లేటెస్ట్

అప్పుడు 'ఆది'...ఇప్పుడు 'కొడాలి'...!

రాజకీయనాయకులు...గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో...? అధికారాన్ని ఎంత విచ్చలవిడిగా వాడి ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టారో..అధికారంలో ఉన్నంత కాలం గుర్తించరు. నాడు తాము చేసిన పనే నేడు తమ ప్రత్యర్థులు చేస్తే మాత్రం నానా యాగీ చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు మరోలా...వ్యవహరించడం వారికే చెల్లుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తాజాగా అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న దూషణలను పరిశీలిస్తే..ఇప్పుడు బాధిపక్షం...తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన దూషణలను అలవోకగా మరిచిపోయి..తాము సత్యహర్చింద్రలమన్నట్లు మాట్లాడుతున్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమను దూషిస్తుంటే...ఒకటే ఇదైపోతున్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాటి ప్రతిపక్షాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిందో...? ఎన్నిరకాలుగా దూషించిందో..? మరిచిపోయినట్లుంది. నాడు ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని, వారికి మంత్రి పదవులు కట్టబెట్టి...నాటి ప్రతిపక్షనేతపై విమర్శలు గుప్పించారు.  కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు నాడు 'జగన్‌'పై పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. 

నాడు వైకాపా తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికై టిడిపిలో చేరి మంత్రి పదవిని చేట్టిన 'ఆదినారాయణరెడ్డి' నాటి ప్రతిపక్షనేతపై నోటికి పట్టనట్లు విమర్శలు గుప్పించారు. 'జగన్‌' సామాజికవర్గానికే చెందిన 'ఆదినారాయణరెడ్డి'ని నాడు 'టిడిపి' ప్రయోగించి ఆయనను ఇబ్బందులకు గురిచేసింది. తనపార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి తనపైనే విమర్శలు చేస్తోన్న 'ఆది'ని చూసి..నాడు వైకాపా నాయకులు, సానుభూతిపరులు లబోదిబోమన్నారు. మంత్రి పదవి ఇచ్చారని ఇష్టారాజ్యంగా 'ఆది' వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాల చక్రం గిర్రున తిరగడంతో...నాడు ప్రతిపక్షంలో ఉన్నవారు నేడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వారి వంతు...! నాడు తనపై విమర్శలు చేయించి, నవ్వుకున్న 'చంద్రబాబునాయుడు'పై 'జగన్‌' అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. నాడు తన సామాజికవర్గానికి చెందిన 'ఆది'తో 'చంద్రబాబు' తదితరులు ఆరోపణలు, విమర్శలు చేయిస్తే..నేడు 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన 'కొడాలి నాని'తో 'జగన్‌' ఆ పనికానిస్తున్నారు. నాడు 'చంద్రబాబు' 'ఆది'కి మంత్రి పదవి ఇచ్చి...ప్రతిపక్షనేతపైకి ఉసిగొల్పితే..నేడు 'జగన్‌' 'కొడాలి'కి అదే మంత్రి పదవి ఇచ్చి...'చంద్రబాబు' సంగతిని తేలుస్తున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ తిట్లలో మాత్రం కొద్దిగా తేడా కనిపిస్తోంది. నాడు 'ఆది' 'జగన్‌'ను వ్యక్తిగతంగా విమర్శించలేదు. పార్టీ పరంగా, సిద్దాంత పరంగానే విమర్శించారు. నేడు మాత్రం 'కొడాలి' అవేవీ పట్టించుకోవడం లేదు. 'చంద్రబాబు'ను, ఆయన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రాయడానికి వీలు లేని భాషలో దూషిస్తున్న 'కొడాలి'ని చూసి వైకాపా నాయకులు సంబరాలు చేసుకుంటుంటే...టిడిపి నాయకులు, సానుభూతిపరులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి భాష, ఇవేం తిట్లు అంటూ నివ్వెరపోతున్నారు. తమ నాయకుడు రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేను చేస్తే..ఇలా వ్యక్తిగత దూషణలు చేస్తారా..? అంటూ దైన్యంగా ప్రశ్నిస్తున్నారు. మరి నాడు 'ఆది'ని కూడా 'జగనే' గెలిపించారు కదా..? నాడు వారూ అదే ఆవేదన చెందుంటారు కదా..? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని వైకాపా నాయకులు 'కొడాలి' దూషణలను సమర్థిస్తున్నారు. మొత్తం మీద..నాడు 'ఆది'అయితే...నేడు 'కొడాలి' ఆ పాత్రను పోషిస్తున్నారని చెప్పవచ్చు. 

(567)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ