'మోడీ' భయంతో ఎన్నికలకు దూరంగా 'వైకాపా'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ' భయంతో ఎన్నికలకు దూరంగా 'వైకాపా'...!

ప్రతిపక్ష వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి గట్టి చిక్కువచ్చిపడింది. నిన్న మొన్నటి దాకా బిజెపి పెద్దలతో రహస్యం స్నేహం చేసిన ఆయనకు ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జ్వరం తెప్పిస్తోంది. ఈ ఎన్నికల్లో తాము ఎన్‌డిఎకు ఓటు వేయమని బహిరంగంగా చెప్పినా..ఆ మాట నిలుపుకోలేని పరిస్థితుల్లో పార్టీ పడిపోయింది. తాజా సమాచారం ప్రకారం డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్‌, వైకాపా, బిజెడి పార్టీలు కీలకం కానున్నాయి. ఎన్‌డిఎకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ తమ కూటమి అభ్యర్థిని ప్రకటించడంతో ఈ ఎన్నిక 'మోడీ,షాలకు ప్రతిష్టాత్మకం కానుంది. రాజ్యసభలో మెజార్టీ లేని 'మోడీ' ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే...ఎన్‌డియేతర పార్టీల మద్దతు అవసరం. దీంతో..ఆయా పార్టీల అధినేతలను తమకు ఓటు వేయమని..'షా' కోరుతున్నారు. ఇప్పటికే అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్‌, బిజెడి, వైకాపాలతో ఆయన మంతనాలు సాగించారు. అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్‌,బిజెడి వారికి మద్దతు ఇవ్వవచ్చు. వారికి మద్దతు ఇచ్చే విషయంలో పెద్దగా ఆటంకాలు ఏమీ లేవు. కానీ వైకాపా పరిస్థితి మాత్రం అదికాదు. ఆ పార్టీ ఇప్పుడు కనుక బిజెపికి మద్దతు ఇస్తే..వైకాపా,బిజెపిలు రహస్యస్నేహితులని, వైకాపాకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా..అధినేత 'జగన్‌' కేసులే ముఖ్యమనే సంగతి ప్రజలకు తెలిసిపోతుంది. ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎకి మద్దతు ఇచ్చిన వైకాపా..బిజెపితో అంటకాగుతోందన్న పరిస్థితిని తెచ్చుకుంది. ఆ పార్టీ అధినేత కూడా రాష్ట్రానికి ఏమీ ఇవ్వని 'మోడీ'ని ఏమీ అనకుండా సిఎం చంద్రబాబుపై విరుచుకుపడుతుండడం, వారి రహస్య అవగానలో భాగమేనన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది. తాజాగా ఇప్పుడు కనుక బిజెపిని సమర్థిస్తే..వందశాతం ఇది నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంది. దాంతో తాము ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైకాపా నేతలు ప్రకటించినా వాస్తవానికి వారు ఆ పనిచేయలేరని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో ఓడిపోయేందుకు మోడీ,షాలు సిద్దంగా లేరని, వైకాపా ఎన్‌డిఎకు ఓటు వేయకపోతే వారి సంగతి తేలుస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఏమి చేయాలో వైకాపా నేతలకు పాలు పోవడం లేదు. చివరకు...ఎవరికి ఓటు వేయకుండా...ఎన్నికలకు దూరంగా ఉండాలని వైకాపా నేతలు నిర్ణయించారట. దూరంగా ఉంటే మోడీ,షాలు ఊరుకుంటారా..?

(252)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ