WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

30సీట్లపై టిడిపి గురి...!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమైన నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా ముమ్మరంగా ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. రేపు రాష్ట్ర అసెంబ్లీనీ రద్దు చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో..ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలా..? అనేదానిపై టిడిడిపి నాయకులు ఎన్టీఆర్‌భవన్‌లో సమావేశం కాబోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో టిడిపి బలహీనపడినా..కార్యకర్తలు, సానుభూతిపరులు మాత్రం పార్టీని వీడలేదు. వారంతా...టిడిపిలోనే కొనసాగుతున్నారు. ఇక్కడ పార్టీకి ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సీట్లలో పోటీ చేయకుండా...గెలిచే సీట్లలోనే పోటీ చేయాలనే భావనతో టి.టిడిపి నాయకులు ఉన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి 'నారా లోకేష్‌' తాము అన్ని సీట్లకు పోటీ చేస్తామని చెబుతున్నా...అన్ని సీట్లలో పోటీ చేస్తే..పెద్దగా ప్రభావం ఉండదని..గెలిచే సీట్లలోనే పోటీ చేస్తే బాగుంటుందనే భావన తెలంగాణ సీనియర్‌ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. పొత్తులు గురించి ఆలోచించకుండా...గెలిచే సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తే ఎన్నికల తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చనేది టిడిపి నాయకుల ఆలోచన. కనీసం 50సీట్లలో గట్టిపోటీ ఇచ్చి...30సీట్లు కనుక టిడిపి గెలుచుకుంటే...ఎన్నికల తరువాత ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా..టిడిపిదే కీలక పాత్ర అవుతుందని..వారు చెబుతున్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు 'చంద్రబాబునాయుడు' కూడా ఇటువంటి ఆలోచనతోనే ఉన్నారట. 

 పూర్వ జిల్లాలైన హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లపై దృష్టిసారించాలని..ఇక్కడ టిడిపి బలంగా ఉందనే అంచనా పార్టీ నాయకుల్లో ఉంది. పొత్తు ఉంటే...ఒకరకంగా..పొత్తు లేకుంటే మరో రకమైన వ్యూహం రూపొందించుకోవాలని వారు భావిస్తున్నారు. ఒకవేళ ఏ పార్టీతో పొత్తు లేకుంటే ముక్కోణపు పోటీలో కొన్ని చోట్ల సులువుగా తాము విజయం సాధిస్తామని...అదే పొత్తు ఉంటే...కనీసం 30సీట్లలో గెలుపొందుతామని..ఆ మేరకు పొత్తులో సీట్లు సాధించుకోవాలని వారు చెబుతున్నారు. మొత్తం మీద..టిడిపి కనుక 30సీట్లు గెలిస్తే...రాబోయే ప్రభుత్వం టిడిపి మద్దతుపై ఆధారపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తమకు ఉన్న బలాన్ని నిలుపుకోవడానికి, ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచేందుకు...తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు 'నారా చంద్రబాబునాయుడు' త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే..కొన్ని రోజుల పాటు ఆయన తెలంగాణలో తిష్టవేయడం ఖాయం. మొత్తం మీద...30 సీట్లను టిడిపి టార్గెట్‌ పెట్టుకొని పనిచేస్తుందని..దాన్ని సాధించడం ఖాయమని..టిడిపి నాయకులు చెబుతున్నారు.

(264)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ