లేటెస్ట్

'బిజెపి,టిడిపి'ల మధ్య అంతరం తగ్గుతుందా...?

ఇటీవల ఎన్నికలకు ముందు బిజెపి, టిడిపి పార్టీలు రెండూ ఒకరి అంతు ఒకరు చూసుకోవడానికి ప్రయత్నించాయి. కేంద్రంలో బిజెపిని అధికారంలోకి రానీయకుండా చేసేందుకు 'చంద్రబాబు', రాష్ట్రంలో మళ్లీ టిడిపి గెలవకుండా చూసేందుకు 'బిజెపి' పెద్దలు తమ ప్రయత్నాలు తాము చేశారు. ఈ యుద్ధంలో 'టిడిపి'పై 'బిజెపి' విజయభేరీ మోగించింది. ఎన్నడూ లేని రీతిలో టిడిపి ఘోరపరాజయం పాలయి రాష్ట్రంలో బక్కచిక్కిపోయింది. ఇదే అదనుగా ఆ పార్టీని దెబ్బతీసేందుకు బిజెపి పెద్దలు వలసలకు తెరతీశారు. టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యులను బిజెపిలో చేర్చుకున్నారు. తరువాత మరి కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. పలువురు టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని, టిడిపి పని అయిపోయిందని, బిజెపి రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఒకటే ప్రచారం చేశారు. దీన్ని నిజం చేస్తూ పలువురు టిడిపి ఎమ్మెల్యేలు బిజెపిలో చేరిపోతారని, వారితో పాటు క్యాడర్‌ మొత్తం బిజెపిలో విలీనం అయిపోతుందన్న రీతిలో ఒకటే ప్రచారం హోరెత్తింది. ఆరు నెలల కాలంలో ఈ ప్రచారం తీవ్రస్థాయిలో జరిగినా..అనుకున్న రీతిలో మాత్రం టిడిపి నుంచి బిజెపి వైపు వలసలు జరగలేదు. రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో కానీ...ప్రస్తుతానికి వలసలకు మాత్రం బ్రేక్‌ పడింది. వలసల విషయం ప్రస్తావించకుండా, టిడిపి మళ్లీ బిజెపికి దగ్గరయ్యేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో బిజెపికి అవసరం ఉన్నా లేకున్నా మద్దతు ప్రకటిస్తూ..తమ వైపు నుంచి వారి దగ్గరకు జరిగేందుకు యత్నిస్తోంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు 'నారా చంద్రబాబునాయుడు' నుంచి పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజెపి నేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

మొదట్లో టిడిపి నేతలు చేస్తోన్న ప్రయత్నాలను పట్టించుకోని బిజెపి పెద్దలు..తాజాగా వారిని చేరదీస్తూ వారితో మాట్లాడుతూ..వారిని ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఎవరూ ఊహించనివిధంగా టిడిపి ఎంపీలను పలు ప్రతిష్టాత్మకమైన కమిటీల్లో మెంబర్లుగా వేశారు. అదే సమయంలో హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేకంగా వారికి అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ టిడిపి ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో గూండా పరిపాలన చేస్తోందని, మత,కుల రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు బిజెపితో కలిసి నడిచిన వైకాపా ఇప్పుడు ఇక్కట్లను ఎదుర్కొంటోంది. మొత్తం మీద..ఇటీవల వరకు బద్దశత్రువులుగా వ్యవహరించిన 'బిజెపి, టిడిపి' పార్టీలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...టిడిపిని దగ్గరకు తీయడం ప్రధాని మోడీకి ఇష్టం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కానీ..కేంద్ర హోంమంత్రి మాత్రం టిడిపిని కలుపుకుని వెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని, రాబోయే కాలంలో వచ్చే అవసరాలను దృష్టిలో ఉంచుకునే 'అమిత్‌షా' టిడిపికి స్నేహాస్తాం అందిస్తున్నారని ఆ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చూద్దాం..మరి రాబోయే కాలంలో ఇది నిజం అవుతుందా..? లేదో..?

(453)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ