WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌'కు ఓటమి భయం పట్టుకుందా...!?

నిన్న మొన్నటి దాకా..తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా..అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని...ఆపార్టీ నాయకులతో పాటు...వివిధ వర్గాలకు చెందిన నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతుండేవారు. కొందరు బలంగా నమ్మారు. మళ్లీ..అధికారం కెసిఆర్‌ కుటుంబానిదే..అనే వారి సంఖ్య కూడా ఎక్కువే. కెసిఆర్‌ అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో మళ్లీ ఆయన అధికారంలో కూర్చోవడం ఖాయమని ఓ వర్గం మీడియా కూడా బలంగా నమ్ముతుండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. కెసిఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తారన్న వర్గాలే ఇప్పుడు పెదవి విరుస్తున్నాయి. ఆయన అధికారంలోకి వచ్చే సంగతి దేవుడెరుగు..కనీసం 40సీట్లు గెలిస్తేనే గొప్ప అనే స్థాయికి టిఆర్‌ఎస్‌ పరిస్థితి వచ్చేసిందని సదరు మీడియా సంస్థలే వ్యాఖ్యానిస్తున్నాయి.

  అసలు హఠాత్తుగా ఎందుకు టిఆర్‌ఎస్‌ పరిస్థితి దిగజారింది..అంటే పలు కారణాలను చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014లో తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజలు టిఆర్‌ఎస్‌ను ఆదరించారు. అప్పుడు కూడా ఆ పార్టీకి గణనీయమైన మెజార్టీనేమీ ప్రజలు ఇవ్వలేదు. బటా బటి మెజార్టీనే ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక...కెసిఆర్‌ పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని బలపడ్డారు. అదే సమయంలో వచ్చిన హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు, పలు ఉపఎన్నికల్లో ఎదురు లేకుండా టిఆర్‌ఎస్‌ గెలవడంతో..ఇక మళ్లీ కెసిఆర్‌దే రాజ్యమని...ఆయన స్వంత మీడియా సంస్థలతోపాటు...భయపడిన కొన్ని ఆంధ్రా మీడియా సంస్థలు కూడా చెప్పడంతో..ఇన్నాళ్లూ అదే నిజమని తటస్తులు కూడా నమ్మారు. ఎన్నికలు సమీపించే కొద్ది అసలైన వాస్తవాలు భయటకు వస్తున్నాయి. ఈ నాలుగేళ్ల టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సాధించిదేమిటీ..? అని ప్రశ్నిస్తే...సమాధానం చెప్పడం కష్టమే అవుతుంది. విభజనతో అన్ని విధాలుగా లాభపడి..ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులు పాలు ఎలా అయింది...? ఈ నాలుగేళ్లలో కొత్తగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిదేమిటి..? ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మించారా..? లేక ఒక కొత్త పరిశ్రమను తెచ్చారా..? లేక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా..? ఎన్ని లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇచ్చారు..? పోనీ ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా..? దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూములు..ఎక్కడికి పోయాయి..? హైదరాబాద్‌ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లేమయ్యాయి..? అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్న లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి..? రైతుల ఆత్మహత్యల నివారణకు చేసిందేమిటి..? ఎప్పటికప్పుడు...తాయిళాలు ప్రకటిస్తూ..ప్రచారం చేసుకోవడం తప్ప..చేసిందేమిటి..? ఈ నాలుగేళ్లలో చేసిన ప్రచార ఖర్చు ఎంత...? దేశ,అంతర్జాతీయ, స్థానికంగా వెలువడే మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలు...గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. 

   ఇటువంటి...ప్రచారహోరుతో..ఇన్నాళ్లూ నెట్టకొచ్చిన...కెసిఆర్‌కు ఇప్పుడు అసలైన సవాల్‌ ఎదురవుతోంది. ఎళ్లకాలం ప్రజలను మోసం చేయలేమనే సంగతి తెలిసే..ఇప్పుడు..ఇదే ప్రచార హోరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లి...గెలుపొందాలనే ధ్యేయంతో కెసిఆర్‌ ముందస్తు అని కలవరిస్తున్నారు. ముందస్తు ఎన్నికల కోసం 'మోడీ'ని కాకాపట్టి...ఏదో విధంగా గెలవాలనే ఆశతో...ఆయన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో...బిజెపికి మద్దతు ప్రకటించారు. జమిలి ఎన్నికలైతే నష్టపోతామనే భావనతో...అసెంబ్లీకి ముందుగా ఎన్నికలు జరిపిస్తే...ఇంకా పుంజుకోని కాంగ్రెస్‌, టిడిపిలను నిలవరించవచ్చని ఆయన భావిస్తున్నారు. మొత్తం మీద..ఓటమి భయంతోనే కెసిఆర్‌..ముందస్తు ఎన్నికలని కలవరిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు.

(726)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ