లేటెస్ట్

ఆరు నెలలు అయినా అధికార వ్యవస్థపై ఇంకా పట్టుదొరకలేదా...?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసి రేపటికి (జూన్‌30)కి ఆరు మాసాలు పూర్తి అవుతాయి. బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆయన ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నారా..? లేదా అనే దానిపై భిన్నాభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా 'జగన్‌' సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తూ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. స్వయంగా స్వంత పార్టీకి చెందిన నేతలే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నాయకులు తమకు సంక్షేమ ముఖ్యమని, అభివృద్ధి తరువాత..అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను సమర్థిస్తున్నా...తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగా అందుతున్నాయా..? ప్రకటనలకే పరిమితమవుతున్నాయా..? అసలు ప్రజలు వీటి గురించి ఏమనుకుంటున్నారు..? అనేదానిపై ముఖ్యమంత్రి కానీ, ఇతర సీనియర్‌ మంత్రులు కానీ సమీక్ష చేసుకున్నట్లు కనపడడం లేదు. రోజుకో సంక్షేమ పథకాన్ని ప్రకటించడం, దానికి ఇంత సొమ్ములు కేటాయిస్తున్నామని, ఫలానా వర్గానికి ఇంత సొమ్ములు,..ఇంకో వర్గానికి ఇంత సొమ్ములు అంటూ ప్రకటనలు చేసుకుంటూ పోతున్నారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితుల్లో..ఇటువంటి పథకాల వల్ల, లేదా..ఇతర సంక్షేమ కార్యక్రమాల వల్ల వచ్చే లాభం గురించి కానీ, నష్టం గురించి కానీ..'జగన్‌' సన్నిహితులైన అధికారులుకానీ, మాజీ అధికారులు కానీ ఆయనకు వివరిస్తున్నట్లు లేదు. 

వాస్తవానికి చూస్తే..ఆరు నెలల 'జగన్‌' పరిపాలనలో ఆయన ఇంకా అధికార వ్యవస్థపై పట్టుసాధించలేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా అధికార వ్యవస్థలో సీనియర్‌ ఐఎఎస్‌, ఇతర సీనియర్‌ అధికారులను ప్రోత్సహించిన 'జగన్‌' తరువాత..వారికి దూరమయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి 'అజయ్‌కల్లంరెడ్డి'ని సలహాదారుగా నియమించుకున్న 'జగన్‌' ఆయన సూచనలతోనే పాలనను ప్రారంభించారు. అయితే ఆయన కానీ, ఇతర సహచరులు కానీ ఇచ్చిన సలహాలు 'జగన్‌'కు మంచిచేసినట్లు కనిపించలేదు. ముఖ్యంగా పీపీఎల విషయంలో ఎదురుదెబ్బ తగలడం, 'జగన్‌' పరువును తీసినట్లైంది. పీపీఏల రద్దు విషయంలో అనాలోచితంగా అధికారులు చెప్పినట్లు చేయడంతో 'ఢిల్లీ' నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పీపీఏల కొరివి ఇప్పట్లో ఆరేటట్లు కనిపించడం లేదు. కొందరు అధికారుల అత్యుత్సాహంతో పీపీఏల విషయంలో తీసుకున్న నిర్ణయం 'జగన్‌'ను తీవ్ర ఇక్కట్లోలో పడేసింది. అధికారం చేపట్టిన తొలిరోజుల్లో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులను, ఇతర అధికారులను 'అన్నా' అని సంభోధించి..వారి మనస్సులను 'జగన్‌' గెలుచుకున్నారు. తమను 'అన్నా' అంటున్నారని, ఇటువంటి సిఎంను ఎప్పుడూ చూడలేదని అధికారులంతా అడ్డమైన సలహాలతో 'ఆయన'పరువు తీశారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అయితే తరువాత..అధికారుల సంగతి తెలుసుకున్న 'జగన్‌' తాను అనుకున్నవిషయాల్లో అధికారుల సలహాలు వినడం మానేశారు. దీంతో సీనియర్‌ అధికారులతో ఆయనకు దూరం ఏర్పడింది.

'ఎల్‌.వి' దుమారం...!

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం' విషయంలో 'జగన్‌' వ్యవహరించిన తీరుతో అధికారులు అవాక్కయ్యారు. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా..ఆయనను సిఎస్‌గా తొలిగించడంతో మిగతా అధికారులు ఎవరికి వారు ముడుచుకుపోతున్నారు. ఆయనతో ఏం చెబితే ఏమి తంటానో అన్నట్లు ఎవరికి వారు తమకేమీ తెలియనట్లు, ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నా చూసీ చూడనట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం సచివాలయ వర్గాల్లో ఉంది. కేవలం ఐఎఎస్‌ అధికారులకే కాదు..సచివాలయ అధికారులు కూడా యాంత్రికంగా పనిచేస్తున్నారని స్వంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరో వైపు పలువురు ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారుల బదిలీలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతున్నాయి. ముందు బదిలీ చేసిన వారికే మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వడం, కొందరు అధికారులపై కక్షపూరితంగా వ్యవహరించడం వివాదాస్పదం అవుతోంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులను వెయిటింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఇంత వరకు వారికి పోస్టింగ్‌ ఇవ్వలేదు. అధికారానుభవం లేకపోవడంతో పాటు తాను అనుకున్న పని నిమిషాల్లో కావాలని చెబుతుండడంతో అధికారులు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. మరి కొందరు అధికారులు మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఆరు నెలల పాలనలో 'జగన్‌' అధికార వ్యవస్థపై పట్టుసాధించలేకపోయారని సచివాలయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

(437)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ