50మంది ఐఏఎస్‌లను డిప్యూటేషన్‌పై తెచ్చుకోవాలి...!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా ఇంకా పాలనపై పట్టురావడం లేదని, దీనంతటికీ కారణం సీనియర్ ఐఏఎస్ అధికారులేనని కూటమి నాయకులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. గత ‘జగన్’ ప్రభుత్వంలో పనిచేసిన వారే ఇప్పుడూ కీలకస్థానాల్లో పనిచేస్తున్నారని, వీరంతా మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి వారిని ఇక్కడ నుంచి పంపించేసి, కేంద్రం నుంచి కనీసం 50 మంది ఐఏఎస్ అధికారులను డిప్యూటేషన్‌పై తెచ్చుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే విషయంపై ‘బిజెపి’కి చెందిన నాయకుడు ‘పాతూరి నాగభూషణం’ మాట్లాడుతూ ఐఏఎస్‌ల్లో ఎక్కువ మంది ఇంకా ‘జగన్’నే ప్రేమిస్తున్నారని, వీరు ‘జగన్’ ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారని భావిస్తున్నారని, వీళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ను, మంత్రులను లెక్కచేయడం లేదని, ఇటువంటి వారితో ఇంకా పనిచేయించడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. వీరందరినీ కేంద్రానికి పంపేసి, అక్కడ నుంచి కొంత మందిని డిప్యూటేషన్‌పై తెచ్చుకోవాలని, అప్పుడే పాలన గాడిలో పడుతుందని ఆయన సూచించారు. అయితే..ఆయన చెప్పినట్లు ఇది అయ్యేపనేనా..? రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌ల కొరత ఉందని, కొంత మందిని వెంటనే పంపాలని ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ కేంద్రానికి లేఖ రాసినా..వారు ఇంత వరకూ స్పందించ లేదు. కనీసం ఇద్దరు, ముగ్గురు అధికారులను పంపాలన్నా..కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 50 మందిని తెచ్చుకోవడం అయ్యేపనేనా..? అయితే..రాష్ట్రంలో పనిచేస్తోన్న ఐఏఎస్ అధికారులు సరిగా పనిచేయకపోతే..వారిని అక్కడ నుంచి తొలగించి..అదే స్థానంలో..దిగువస్థాయి అధికారులతో పనిచేయించుకోవచ్చు. కానీ..ముఖ్యమంత్రి ఇంకా వారిలో మార్పు వస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే..ఇది రోజు రోజుకు ప్రజలకు ఇబ్బందికరంగా తయారౌతోంది. ఇప్పటికైనా..అధికారులు తమ తీరు మార్చుకుని ప్రభుత్వానికి సహకరించాలి. ఒకవేళ వారు అదే విధంగా వ్యవహరిస్తే..బిజెపినాయకుడు చెప్పినట్లు..డిప్యూటేషన్ తప్ప ప్రభుత్వానికి మరో మార్గం ఉండదు.