WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ ఎమ్మెల్యేలు హ్యాట్రిక్‌ సాధించేనా..!?

గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో రెండుసార్లు విజయంసాధించిన పలువురు ఎమ్మెల్యేలు మూడవ సారి కూడా విజయంసాధించి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేలుగా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నారు. వారి కోరికలను, ఆశలను ఓటర్లు నెరవేరుస్తారా..? లేదా..అనేది త్వరలో జరగనున్న ఎన్నికల్లో తేలనుంది. 2009,2014ల్లో వినుకొండ, పెదకూరపాడు, గురజాల (1994లో విజయం సాధించి 1999,2004లో ఓడిపోయారు) వేమూరు నియోజకవర్గాల నుండి విజయంసాధించిన 'జి.వి.ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనంద్‌బాబుల ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాము మళ్లీ గెలిచి హ్యాట్రిక్‌ సాధించి కోడెల, మాకినేని, కన్నా, ధూళ్లిపాళ్ల నరేంద్ర వలే సంచలనం సృష్టిస్తామని అంటున్నారు. ఈ నలుగురు..మళ్లీ టిడిపి అభ్యర్థులుగా పోటీ చేయడం ఖాయం..వారు విజయం సాధించడం కూడా ఖాయమంటున్నారు టిడిపి నాయకులు. ఈ నలుగురిలో గురజాల ఎమ్మెల్యే 'యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో మిగతా వారి కన్నా ఎక్కువ పట్టు సాధించారు. వినుకొండ, పెదకూరపాడు, వేమూరు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసే నాయకుల్లో ఆ ముగ్గురికి ధీటైన వారు లేరన్నది వాస్తవం. 'యరపతినేని'పై పోటీ చేయాలంటే...కాసు కుటుంబమే వెనకడుగు వేస్తుందంటే గురజాలలో పరిస్థితి ఏమిటో స్పష్టం అవుతోంది. వినుకొండలో గతంలో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన 'యలమందరావు' రాజకీయాలకు దూరమయ్యారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయంసాధించిన 'మక్కెన మల్లిఖార్జునరావు' ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన బ్రహ్మనాయుడు ఈ సారి సొంత నియోజకవర్గమైన వినుకొండ నుండి పోటీ చేయబోతున్నారు. 'యరపతినేని' ఆంజనేయులు, శ్రీధర్‌లతో పాటు నక్కా ఆనంద్‌బాబులు కూడా ఆర్థికంగా స్థితిమంతులే. ఎవరెవరు ఎన్నికల్లో ఎన్నికోట్లు ఖర్చు పెడతారో..కానీ..ఆ నలుగురు అభ్యర్థులను ఎదుర్కోవడం వైకాపా అభ్యర్థులకు సాధ్యపడదని అంటున్నారు. గుంటూరు జిల్లాలో హ్యాట్రిక్‌ సాధించిన ఘనత కొందరికే సాధ్యపడింది. తాజాగా ఈ నలుగురికి కూడా అటువంటి ఘనత దక్కే అవకాశం ఉంది. నలుగురిలో 'యరపతినేని'ని ఏదో విధంగా ఓడించాలనే లక్ష్యంతో 'జగన్‌' ఉన్నారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'నక్కా'కు వ్యతిరేకత కనిపించడం లేదు. వినుకొండలో 'ఆంజనేయులు'ను రెండుసార్లు గెలిపించిన ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఉన్నా..టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేయరనేది వాస్తవం. అదే విధంగా పెదకూరపాడులో వైకాపాకు బలమైన నాయకుడు లేకపోవడం శ్రీధర్‌కు కలసివచ్చే అవకాశం ఉంది. దీంతో..ఈ నలుగురు మళ్లీ గెలవగలరని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

(గొరజవోలు శ్రీనివాసరావు)

(206)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ