లేటెస్ట్

'జగన్‌' మంచి సిఎంయేనా...!?

ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పుడు..తాను ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని సభా ముఖంగా ప్రకటించారు. తన తండ్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని, తాను పరిపాలన చేస్తానని, రాష్ట్రంలో అన్నివర్గాలకు న్యాయం చేస్తానని తెలిపారు. ఆయన చెప్పినట్లు నేటితో 'జగన్‌' ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆరు మాసాలు పూర్తి అయ్యాయి. మరి ఆయన ఆరు నెలల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు...? ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉందా..? ప్రజలంతా సుఖంగా ఉన్నారా...? ఆరు నెలల క్రితం ఆయన ప్రకటించినట్లు ఆయనను మంచి సిఎంగా వారు భావిస్తున్నారా..? రాజశేఖర్‌రెడ్డి వారసుడు ఆయన కంటే మంచి పరిపాలన అందిస్తున్నారని అంటున్నారా..? అనే ప్రశ్నలను ప్రజలను వేస్తే మిశ్రమ స్పందన వస్తోంది. 

గ్రామీణ ప్రాంతాల్లో మిశ్రమ స్పందన...!

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వివిధ వర్గాలకు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి వెంటనే వాటిని అమలు చేయడానికి ప్రయత్నాలు చేయడంపై ఒక వర్గం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా ఉండి, ఆయన పార్టీకి ఓటు వేసిన వారు ఆయన పాలన బాగుందనే అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత, రైతులు, రైతు కూలీలు, కార్మికుల్లో ఎక్కువ మంది 'జగన్‌' పాలనపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసిన వారు కూడా పాలన బాగుందా..? అంటే వెంటనే అవునని సమాధానం చెప్పలేకపోతున్నారు. పరిపాలన మారడంతోనే రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ వెంటనే ఒరిగేదేమీ లేదు. ఐదేళ్ల కాలంలోనే వారికి పాలకుల పనితీరు వల్ల లాభమో, నష్టమో తెలుస్తుంది. ప్రస్తుతానికి వైకాపా ప్రభుత్వం అమలు చేస్తోన్న 'రైతు భరోసా' కార్యక్రమంపై వారి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఆ పథకం వల్ల కొందరికి కొంత మేర సొమ్ములు ఖాతాల్లో పడ్డాయి. దాదాపు రైతుల్లో సగం మంది రైతులకు ఈ పథకం నుంచి సొమ్ములు అందలేదు. మరో వైపు 'జగన్‌' అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్గాలు పడి జలాశయాలు నిండడం వారిలో ఆనందాన్ని నింపింది. కరువు ప్రాంతాల్లో కరువు తీరా కురిసిన వర్షాలు..వారికి 'రాజశేఖర్‌రెడ్డి' ఉన్నప్పటి సెంటిమెంట్‌ను గుర్తు చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు దొరక్క, దొరికినా కూలీ రేట్లు అమాంతం పెరిగిపోవడం వారిలో నిరుత్సాహానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఉచితంగా వివిధ రాయితీలు ఇవ్వడం వల్ల కూలీలు దొరక్క రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పురుగు మందులు, ఎరువులు ఇతర వ్యవసాయపరికరాల రేట్లు భారీగా పెరిగిపోవడం వారిలో ఆగ్రహానికి కారణం అవుతోంది. మొత్తం మీద గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత కానీ సానుకూలత కానీ వ్యక్తం కావడం లేదు. వారిలో నిర్లప్తత వంటిది నెలకొందని చెప్పవచ్చు.

పట్టణ ప్రాంతాల్లో అసంతృప్తి...!

ఇక పట్టణ ప్రాంతాల్లో వైకాపా ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పవచ్చు. ఎక్కడ నలుగురి గుమికూడినా..ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతున్నారు. 'చంద్రబాబు' కంటే బాగా పరిపాలన చేస్తారనే భావనతో, యువకుడు అనే ఉత్సాహంతో చాలా మంది పట్టణ ప్రజలు వైకాపా వైపు మొగ్గారు. అయితే వారి అంచనాలను ముఖ్యమంత్రి అందుకోవడం లేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతీకార రాజకీయాలు చేయడం, ఇసుక కొరత సృష్టించడం, పనులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా దానిపై ఆధారపడిన రంగాలన్నీ కుదేలయ్యాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం, నూతనంగా ఉద్యోగాల సృష్టి లేకపోవడంతో వారు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

మధ్యతరగతి ప్రజల్లో అసహనం, అసంతృప్తి..!

మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ మంది గత ఎన్నికల్లో 'చంద్రబాబు' వైపే నిలిచారు. ప్రస్తుతం వీరంతా తాము ముందే ప్రజలను హెచ్చరించామని, 'జగన్‌'కు అనుభవం లేదని, ఆయన వల్ల రాష్ట్రానికి నష్టం చేకూరుతుందని చెప్పామని ఇప్పుడు అదే జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. పనులు లేకపోవడం, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం ఈ వర్గాలకే ఎక్కువ నష్టం చేకూరుస్తోంది. ప్రతీకార రాజకీయాలు, కుల రాజకీయాలు, అభివృద్ధిని విస్మరించడం, రాజధానిని పట్టించుకోకపోవడం, పోలవరం ప్రాజెక్టుపై నిరాసక్తత, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి నిలపకుండా ఒక వర్గానికో, మతానికో ప్రాధాన్యతను ఇవ్వడం ఈ వర్గాలకు రుచించడం లేదు. దీంతో..వారంతా అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

వ్యాపారుల్లో అసంతృప్తి...!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారుల్లో ఈ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 'జగన్‌' అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారాలు మందగించడంతో వారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ఆపి వేయడంతో...పనులు లేక వ్యాపారాలు లేక వ్యాపార వర్గాలు నీరసించిపోతున్నాయి. ముఖ్యంగా సిమెంట్‌, ఇనుము వ్యాపారాలు చేసే వారిలో చాలా మంది తమ వ్యాపారాలను ప్రస్తుతానికి ఆపివేశారు. 

దళిత, క్రిస్టియన్‌, రెడ్డి వర్గాల్లో సంతృప్తి...!

పై వర్గాలకు భిన్నంగా దళితులు, క్రిస్టియన్స్‌, రెడ్డి, ముస్లిం వర్గాలకు చెందిన వారు 'జగన్‌' పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో ఎక్కువ పథకాలు నేరుగా ఈ వర్గాలకే అందుతున్నాయి. దీంతో ఈ వర్గాల్లోని ప్రతి కుటుంబం ఏదో రకంగా ప్రభుత్వం నుంచి లబ్దిపొందుతోంది. గత ఎన్నికల్లో ఈ వర్గాలకు చెందిన వారిలో దాదాపు 90శాతం మంది 'జగన్‌'కు మద్దతు ఇచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 'జగన్‌' చేపట్టిన సంక్షేమపథకాల వల్ల వీరిలో సంతృప్తి కనిపిస్తోంది. అదే సమయంలో తమ మతానికి చెందిన వాడు ముఖ్యమంత్రి అయ్యాడని క్రిస్టియన్స్‌, తమ కులానికి చెందిన వారు ముఖ్యమంత్రి అయ్యారని 'రెడ్డి' వర్గీయులు సంతృప్తితో ఉన్నారు. పైగా 'రెడ్డి, క్రిస్టియన్‌' వర్గాలకు చెందినవారికి ప్రభుత్వ పదవుల్లోనూ, అధికార పదవుల్లోనూ పెద్ద పీట వేయడంతో..ఈ ప్రభుత్వం తమదనే భావనతో వారు దాన్ని ఓన్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా దళితులు ఇది  తమ స్వంత ప్రభుత్వమనే ధీమాతో ఉన్నారు. దీంతో ఈ వర్గాల్లో 'జగన్‌' పాలనపట్ల సానుకూలధోరణి వ్యక్తం అవుతోంది. సానుకూల ధోరణే కాకుండా నేరుగా ప్రభుత్వానికి మద్దతుగా ఈ వర్గానికి చెందిన వారు ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం నిరాధార వార్తలు రాస్తే..జర్నలిస్టులపై కేసులు పెడతామని  జీవో విడుదల చేసింది. దీనిపై సహజంగా జర్నలిస్టులు వ్యతిరేకతనువ్యక్తం చేశారు. కానీ..దీనిని సమర్థిస్తూ..దళిత, క్రిస్టియన్‌, ముస్లిం వర్గాలకు చెందిన జర్నలిస్టులు ప్రభుత్వానికి అనుకూలంగా ధర్నా చేశారంటే వారు ప్రభుత్వాన్ని ఎంతగా ఓన్‌ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది తమ ప్రభుత్వమని, దీనిపై ఈగ వాలినా సహించమనే ధోరణితో వారు ఉన్నారు. మొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తే..ఈ వర్గాలకు చెందిన వారే ఆయనను అడ్డుకున్నారు. దళితులకు, మైనార్టీలకు 'చంద్రబాబు' అన్యాయం చేశారని, అమరావతి నిర్మాణ సమయంలో తమ భూములకు తక్కువ ధర ఇచ్చారని ఆయనపై చెప్పులు వేశారు. ఇదంతా తమ ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికే. సమాజంలో మెజార్టీ ఓట్లు ఉన్న ఈ వర్గాలు గంపగుత్తగా 'జగన్‌'ను సమర్థిస్తున్నాయి. వీరి మద్దతు ఉంటే చాలునని, ఇతరులను తనను సమర్థించకపోయినా ఫర్వాలేదనట్లు 'జగన్‌' భావిస్తున్నారు. 

మొత్తం మీద ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆరు నెలల పాలన కొన్ని వర్గాలకు సంతృప్తిని పంచుతుండగా, మరి కొన్ని వర్గాలకు మాత్రం తీవ్రమైన అసంతృప్తిని పంచుతోంది. అదే సమయంలో కొన్ని వర్గాలు మాత్రం తాము ఆశించిన రీతిలో పాలన జరగడం లేదనే నిర్లిప్తతను వ్యక్తం చేస్తున్నాయి. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న 'జగన్‌' తాను అన్న మాటను నిలబెట్టుకోవడానికి ఇంకా గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. రాష్ట్ర జనాభా మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆయన మంచి ముఖ్యమంత్రా..? కాదా..? అంటే మిశ్రమ స్పందనే వస్తోంది. ఏకపక్షంగా ఆయనను మంచి సిఎంగా పేర్కొనడం లేదు. 

(600)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ