'లోక్‌సత్తా' పాత్రను 'కాంగ్రెస్‌' పోషించబోతుందా...!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోక్‌సత్తా' పాత్రను 'కాంగ్రెస్‌' పోషించబోతుందా...!?

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు...అన్ని రాజకీయపార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. వివిధ పార్టీలు..రాబోయే ఎన్నికల్లో..తాము ఎలా గెలవాలనే దానిపై వ్యూహ,ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ప్రధాన పార్టీలు ఎలాగైనా గెలవాలనే భావనతో కష్టపడుతుండగా...నామ మాత్రమైన పార్టీలు మాత్రం..తాము గెలవకపోయినా..తమ ప్రత్యర్థులు గెలవకూడదని..భావిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు ఈ విషయంలో పట్టుదలగా ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తన దాయాది..వైకాపా గెలవకూడదని భావిస్తుండగా...బిజెపి మొన్నటి దాకా తన మిత్రపక్షంగా వ్యవహరించిన తెలుగుదేశంపార్టీ మళ్లీ గెలవకూడదని, అందు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతోంది. దీంతో..ఈ రెండు జాతీయ పార్టీలు..ప్రాంతీయపార్టీలైన వైకాపా, టిడిపిలను రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా దెబ్బతీస్తాయనే దానిపై రాజకీయ పరిశీలకుల్లో చర్చలు జరుగుతున్నాయి.

  అధికార టిడిపిని బిజెపి దెబ్బతీయాలని వ్యూహాలు రచించినా, లేక ఎత్తులు వేసినా...దాని ఆటలు మాత్రం ఆంధ్రాలో సాగే పరిస్థితి లేదు. ఆపార్టీ ఆంధ్రాకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చని కారణంగా..బిజెపి నేతలపై ప్రజలు మండిపడుతున్నారు. బిజెపి అంటేనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో..ఆపార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా..వారికి వంద ఓట్లు కూడా రావడం కష్టమే. అదే సమయంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ముఖ్యంగా ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' పగ్గాలు చేపట్టిన తరువాత..ఆపార్టీ క్రమంగా కోలుకుంటోంది. జాతీయ స్థాయిలో కోలుకున్న విధంగానే..ఆంధ్రాలో కూడా ఆ పార్టీ కొంచెం కొంచెం పుంజుకుంటోంది. విభజన సందర్భంగా తాము ఇచ్చిన హామీలను అధికారంలోకి వస్తే..నెరవేరు స్తామని, ప్రత్యేకహోదాపై మొదటి సంతకం చేస్తామని..ఆ పార్టీ నేతలు చేస్తోన్న హామీలు ప్రజల్లోకి బాగానే వెళుతున్నాయి. దీంతో..గతంలో వచ్చిన ఓట్ల కంటే...ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధిస్తుందనే అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

  గత ఎన్నికల్లో ఆ పార్టీకి దాదాపు మూడు శాతం ఓట్లు రాగా..ఈ సారి ఐదుశాతానికి తగ్గవని...ఆపార్టీ నాయకులతో పాటు..వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఐదువేల ఓట్లును ఆ పార్టీ సాధించగలదనే భావన కూడా వారిలో ఉంది. అయితే...ఈ ఐదువేల ఓట్లు...ప్రతిపక్ష వైకాపా నుంచి వచ్చేవే. ఎందుకంటే..గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓట్లు..రాష్ట్ర విభజన జరిగిన తరువాత...వైకాపాకు మళ్లాయి. అయితే..ఇప్పుడు..ప్రజల్లో..కాంగ్రెస్‌పై ఆగ్రహం చల్లారడంతో..మళ్లీ ఆ పార్టీ తన సాంప్రదాయ ఓట్లను పొందగలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఐదు వేల నుంచి పదివేలు ఓట్లు సాధిస్తే...కాంగ్రెస్‌ వల్ల 'జగన్‌' బాగా దెబ్బతింటారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖచ్చితంగా జరుగుతుందని బలమైన ముక్కోణపు పోటీలో కాంగ్రెస్‌పార్టీ చీల్చే..ఓట్లే పార్టీల గెలుపుఓటములను నిర్ణయిస్తుంది.

  2009 ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ముక్కోణపు పోటీ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్‌, టిడిపి, ప్రజారాజ్యం పార్టీలు పోటీ పడ్డాయి. ఈ ముక్కోణపు పోటీలో కాంగ్రెస్‌,టిడిపిలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటే...ప్రజారాజ్యం కూడా కొన్ని చోట్ల టిడిపితో..మరి కొన్ని చోట కాంగ్రెస్‌తో ఢీ కొట్టింది. అయితే...ఇదే సమయంలో అప్పట్లో..లోక్‌సత్తా పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి పదివేల ఓట్లు సాధించి...టిడిపిని దెబ్బకొట్టింది. సాంప్రదాయంగా టిడిపికి ఓటు వేసే మధ్యతరగతి ప్రజలు, మేధావులు 'లోక్‌సత్తా' అధినేత 'జయప్రకాష్‌నారాయణ' వల్ల 'లోక్‌సత్తా'కు ఓటు వేశారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి పదివేల ఓట్లు వరకు టిడిపికి పడే ఓట్లు..లోక్‌సత్తా చీల్చుకుంది. దీంతో..కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి వెయ్యి, రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అప్పట్లో 'ప్రజారాజ్యం' కొట్టిన దెబ్బ కంటే...'లోక్‌సత్తా' చీల్చిన ఓట్లే..టిడిపికి నష్టం చేకూర్చాయి. బలమైన ముక్కోణపు పోటీలో...సాంప్రదాయంగా..తనకు వచ్చే ఓట్లు లోక్‌సత్తా చీల్చడం..ఆ నాటి టిడిపి పరాజయానికి ప్రధాన కారణం. 

   ఇప్పుడు అచ్చం 2009 ఎన్నికల వలే..పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వైపు అధికార టిడిపి, మరో వైపు ప్రధాన ప్రతిపక్షం వైకాపా, ఇంకో వైపు సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌' పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. ఇవి కాక..బిజెపి,కాంగ్రెస్‌లు కూడా బరిలో ఉంటాయి. అయితే...కాంగ్రెస్‌ ఇప్పుడు వైకాపాకు ముప్పుగా పరిగణించబోతోంది. వైకాపా సాంప్రదాయ ఓటును కాంగ్రెస్‌ చీల్చితే...ఆ ప్రభావం వైకాపాపై గట్టిగా పడుతుంది. దీంతో..2009లో కాంగ్రెస్‌కు లాభం చేకూరిన చందంగా...ఇప్పుడు టిడిపికి లాభం చేకూరుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌ ఎంత బలపడితే...తమకు అంత మేలు జరుగుతుందని..టిడిపి వర్గాలు అంతర్గతంగా విశ్లేషించుకుంటున్నాయి. మరి..ఈ ముప్పును వైకాపా ఎలా ఎదుర్కొంటుందో..చూడాల్సి ఉంది.  

(220)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ