లేటెస్ట్

'జగన్‌'పై బిజెపి పెద్దల కోపానికి కారణాలు ఇవే...!?

ఆరు నెలల క్రితం బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన 'వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి'ని బిజెపి పెద్దలు తమ చిన్నతమ్ముడిగా భావించారు. అపర రాజకీయ చాణిక్యుడు, పరిపాలనాదక్షుడైన 'చంద్రబాబు'ను చిత్తుచిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన 'జగన్‌'కు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తామని హామీ ఇచ్చారు. తమను ధిక్కరించిన 'చంద్రబాబు'కు బుద్దిచెప్పడంలో 'జగన్‌'కు సహకరించిన 'బిజెపి పెద్దలు' 'జగన్‌' బాగానే సహకరిస్తారని విశ్లేషకులు కూడా భావించారు. దాన్ని నిజం చేస్తూ...రెండోసారి ప్రధాని హోదాలో 'నరేంద్రమోడీ' తిరుపతి సభకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి పర్యటనలో 'జగన్‌' కూడా బిజెపి పెద్దల పట్ల తన వినయవిధేయతలను బాగానే చాటుకున్నారు. ప్రధాని మోడీ కాళ్లకు నమస్కారం చేశారు. దీంతో తాము గెలిపించిన 'జగన్‌' తమ కనుసన్నల్లోనే ఉంటాడని వారు భావించారు. 'జగన్‌' ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళితే బాగానే ఆదరించారు. రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక సహాయం, ఇతర సహాయాలు చేస్తామని వాగ్ధానం చేశారు. ఇదంతా 'జగన్‌' అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపే. ఈ వంద రోజుల్లో బిజెపి, వైకాపాలు కలసి 'చంద్రబాబు'ను ఎలా కేసుల్లో ఇరికించాలా..? ఆయనను ఎలా వేధించాలా..? అని తీవ్రంగా ఆలోచించి గత ప్రభుత్వాల తప్పులను వెతికారు. ఈ తప్పులను వెతికే క్రమంలో అనుకోకుండా 'పీపీఏ'ల సంగతి బయటకు వచ్చింది. దీనిపై బిజెపి పెద్దలను సంప్రదించకుండానే 'జగన్‌' వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదేదో చిన్న విషయం అని భావించినా..తరువాత దాని లోతు అర్థం అయ్యేసరికి 'జగన్‌'కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

వంద రోజులలోపే 'బిజెపి' పెద్దలకు 'జగన్‌'పై అసంతృప్తి,అసహనం, కోపం కలగడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది సోలార్‌, విండ్‌ పవర్‌ ఒప్పందాలను రద్దు చేయడం. 'పీపీఏ'ల ఒప్పందాల్లో అవినీతి జరిగిందని, 'చంద్రబాబు' ఆయనకు కావాల్సిన కంపెనీలకు దోచిపెట్టాడని, వీటన్నింటిని రద్దు చేసి 'చంద్రబాబు' అవినీతిని బహిర్గతం చేయాలనే ఉద్దేశ్యంతో వాటిని కదిలించారు. అయితే వాస్తవానికి 'పీపీఏ'లు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే జరిగాయి. అయినా...అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో 'పీపీఏ'ల తేనెతుట్టెను కదిలించారు. దీన్ని కదిలించడంతో సోలార్‌,విండ్‌ పవర్‌ల్లోపెట్టుబడులుపెట్టిన అంతర్జాతీయ సంస్థల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. దేశంలో సోలార్‌,విండ్‌ పవర్‌లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ అప్పట్లో వివిధ అంతర్జాతీయ సంస్థలతో స్వయంగా మాట్లాడారు. అటువంటి సంస్థల్లో ఒకటైన 'జపాన్‌'కు చెందిన సంస్థ 'మోడీ'తో చాలా సాన్నిహిత్యం జరుపుతోంది. పీపీఏల సెగ ఆ సంస్థకు తగలడంతో అది నేరుగా ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రధాని కార్యాలయం, కేంద్ర మంత్రిత్వశాఖ పీపీఏల్లో అవినీతి లేదని, ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదని నేరుగా లేఖలు రాసినా 'జగన్‌'పట్టించుకోలేదు. దీంతో విషయం ప్రధాని, అమిత్‌షాల దృష్టికి వెళ్లింది. 'జగన్‌'పై తొలిసారి అసంతృప్తి, అసహనం కలగడానికి ఇది మొదటి కారణం.

ఇక రాష్ట్రంలో మత మార్పిడిల విషయం కేంద్రహోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా' దృష్టికి వెళ్లడంతో ఆయన ఈవిషయంపై సీరియస్‌గా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ మతమార్పిడిల విషయం గురించి ఎవరో ఒకరు జాతీయ బిజెపి నాయకులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ విషయంలో నేరుగా 'అమిత్‌షా'ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పరిపాలనపై దృష్టి పెట్టకుండా...ఇతర విషయాలపై అధిక దృష్టి కేంద్రీకరిస్తోన్న 'జగన్‌'పై వారు లోలోపల తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఇక 'పోలవరం' ప్రాజెక్టు విషయంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లవద్దన్నా..వారి మాటలు ఖాతరు చేయకుండా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం కూడా అసంతృప్తికి కారణమే. అమిత్‌షా, గడ్కరీ తదితర సీనియర్‌ మంత్రులకు సన్నిహితమైన కాంట్రాక్టర్లను కాదని తనకు కావాల్సిన సంస్థలకు పోలవరం టెండర్లు కట్టబెట్టడం కూడా వారి కోపానికి కారణమైంది. ఇది కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో స్నేహం, రాష్ట్రంలో తన ఓటు బ్యాంక్‌కు పెంచుకోవడానికి సంక్షేమపథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిని పక్కన పెట్టడం మరో కారణం. ఇది కాక..టిడిపికి చెందిన మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని..బిజెపిని ఎదగనీయకుండా చేయడం తదితర కారణాలతో నిన్నటి వరకు తమ్ముడిలా భావించిన వ్యక్తికి ఇప్పుడు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి బిజెపి పెద్దలు మొహం చాటేస్తున్నారు. మొత్తం మీద బ్రహ్మాండమైన మెజార్టీ రావడానికి, 'జగన్‌' గెలుపు కోసం తమ వంతు సహకరిస్తే..తాము ఆశించిన విధంగా ఆయనవ్యవరించడం లేదనే కారణాలతోనే 'బిజెపి' పెద్దలు 'జగన్‌'పై అసంతృప్తికి, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా..? లేక బిజెపి పెద్దలను తన చర్యల ద్వారా మళ్లీ 'జగన్‌' దారికి తెచ్చుకుంటారా..? చూడాలి ఏం జరుగుతుందో..? 

(986)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ