WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్ర‌భుత్వ ప‌రువు తీస్తోన్న ఐ&పిఆర్‌ అధికారులు...!

బంగారు తెలంగాణలో పత్రికలకు మహర్దశ పట్టింది. వద్దన్నా వేల కోట్ల రూపాయలు ప్రకటనలు గుప్పిస్తూ ప్రచారాన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.  దీంతో పత్రికాయాజమాన్యుల పంట పండుతోంది. పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు,ఇతర భాషా పత్రికలకు ప్రకటనలను ఇతోధికంగా ప్రకటనలు ఇస్తున్నారు. అడిగిందే తడవుగా వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటనల కింద ఖర్చు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ సమాచార,పౌరసంబధాలశాఖ రోజూ ప్రకటనలను విడుదల చేస్తూ...ప్రచారం నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆయా ప్రకటనలు రిలీజ్‌ అవుతున్నాయి. అయితే..ఈ ప్రకటనలను రూపొందించిన విధానంపై,ఆ ప్రకటనల్లో ఉన్న వ్యక్తులను ఉపయోగించుకున్న విధానంపై ఐ&పిఆర్‌ అధికారులు చేసిన తప్పులు తెలంగాణ ప్రభుత్వ పరువును తీస్తున్నాయి. ప్రకటనలోని కంటెంట్‌, ఫోటోల విషయంలో ఇప్పుడు అక్కడ రాద్ధాంతం జరుగుతోంది. 

  ఇటీవలే ఒక ప్రకటనలో ఓ మహిళ ఫోటోను రెండు ప్రకటనల్లో వాడుకున్నారు. వాటిలో ఒక ప్రకటనలో ఆమె భర్తగా ఒక వ్యక్తిని చూపిస్తూ..రెండో ప్రకటనలో మరో వ్యక్తిని చూపించారు. ఈ విషయాన్ని మీడియా బట్టబయలు చేయడంతో కెసిఆర్‌ ప్రభుత్వ పరువుపోయింది. అయితే...తాజాగా..ఆయా ప్రకటనల్లో ఉన్న మహిళ తన ఫోటోలు ఆ విధంగా ప్రచురించడంపై... అభ్యంతరం,ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ..తాము అతిపేదవారమని..అప్పుడెప్పుడో.. తమకు ప్రభుత్వ పథకాలను అందిస్తామని..తమ కుటుంబ ఫోటోలను అధికారులు తీసుకెళ్లారని..తరువాత...తమకెవరూ ఎటువంటి సహాయం చేయలేదని తెలిపింది. అయితే తరువాత..తమకు ఎన్నో పథకాలు అందినట్లు..తాము సంతోషంగా ఉన్నట్లు పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయని కొందరు తెలిపారని, దీనిపై మొదట్లో తాము పెద్దగా పట్టించుకోలేదని..ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో తన పక్కన తన భర్త బదులు వేరే వ్యక్తుల ఫోటోలను పేపర్స్‌లో ముద్రించారని, ఇది తనకు అవమానకరమని పేర్కొంది. తనను తమ బంధువులు హీనంగా చూస్తున్నారని..ఆమె వాపోయింది. ప్రభుత్వ పథకాలు అందకపోతే పోయింది..ఈ ప్రచారమేమిటి..? అంటూ ఆమె తన ఆవేదనను మీడియా ముందు వెళ్లబోసుకుంది.

   ఒకవైపు వేల కోట్ల రూపాయలను యాడ్‌ ఏజెన్సీలకి తగలబెడుతున్న ఐ&పిఆర్‌ అధికారులు తాము విడుదల చేస్తోన్న ప్రకటనల్లో ఏమి ఉందో చూసుకోకుండా ఎలా ఉన్నారనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరులకు చెందిన యాడ్‌ ఏజెన్సీలకు వేల కోట్లు ఇస్తోన్న ఐ&పిఆర్‌ అధికారులు..ఈ విషయంలో ఎందుకు శ్రద్ద తీసుకోవడం లేదనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇంత బాధ్యతారహితంగా అధికారులు ఎలా పనిచేస్తున్నారు...? దీనిని పర్యవేక్షించేవారెవరూ లేకపోవడంతోనే ఈ విధంగా జరుగుతోందా..? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. రాష్ట్ర సమాచారశాఖను స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధీనంలో ఉన్నా..ఇటువంటి తప్పులు ఎందుకు జరుగుతున్నాయో..తెలియడం లేదు. ప్రభుత్వ ప్రతిష్టను అధికారులు దిగజారుస్తున్నారని వారి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని...కొందరు అధికారపార్టీ నాయకులు పేర్కొంటున్నారు. వేల కోట్లరూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తూ ప్రచారం చేస్తున్నా..వాటిపై విమర్శలు రావడం తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. తాజాగా..ఈ ప్రచార పర్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ అస్త్రంగా మలచుకోబోతంది. ఇన్నాళ్లూ తెలంగాణలో తాము చెప్పిందే జరిగిందని, ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదని, కేవలం ప్రకటనలతోనే కాలక్షేపం చేస్తున్నారనే విషయం తాజా సంఘటనతో తేటతెల్లం అయిందని..వారు అంటున్నారు. మొత్తం మీద ఐ&పిఆర్‌ అధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

(485)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ