WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మూడు రాష్ట్రాల్లోనూ...బిజెపికి ఓటమి తప్పదట...!

సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపికి పెద్ద షాక్‌ తగలబోతోందట. ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉన్న 'మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌,ఛత్తీస్‌ఘడ్‌'ల్లో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమని..ఓ సర్వే తేల్చి చెప్పింది. డిసెంబర్‌లో జరగనున్న ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో...కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఏబీపీన్యూస్‌-సీ ఓటర్‌ సర్వే తేల్చి చెప్పింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది.

  ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో..బిజెపి 163 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్‌కు కేవలం 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో ఈ ఫలితాలు తారు మారు అవుతాయని సర్వే చెప్పింది. డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 130 స్థానాలు వస్తాయని, అధికార బిజెపికి 57 స్థానాలు దక్కనుండగా..ఇతరులకు 13 స్థానాలు దక్కుతాయని సర్వే చెప్పింది. అంటే ఇక్కడ కాంగ్రెస్‌ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రానుంది.

  మధ్యప్రదేశ్‌లోనూ అదే ఫలితాలు రాబోతున్నాయి. 2013లో బిజెపికి ఇక్కడ 165 స్థానాలు లభించగా..కాంగ్రెస్‌కు కేవలం 58 స్థానాలు మాత్రమే వచ్చాయి. 2018 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు 117 స్థానాలు లభించి అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది. అధికార బిజెపి ఇక్కడ కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇవ్వనుంది. ఆ పార్టీ 106 స్థానాలు సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఇతరులకు 6 స్థానాలు లభిస్తాయి.

  ఛత్తీస్‌ఘడ్‌లో కూడా కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని..సర్వే స్పష్టం చేసింది. ఇక్కడ..కాంగ్రెస్‌ 54 స్థానాలు సాధించి..అధికారంలోకి రాబోతోందట. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపికి 33స్థానాలు వస్తాయి. అంటే కాంగ్రెస్‌ స్పష్టమైన మెజార్టీ సాధించి..ఛత్తీస్‌ఘడ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గత ఎన్నికల్లో హోరాహోరు పోరు జరిగినా..బిజెపి స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే..ఈసారి మాత్రం కాంగ్రెస్‌ తన ఆధిక్యాన్ని రుజువు చేసుకోబోతోంది. మొత్తం మీద..తమ చేతిలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ..బిజెపి ఓడిపోబోతుందని..సర్వే స్పష్టం చేయడం కమలనాధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే..ఫైనల్‌లో కూడా కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

(839)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ