లేటెస్ట్

'ప్రజలు కోరిందే...ప్రభుత్వం చేసింది''

'దిశ' ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం...!

ఒంటరిగా ఒక అమ్మాయి కనిపిస్తే...కామంతో కాటేస్తాం...కాటేసి కాల్చేస్తాం..అంటూ వీరంగాలు వేసిన మృగాలకు తెలంగాణ పోలీసులు తుపాకులతో సమాధానం చెప్పారు. కామంతో మహిళలను కాటేసి వారికి బతుకు లేకుండా చేస్తామని, అటువంటి వారికి తుపాకే సమాధానం చెబుతుందని తమ చర్యల ద్వారా వారు సమాజానికి సందేశం పంపించారు. ఇటీవల తెలంగాణలో ఓ పశువైద్యురాలిని కిరాతకంగా రేప్‌ చేసి, ఆపై తగులపెట్టిన నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ చేశారు. ఉదయం ఈ వార్త దేశ వ్యాప్తంగా ప్రసారం కావడంతో...ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్‌పై సామూహికంగా రేప్‌ చేసి తగులపెట్టినవారిని శిక్షించాలంటూ, వారిని బహిరంగంగా ఉరితీయాలని ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిందితులను తీసుకెళుతోన్న పోలీసుల వాహనాలపైకి చెప్పులు, రాళ్లు విసురుతూ వారిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఒక వైపు దేశ ప్రజలు, మరో వైపు మీడియా ఈ సంఘటనపై ప్ర్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో పాలకులు తమపై ఒత్తిడిని తగ్గించుకునేందుకు, ప్రజలను సంతృప్తి పరిచేందుకు ఎన్‌కౌంటర్‌ ఆయుధాన్ని వాడి వారిని చల్ల బరిచారు.

అమాయకమైన ఆడపిల్లపై క్రూరంగా హింసించి రేప్‌ చేసిన మాన మృగాలను వెంటనే శిక్షించాలని హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ దాకా ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సంఘటన జరిగిన తరువాత..నిందితులను పట్టుకున్నా...తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో సామాన్య ప్రజలు, బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. మరో వైపు జాతీయ మీడియా తెలంగాణ ముఖ్యమంత్రిని ఉతికేరేసింది. సంఘటన తరువాత బాధితులను సిఎం పరామర్శించలేదని, కనీసం డీజీపీ సంఘటన స్థలానికి వెళ్లలేదని విమర్శించింది. మరోవైపు అదే సమయంలో తెలంగాణ హోంమంత్రి బాధితురాలిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో ప్రజల ఆగ్రహాన్ని సంతృప్తి పరిచే చర్యలు తీసుకోవాలని భావించిన ముఖ్యమంత్రి వారిని సంతృప్తిపడే చర్యలు చేయాలని పోలీసులకు సంకేతాలు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది.

నిందితులను అరెస్టు చేసిన వెంటనే ప్రజల నుంచి వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్లు జోరుగా వచ్చినా..పోలీసులు మౌనం వహించారు. అయితే ఎప్పుడైతే ప్రభుత్వ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించిందో..ఇక అప్పటి నుంచి చట్ట ప్రకారం చేయాల్సిన ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేశారు. నేర నిరూపణ కోసం నిందితులను బయటకు తెచ్చినప్పుడు ఇటువంటిది జరుగుతుందని సీనియర్‌ జర్నలిస్టులు రెండు రోజులుగా అంచనా వేశారు. వారి అంచనాలు నేడు నిజం అయ్యాయి. ప్రజల నుంచి, మీడియా నుంచి, ఇతర రాజకీయ పార్టీల నుంచి వస్తోన్న ఒత్తిడిని భరించలేక ప్రభుత్వం తనదైన రీతిలో చర్యలు తీసుకుని ఇప్పుడు వారితో జిందాబాద్‌లు కొట్టించుకుంటోంది. ఎన్‌కౌంటర్‌తో ప్రజలు శాంతి వచ్చు కానీ...పోలీసు వ్యవస్థలోని లోపాలు, ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలు ఈ ఎన్‌కౌంటర్‌తో మాయమైపోతాయా..? ఆపదలో ఉన్న మహిళలు పోలీసు స్టేషన్‌కు వస్తే...వారి ఆపద గురించి ప్రశ్నించకుండా...చులకనగా మాట్లాడిన పోలీసుల తప్పులను ఎవరు ఎన్‌కౌంటర్‌ చేస్తారు? అదే విధంగా సమాజంలో నైతిక విలువలను కోల్పోయేందుకు కారణమౌతున్న పరిస్థితులను నివారించకుండా...తప్పు చేసిన వారిని ఎన్‌కౌంటర్‌ చేస్తామని ఎన్ని హెచ్చరికలు చేసినా ఇటువంటి సంఘటనలు ఆగే పరిస్థితి లేదు. 

(564)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ