నోరులేని ‘మంత్రులు’- అక్షరం ముక్క రాయలేని ‘పిఆర్వోలు’...!
అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా...కూటమి మంత్రులు నోరు విప్పడం లేదు. మంత్రి పదవి దక్కింది కదా...అన్నట్లు పదవిని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిపక్షం అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నా...‘జగన్’ మాటి మాటికి నోరుపారేసుకుంటున్నా..ఈ మంత్రులకు చీమ కుట్టినట్లేనా ఉండడం లేదు. వాళ్లు 11 సీట్లకే పరిమితం అయ్యారు కనుక..వారు చేస్తోన్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారో..లేక మనకెందుకు..‘చంద్రబాబు’నే కదా తిట్టేది..మనల్ని కాదుగా..అని అనుకుంటున్నారో..తెలియదు..కానీ..ప్రతిపక్ష విమర్శలు, ఆరోపణలపై వీసమెత్తు స్పందన కూడా మంత్రుల నుంచి రావడం లేదు. సరే...ప్రతిపక్షానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా..ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా...? తమ శాఖలో ఏమి జరుగుతుందో..ప్రజల కోసం ఎంత ఖర్చు చేస్తున్నామో..? ఏమి చేయబోతున్నామో..అనేది చెప్పాలి..కదా..? అసలేమీ చెప్పకుండా ఎంత అభివృద్ది చేసినా ఉపయోగం ఏమిటి..? తాము చేసిన అభివృద్ది గురించి చెప్పుకోవడానికి వీళ్లకి నోరు లేవడం లేదా..?
ఏడాదికి రూ.33వేల కోట్ల పంపిణీ...అయినా ప్రచారమేది...?
ఉదాహరణకు సామాజిక ఫింఛన్ల విషయమే తీసుకుందాం...ఈ ఫింఛన్ల కింద..దాదాపు ఏడాదికి రూ.33వేల కోట్లు ‘ఎన్టీఆర్ భరోసా స్కీమ్’ కింద పంపిణీ చేస్తున్నారు. గతంలో సంక్షేమానికి తానే ఆద్యుడినని ప్రచారం చేసుకున్న ‘జగన్’ పంచింది కేవలం రూ.23వేల కోట్లు మాత్రమే. అంటే ఐదేళ్లల్లో ‘ఎన్‌డిఏ’ ప్రభుత్వం దాదాపు రూ.1,65,000 కోట్లు ప్రజలకు ఇవ్వబోతోంది. ఈ సంగతి మంత్రులకు ఏమైనా తెలుసా..? తెలిస్తే..వీళ్లు ఎందుకు ప్రచారం చేసుకోవడం లేదు. ‘జగన్’ మాట్లాడితే..తాను ఐదేళ్లల్లో ‘డిబీటీ’ ద్వారా రెండున్నర లక్షల కోట్లు పంచానని అడిగిన వారికి అడగని వారికీ చెబుతుంటారు. ఆయన తన ఐదేళ్ల హయాంలో..ఇచ్చినవన్నీ కలిపి రెండున్నర లక్షల కోట్లు అయితే..కూటమి ప్రభుత్వం కేవలం పెన్షన్ల కింద పంచుతున్నదే లక్షా అరవైయిదు కోట్లు...? ఇంకా అమలులోకి రావాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. అవన్నీ అమలులోకి వస్తే..ఎన్ని లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి చేరతాయో..మంత్రులకు తెలుసా..? మరి ఇంత ప్రజలకు ఇస్తూ కూడా మంత్రులు ఎందుకు ప్రచారం చేసుకోరు...? వీళ్లకు సమాచారం ఇచ్చేవాళ్లు లేరా..? లేక ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా..? తెలియదు...? మంత్రులకు ర్యాంకింగ్‌లు అంటూ..పనికిమాలిన సోది లెక్కలు చెప్పకుండా ఇలాంటి లెక్కలు చెబితే..బాగుంటుంది కదా..? ఆ ర్యాంక్‌లు పట్టిక తయారు చేసిన అధికారి ఎవరో కానీ..దీనిపై కూడా దృష్టిపెట్టి బహిరంగంగా మంత్రులతో మీడియాతో చెప్పించవచ్చు కదా...? కానీ..ఆ పనిచేయరు. సోది ర్యాంక్‌లు ఇచ్చుకుంటూ..కాలక్షేపం చేసుకోవడం తప్ప..పనికి వచ్చే పనులు చేయరు.
అసలు కూటమి ప్రభుత్వానికి ఏమైంది...?
మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉంటే..వీళ్లలో ఒకరో ఇద్దరో.. తప్ప మిగతా వారంతా...నోరెత్తడం లేదు. తొలిసారి మంత్రులు అయినవారంటే..వారు జూనియర్స్ కనుక వారు తడబడుతున్నారో..? లేక అనుభవం లేదనే సరిపెట్టుకోవచ్చు. కానీ..సీనియర్లు అయిన వారు కూడా సరిగా స్పందించడం లేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ప్రతిపక్ష విమర్శలు, ఆరోపణలన్నింటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సమాధానం ఇస్తున్నారు తప్ప..మంత్రులు మాత్రం నోరెత్తడం లేదు. పోనీ ఒకటీ రెండుసార్లు మీడియా సమావేశాలు నిర్వహించినా తూతూ మంత్రంగానే ముగిస్తున్నారు. కీలకమైన శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తోన్నమంత్రులు అసలు ఉన్నారా..? లేరా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘వైకాపా’ విరుచుకుపడ్డ ‘ఆర్థికమంత్రి’ ‘పయ్యావుల కేశవ్’ ఈ మధ్య మీడియా సమావేశాలో నిర్వహించడం లేదు. ఇక ఉపముఖ్యమంత్రి ‘పవన్ కళ్యాణ్’ సంగతి చెప్పాల్సిన పనే లేదు. మరో కీలకమంత్రైన హోంమంత్రి ‘అనిత’ పరిస్థితీ అంతే. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తల్లో ఆమె చాలా చురుగ్గా వ్యవహరించారు. తనపై ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన తరువాత నుంచి ఆమె నిర్లిప్తంగా ఉంటున్నారు. కీలకమైన విద్యాశాఖను నిర్వహిస్తోన్న ‘లోకేష్’ది అదే పరిస్థితి. ఆయన కూడా మీడియాకు దూరంగానే ఉంటున్నారు. అదే విధంగా సీనియర్ మంత్రి ‘ఆనం రాంనారాయణరెడ్డి’దీ అదే పరిస్థితి. వ్యవసాయశాఖ మంత్రి ‘అచ్చెంనాయుడు’ ఇంతకు ముందు ఉన్నంత స్పీడ్‌గా ఇప్పుడు లేరు. మరో సీనియర్ మంత్రి ‘నారాయణ’ అప్పుడప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజధాని మీద మాత్రమే మాట్లాడతారు. ‘జగన్’పై పన్నెత్తి విమర్శ చేయరు. పౌరసరఫరాలశాఖ మంత్రి ‘నాదెండ్ల మనోహర్’ తొలినాళ్లలో బాగానే హడావుడి చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి మిల్లర్స్‌ను బెంబేలెత్తించారు. తరువాత ఏమయిందో కానీ..ఆయనా పెద్దగా హడావుడేం చేయడం లేదు. ‘ఆరోగ్యశాఖ’ మంత్రి ‘సత్యకుమార్’దీ అదే పరిస్థితి. ఇక జలవనరులశాఖమంత్రి ‘నిమ్మలరామానాయుడు’ ఎప్పుడు ప్రజల్లో ఉంటారనే పేరుంది. ఆయన కూడా పెద్దగా మీడియాతో మాట్లాడిరదేమీ లేదు. ‘అనగాని సత్యప్రసాద్’, గొట్టిపాటి రవికుమార్, కొలుసుపార్థసారధి, డోలా బాల వీరాంజనేయులు’ వంటి వారు కూడా అప్పుడప్పుడు తమశాఖకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకుంటున్నారు. వీరు కాకుండా మిగతా మంత్రుల సంగతి ఎవరికీ తెలియదు. అసలు వీళ్లు ఏశాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో కూడా ప్రజలకు మీడియాకు తెలియని పరిస్థితి.
అక్షరం ముక్క రాయలేని పిఆర్వోలు...!
మంత్రుల పరిస్థితి ఇలా ఉంటే..వారి వద్ద ‘పిఆర్వోలు’గా పనిచేసేవారి పరిస్థితి మరింత ఘోరం. మంత్రుల వద్ద ఉన్న ‘పిఆర్వోలు’ల్లో కొంత మందికి అక్షరం ముక్కరాయడం రాదు. (అందరూ కాదు..కొంత మంది) గతంలో ‘జగన్’ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్లు ఇంకా కొందరు కొనసాగుతూనే ఉన్నారు. వీరిలో కొంత మందికి ఆయాశాఖలపై కనీస అవగాహన లేదు. తమశాఖకు సంబంధించిన అంశాలను మీడియాతో పంచుకోవడానికి వీరెవరూ సిద్ధంగా లేరు. వచ్చామా..? వెళ్లామా..అన్నట్లుంది వీరి పరిస్థితి. కొంత మంది పైరవీలు చేస్తూ..పబ్బం గడిపేసు కుంటున్నారు. మంత్రుల మీడియా సమావేశాల్లో మంత్రుల వెనుక నుంచి టీవీల్లో కనిపించడానికే వీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిపై అజమాయిషీ చేయాల్సిన వారు వీరి గురించి పట్టించుకోవడం లేదు. వాళ్లు చేసే పనేమిటో..వాళ్లు చేస్తున్నదేమిటో..కూడా అడిగేవారు లేరు. కాగా కొందరు మాత్రం నిజాయితీగా,సమర్ధవంతంగాపనిచేస్తున్నారు. ఇలా సమర్థవంతంగా పనిచేసేవారికి వచ్చే జీతం నామమాత్రంగా ఉంటోందన్న భావన వారిలోఉంది. మంత్రుల వద్ద పరిస్థితి ఇలా ఉంటే..ముఖ్యమంత్రి కార్యాలయంలో ‘పిఆర్వో’ వ్యవస్థ దారుణంగా ఉంది. ‘చంద్రబాబు నాయుడు’ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంత వరకూ ఆయన వద్ద సరైన ‘పిఆర్వో’ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదు. ఏక వ్యక్తిపై ముఖ్యమంత్రి ‘పిఆర్వో’ వ్యవస్థ నడుస్తోంది. మొత్తం మీద..కూటమి ప్రభుత్వం కొన్ని విషయాల్లో సరిగానే పనిచేస్తోన్నా..వారు చేసింది చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా..దీనిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెడతారేమో చూడాలి.