లేటెస్ట్

'పులిరాజా'ను మరిచిపోయిన ప్రభుత్వాలు...!

ఓ పదేళ్ల కిందట తెలుగురాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 'పులిరాజా' ప్రకటనలు దర్శనమిచ్చేవి..? ఏ గోడలపై చూసినా లేక సినిమా హాళ్లల్లో, రైల్వే స్టేషన్లల్లో, ఇతర పబ్లిక్‌ప్లేస్‌ల్లో ఈ ప్రకటనలు కనిపించేవి. 'పులిరాజా'కు ఎయిడ్స్‌ వస్తుందా..? అనే ప్రకటన అప్పట్లో విశేషంగా ఆకర్షించడంతో పాటు...వారిలో చైతన్యానికి కారణమైంది. ఎయిడ్స్‌ వ్యాధి గురించి, ఎవరికి ఎయిడ్స్‌ వస్తుంది..? ఎటువంటి వారికైనా సురక్షితమైన లైగింక కార్యకలాపాలు జరపకపోతే 'పయిడ్స్‌' వస్తుందనేది ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన తరువాత తెలుగు రాష్ట్రాల్లో 'ఎయిడ్స్‌' గురించి విస్తృతమైన చర్చ జరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఎయిడ్స్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్గింది. అప్పట్లో ఆ ప్రకటన ఓ సంచలనం. అయితే తరువాత కాలంలో 'ఎయిడ్స్‌' వ్యాధి విషయంలో ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.  నాటికి నేటికి 'ఎయిడ్స్‌' విషయంలో ప్రజల్లో అవహగాన బాగా పెరిగిన 'ఎయిడ్స్‌' రోగులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఎయిడ్స్‌ వ్యాధి పూర్తిగా నయం కాకున్నా...సరైన మందులు తీసుకుని, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడపగలిగితే రోగుల జీవిత కాలాన్ని పెంచుకోవచ్చనే భావన రోగుల్లోనూ, ఇతర ప్రజల్లోనూ అవగాహన కలిగినా..కొందరు మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

నేటి యువతకు ఈ వ్యాధిపై పూర్తి అవగాహన ఉన్నా, నిర్లక్ష్యం,మత్తుపానీయాల సేవనంతో వ్యాధులబారిన పడుతున్నారు. వ్యాధి బారిన పడిన యువత ఎఆర్‌టి మందులు వాడకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో..మరణాల రేటు పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధి తగ్గు ముఖం పట్టినా వ్యాధిగ్రస్తులు మాత్రం తగ్గడం లేదు. 2015-2018 వరకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 37వేల మంది ఈ వ్యాధితో మృతి చెందారు. గతంలో కన్నా ఈ వ్యాధికి మెరుగైన వైద్యసౌకర్యాలు, ఔషదాలు అందుబాటులోకి వచ్చినా ఇంత మంది మృతి చెందడం ఆందోళన చెందాల్సిన విషయమే. కేంద్ర ఆరోగ్య,వైద్యశాఖ వారి అంచనా ప్రకారం 2015-16లో 14,129 మంది, 2016-17లో 12,169మంది, 2017-18లో 10,991మంది తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవి వ్యాధితో మృతి చెందారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది మెరుగే. ఇతర రాష్ట్రాల్లో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ మృతుల శాతం ఎక్కువగానే ఉంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు వ్యాధి సంక్రమించిన వెంటనే ఎటిఆర్‌ మందులు వాడకుండా అశ్రద్ద చేయడంతో తరువాత తీవ్రమైన టిబి వ్యాధులకు గురి అవుతున్నారు. అంతే కాకుండా ఇతర ఇన్స్‌ఫెక్షన్స్‌కు గురి అవుతున్నారు. దీంతో రోగి మందులు తీసుకుంటున్నా మృత్యువాత పడకతప్పడం లేదు. వ్యాధి నిర్ధారణ అయిన తరువాత వెంటనే ఎటిఆర్‌ మందులు వాడితే కోలుకునే అవకాశాలున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు శ్రద్ద చూపించడం లేదు. నెలల తరబడి జ్వరం, బరువు తగ్గడం, విరోచనాలు తగ్గకపోతే ఈ వ్యాధి సోకినట్లు అనుమానించాల్సి ఉంటుంది. గతంలో దీనిపై తీవ్రస్థాయిలో ప్రచారం చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రస్తుతం పెద్దగా దీనిపై దృష్టిసారించడం లేదు. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన ఉన్నా..మందుల వాడకం, అసురక్షిత లైంగికకార్యకలాపాలను తగ్గించుకోకపోవడంతో ప్రమాదకరమైన ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో దీనిపై అవగాహన బాగానే ఉన్నా మరింతగా ప్రజలకు మందుల వాడకంపై, సురక్షిత లైంగి విధానాలపై అవగాహన కల్పిస్తే మరణాల రేటు తగ్గించడానికి వీలవుతుంది.ఎయిడ్స్‌ బారిన పడిన రోగులకు ఆరోగ్యశ్రీద్వారా వైద్యసేవలు అందిస్తే..ఖరీదైన వైద్యం రోగులకు అందే అవకాశం ఉంది. 

(412)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ