WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రెండు వారాల్లో ఇంత తేడా వచ్చిందా...'రాధాకృష్ణా'...!

తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ 80కి పైగా స్థానాలు సాధిస్తుందని.. తెలుగుదినపత్రిక 'ఆంధ్రజ్యోతి' మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రముఖ జర్నలిస్టు 'రాధాకృష్ణ' తన వ్యాసం 'కొత్తపలుకు'లో రాయడంపై పలు రకాలైన విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఏ ప్రాతిపదికన టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు...? ఆయన రాసిన రాతలకు విశ్వసనీయత ఉందా..? ఎందుకు ఈ విధమైన రాతలు రాశారనే దానిపై అటు రాజకీయ నాయకుల్లోనూ, అటు సోషల్‌ మీడియా వేదికగా పలు రకాలైన విమర్శలు వస్తున్నాయి. కేవలం రెండు వారాల ముందు..ముందస్తు ఎన్నికలు జరిగితే...టిఆర్‌ఎస్‌ గెలుపు కష్టమేనని రాసిన 'రాధాకృష్ణ' ఈ రోజు టిఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలుస్తుందని, అదీ బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని ప్రకటించడంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు క్షేత్రస్థాయిలో టిఆర్‌ఎస్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాసిందీ..ఆయనే...సంక్షేమ పథకాలు..ప్రజలకు అందడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవనీ చెప్పిందీ ఆయనే..దిగువ స్థాయిలో సంతృప్తి లేదని..టిఆర్‌ఎస్‌పై అసంతృప్తి ఉందని..రాసిన ఆయన ఈ రోజు టిఆర్‌ఎస్‌ గెలుస్తుందని రాయడంపై అభ్యంతరాలు, ఆక్షేపణలు, విమర్శలు, ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు 'రాధాకృష్ణ' రెండు వారాల్లోనే ఇలా రాశాడు..అనే దానిపై తీవ్ర స్థాయిలో కలకలం చెలరేగుతోంది. 

  ఆగస్టు26న ఆయన రాసిన 'కొత్తపలుకు' వ్యాసంలో కాంగ్రెస్‌,టిడిపి పొత్తు పెట్టుకుంటే..టిఆర్‌ఎస్‌ గెలుపు కష్టమేనన్నారు. టిడిపి ఇంకా క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు టిడిపి వైపే ఉన్నారని వారితో కాంగ్రెస్‌ గెలిస్తే..టిఆర్‌ఎస్‌ గట్టెక్కడం కష్టమని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసినా..టిఆర్‌ఎస్‌దే విజయమని చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా తెలంగాణలో కెసిఆర్‌ను ఓడించడం కష్టమని..'చంద్రబాబు' పొత్తులగురించి ఆలోచించకుండా..ఆంధ్రా రాజకీయాల గురించి చూసుకుంటే మంచిదని సలహా ఇవ్వడంపై అటు తెలంగాణకు చెందిన టిడిపి నాయకులు, ఇటు ఆంధ్రాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'రాధాకృష్ణ' స్వయం ప్రయోజనాల కోసం టిడిపితో ఆడుకుంటున్నారని..ఆయనకు 'చంద్రబాబు' ఇచ్చిన చనువుతోనే..చివరకు ఎవరితో పొత్తు ఉండాలో..ఎవరితో పొత్తు ఉండకూడదో..ఆయనే నిర్ణయిస్తున్నారని..విమర్శిస్తున్నారు. తాను చెప్పినట్లు...చంద్రబాబు ఆడకపోతే...బ్లాక్‌మెయిలింగ్‌ రాతలకు పాల్పడుతున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు.  

(6673)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ