లేటెస్ట్

సిఎంఒ పనితీరు మెరుగైందా...!?

ప్రభుత్వ పరిపాలనకు ఆయువుపట్టైన ముఖ్యమంత్రి కార్యాలయ పనితీరు గత ఆరు నెలల్లో ఎలా ఉందనే దానిపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రిగా 'జగన్‌' ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పలువురు మాజీ ఐఎఎస్‌ అధికారులను సిఎంఒలో నియమించుకున్నారు. వీరిలో 'అజేయకల్లంరెడ్డి' ముఖ్యుడు కాగా..తరువాత 'పి.వి.రమేష్‌',ను, శ్యామూల్‌ను సలహాదారుగా నియమించారు. మొదటి వంద రోజుల్లో సిఎంఒలో దాదాపు నలుగురు రిటైర్‌ అధికారులే పెత్తనం చేశారు. నాడు సిఎంఒలో ఉన్న వారిలో 'అజయ్‌కల్లం, పి.వి.రమేష్‌,జె.మురళీ,శ్యామూల్‌ల హవా బాగానే నడిచింది. అయితే అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం'తో వీరందరికి విభేదాలువచ్చాయి. దీంతో ఆయనను 'సిఎం' పక్కకు తప్పించారు. సిఎస్‌గా 'ఎల్‌వి' ఉన్నప్పుడే సిఎంఒలోకి ఎంటరైన 'ప్రవీణ్‌ప్రకాష్‌' దెబ్బకు సిఎంఒలో ఉన్న విభేదాలన్నీ బహిర్గతం అయ్యాయి. ఆయన దూకుడును సీనియర్లు ఎవరూ తట్టుకోలేకపోయారు. 'ప్రవీణ్‌'కు 'ఎల్‌.వి'కి మధ్య ఏర్పడిన వివాదంలో చివరకు 'ఎల్‌.వి' అత్యంత అవమానకరంగా సిఎస్‌ పోస్టు నుంచి బయటకు రావాల్సి వచ్చింది. 'ఎల్‌.వి' నిష్క్రమణ తరువాత 'నీలంసహానీ'ని 'సిఎస్‌'గా నియమించుకోవడంతో..ప్రస్తుతం సిఎంఒలో విభేదాలులేనట్లు కనిపిస్తున్నాయి. 

'ప్రవీణ్‌ప్రకాష్‌' రాకతో...దూకుడు...!

తొలి వంద రోజులు కన్నా..ఇప్పుడు సిఎంఒ తీరు బాగుందని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఒకరు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో అన్నారు. అప్పట్లో అందరూ వృద్ధులే...ఇప్పుడు మాత్రం యువరక్తం కనిపిస్తోంది. 'ప్రవీణ్‌' దూకుడుతో నిర్ణయాలు తీసుకోవడం, సిఎం ఆయనను ప్రోత్సహించడం సిఎంఒలో క్రమశిక్షణకు కారణమైందని ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా 'ప్రవీణ్‌' మంచి వాడైనా నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు చేయడంలో ఆయన చూపిస్తున్నదూకుడు దెబ్బకు నిదానంగా వ్యవహరించే సీనియర్‌ అధికారులు డంగైపోతున్నారు. సిఎం 'జగన్మోహన్‌రెడ్డే' దూకుడుగా ఉంటే ఆయన కంటే ఎక్కువ దూకుడు 'ప్రవీణ్‌' చూపిస్తున్నారని తద్వారా ఇప్పుడిప్పుడే పాలన సాపీగా సాగుతుందన్న అభిప్రాయం సచివాలయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కాగా...'ప్రవీణ్‌'తో పాటు సిఎం వ్యక్తిగత కార్యదర్శి 'ధునంజయరెడ్డి' కూడా కష్టపడుతున్నారనే మాట వినిపిస్తోంది. ఇక రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారులైన కొంత మంది వల్ల సిఎంఒకు లాభం లేదంటున్నారు. సిఎం ఒఎస్‌డి పి.కృష్ణమోహన్‌రెడ్డి బాగానే పనిచేస్తున్నారని, కాకపోతే ఆయన మొహంమాట వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాంటున్నారు. సిఎం స్పెషల్‌ అధికారి హరికృష్ణ, మరో స్పెష్టల్‌ సెక్రటరీ డి.కృష్ణ పనితీరు అంతంత మాత్రమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే 'ప్రవీణ్‌ప్రకాష్‌' వచ్చిన తరువాత సిఎంఒ దూకుడును ప్రదర్శిస్తూ పాలనకు దారి చూపుతుండగా, మరి కొందరు రిటైర్డ్‌ అధికారులు, ఇతర అధికారుల పనితీరును మార్చుకోవాల్సి ఉందని, వారంతా 'జగన్‌' దూకుడును అందుకోవాలని కోరుకుంటున్నారు. 

(488)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ