి ఉంది.

(489)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ