లేటెస్ట్

'ఢిల్లీ'లో 'జగన్‌' అవమానాలకు కారకులెవరు..?

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి వ్యూహకర్తలు పదే పదే విఫలం అవుతున్నారా...? ఆయనకు సరైన సలహాలు ఇవ్వడంలో, ఢిల్లీ స్థాయిలో 'జగన్‌' ఇమేజ్‌ను పెంపొందించడంలోనూ వారు విఫలం అవుతున్నారా..? సరైన సమాచారాన్ని వారు 'జగన్‌'కు అందించలేకపోతున్నారా..? వారి వైఫల్యాల వల్ల 'జగన్‌'కు అవమానాలు ఎదురవుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌ పదవి స్వీకరించి ఆరు నెలల కాలంలో ఢిల్లీ స్థాయిలో ఆయనకు పదే పదే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన 'జగన్‌'కు ఢిల్లీలో రావాల్సినంత వెయిట్‌ రావడం లేదు. లోక్‌సభలో మూడో అతి పెద్ద పార్టీ అయిన వైకాపాను ఢిల్లీలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఒకప్పుడు జాతీయ మీడియా మొత్తం 'జగన్‌'ను ఏకపక్షంగా సమర్థించగా...నేడు జాతీయ మీడియా ఆయనను రోజూ విమర్శిస్తోంది. పలు అంశాలను ప్రస్తావిస్తూ...ఆంధ్రా అభివృద్ధిలో వెనుకబడి పోయిందని, ఆయన దుబారా ఖర్చు చేస్తున్నారని, మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్నారని, స్వంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆరు నెలల్లో పాలన కుంటుబడిపోయిందని పదే పదే వ్యాఖ్యలు చేస్తూ, సంపాదకీయాలు రాస్తూ...జాతీయ స్థాయిలో 'జగన్‌' ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఈ ప్రచారాన్ని ఆపడంలో 'జగన్‌' మీడియా సలహాదారులు ఎప్పుడో విఫలం కాగా...'జగన్‌' కుడిభుజం..'విజయసాయిరెడ్డి' లాబీయింగ్‌లో ఇటీవల దారుణంగా వెనుకబడిపోతున్నారు. ఆయన హవా అక్కడ తగ్గడంతో...'జగన్‌'కు పలుసమస్యలు ఎదురవుతున్నాయనే విశ్లేషణలు వెలుడుతున్నాయి. 

తాజాగా..ముఖ్యమంత్రి జగన్‌ రెండు రోజుల పాటు జరిపిన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయనకు తీవ్ర అవమానం ఎదురైంది. నిన్న ఆసక్మికంగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. 'అనంత'లో 'కియా' సంస్థను ప్రారంభించిన వెంటనే ఆగమేఘాలపై ఆయన ఢిల్లీకి బయలు దేరారు. హఠాత్తుగా ఢిల్లీకి ఎందుకన్న ప్రశ్నపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ..కడపలో ఏర్పాటు చేయబోయే స్టీల్‌ కర్మాగారం శంఖుస్థాపనకు ప్రధానిని మోడీని ఆహ్వానించేందుకు, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను విన్నవించేందుకు అని సమాధానం వచ్చింది. నిన్న రాత్రి 8.30గంటలకు ముఖ్యమంత్రి కేంద్రహోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా'తో భేటీ అవుతారని లీకులు ఇచ్చారు. అయితే రాత్రంతా వేచి చూసినా..హోంమంత్రి నుంచి భేటీకి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. అర్థరాత్రి వరకు సిఎం కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌తో పాటు, విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేసినా..వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఉదయం పూట హోంమంత్రిని కలుస్తారని మీడియా వర్గాలు చెప్పుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం కూడా హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ లభించలేదు. 'అమిత్‌షా' ముందుగా నిర్ణయించుకున్న 'సూరత్‌' పర్యటనకు వెళ్లిపోయారు. తరువాత ప్రధానిని 'సిఎం' జగన్‌ కలుస్తారనే వార్తలు వచ్చినా..అదీ నిజం కాలేదు. తరువాత ముఖ్యమంత్రికి సన్నిహితుడైన వ్యక్తి మృతి చెందాడని ముఖ్యమంత్రి నేరుగా కడపకు వెళ్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. వారు చెప్పినట్లే ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని...కడపకు వెళ్లిపోయారు.

నిన్నంతా హఠాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకుని..'జగన్‌' అక్కడకు వెళ్లి సాధించినదేమిటనే ప్రశ్న వివిధ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ముందస్తు కసరత్తు లేకుండా సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటన పెట్టిందెవరు..? హోంమంత్రి, ప్రధాని మోడీని కలుస్తారని ప్రచారం చేయించిందెవరు.? అసలు అక్కడ అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకుండానే ఇక్కడ నుంచి సిఎంను బయలు దేర తీసిందెవరు...? ఎక్కడ సమాచార లోపం ఉంది..? ముఖ్యమంత్రి సన్నిహితులు, సలహాదారులు, మీడియా సలహాదారులు ఏమి చేస్తున్నారు...? బిజెపి పెద్దల అపాయింట్‌మెంట్‌ లేకుండా...సిఎంను అక్కడకు తీసుకెళ్లి అవమానాల పాలు చేసిన వారెవరు..? హోంమంత్రి, ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరికిన తరువాతే 'జగన్‌' ఢిల్లీ పర్యటనకు వెళ్లారని వైకాపా వర్గాలు చెబుతుండగా...అటువంటిదేమీ లేదని, ఆయన ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఢిల్లీకి వచ్చారని రాష్ట్రానికి చెందిన ఓ మాజీ మంత్రి చెబుతున్నారు. నిన్ననే ఆయన రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్‌ జర్నలిస్టుతో మాట్లాడుతూ హోంమంత్రి, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ 'జగన్‌'కు దొరకదని తేల్చి చెప్పారు. నిన్న రాత్రి 8-9 గంటల ప్రాంతంలో ఆయన ఆ సీనియర్‌ జర్నలిస్టుతో మాట్లాడుతూ..అమిత్‌షా 'జగన్‌'ను కలవాలనుకోవడం లేదని చెప్పారట. అయితే 'జగన్‌' అపాయింట్‌మెంట్‌ లేకుండా రారని, కలుస్తారేమో చూద్దామని కూడా వ్యాఖ్యానించారట. అయితే ఆయన చెప్పినట్లు రాత్రి కానీ శుక్రవారం ఉదయం కానీ...అమిత్‌షా 'జగన్‌'ను కలిసేందుకు ఆసక్తి చూపించలేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి. సిఎంను కలవడానికి ఇష్టపడని 'అమిత్‌షా' వద్దకు 'జగన్‌'ను తీసుకెళ్లి అవమానాలు పాలు చేయడం ఏమిటనే ప్రశ్న వైకాపా సామాన్య కార్యకర్తల నుంచి పెద్దస్థాయి నాయకుల వద్ద నుంచి కూడా వస్తోంది. తన వ్యక్తిగత సమస్యలను చెప్పుకోవడానికే ముఖ్యమంత్రి 'జగన్‌' ఢిల్లీకి వస్తున్నారనే అభిప్రాయంతోనే 'అమిత్‌షా' ఆయనను కలిసేందుకు ఇష్టపడలేదని బిజెపి వర్గాలు చెబుతున్నారు. మొత్తం మీద...రెండు రోజుల పాటు హోంమంత్రి, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ పేరుతో ఆయనను ఢిల్లీ సాక్షిగా అవమానించారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ వ్యక్తం అవుతోంది. ఇంతకీ 'జగన్‌'ను ఈవిధంగా అవమానాలు పాలు చేస్తోందెవరు..? అంటే ఆయన సన్నిహితులు,మీడియా సలహాదారులే అనే సమాధానం వస్తోంది. 

(962)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ